భారత ప్రధాని మోదీకి, పాక్ ప్రధాని షరీఫ్ కి 100 మంది నిపుణుల లేఖ
భారత ప్రధాని నరేంద్ర మోదీకి , పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి 100 మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు లేఖ రాశారు. ఈ లేఖని ఇరు దేశాలకు చెందిన వ్యక్తులు సంయుక్తంగా రాశారు. ఇరు దేశాల మధ్య తిరిగి ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలని, సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని అందులో కోరారు.
ద్వైపాక్షిక సంబంధాలలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ విజ్ఞప్తి వచ్చింది. ఇరు ప్రభుత్వాలు చర్చలను పునఃప్రారంభించాలని, వాణిజ్య, రవాణా సంబంధాలను తిరిగి తెరవాలని, ప్రజల మధ్య సత్సంబంధాలు మళ్లీ రావాలని వారు ఆ లేఖలో కోరారు.
సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ జారీ చేసిన ఈ విజ్ఞప్తిపై భారతదేశానికి చెందిన 61 మంది, పాకిస్తాన్‌కు చెందిన 56 మందితో సహా మొత్తం 117 మంది సంతకాలు చేశారు. ఈ సుదీర్ఘ శత్రుత్వం లక్షలాది మంది యువతకు అవకాశాలను, శ్రేయస్సును, సురక్షితమైన భవిష్యత్తును దూరం చేస్తోందని పేర్కొంటూ, ఇరు ప్రభుత్వాలు దీనిని అంతం చేయాలని ఆ విజ్ఞప్తి కోరింది.
భారత దేశం పక్షాన ఆ లేఖలో సంతకం చేసిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, PDP చీఫ్ మెహబూబా ముఫ్తీ, RJD ఎంపీ మనోజ్ ఝా మరియు TMC మాజీ మంత్రి మరియు ప్రస్తుత AJUP నాయకుడు హుమయూన్ కబీర్ ఉన్నారు. పాక్ పక్షాన విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరి, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ జహంగీర్ ఖాజీ, జాతీయ అసెంబ్లీ సభ్యుడు ఇస్ఫనీర్ భండారా, అణు భౌతిక శాస్త్రవేత్త మరియు రచయిత పర్వేజ్ హుడ్భోయ్ ఉన్నారు.
పూర్తి దౌత్య సంబంధాలను పునరుద్ధరించడం, న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్‌లలో హై కమిషనర్లను తిరిగి నియమించడం, సాధారణ వీసా సేవలను పునఃప్రారంభించడం మరియు వాణిజ్య విమానాల కోసం గగనతలాన్ని తిరిగి తెరవడం వంటి విశ్వాస నిర్మాణ చర్యలను పునరుద్ధరించాలని సంతకాలు చేసినవారు ఇద్దరు నాయకులను కోరారు.








