ఒక చౌక లాడ్జ్ అతని జీవితాన్నే మార్చేసింది… 18 వేల కోట్ల ఆస్తికి యజమాని చేసింది!! ఎలా
సూర్య ప్రకాష్ జోశ్యుల..
“ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు ఎప్పుడూ బోర్డు రూమ్‌లలో పుట్టవు… ఆస్తి కొన్నిసార్లు అవి ఒక చెత్త గదిలో, ఒక నిద్రలేని రాత్రిలో పుడతాయి.” ఒక రాత్రి… 11 గంటలు. జేబులో పెద్దగా డబ్బుల్లేవు. దొరికిన చౌక లాడ్జ్‌లోకి అడుగుపెట్టాడు. గదిలోకి వెళ్లి ఒక్కసారి చుట్టూ చూసాడు. దుమ్ముతో నిండిన గది… చిరిగిపోయిన బెడ్‌షీట్… సరిగ్గా పనిచేయని బాత్రూమ్… అక్కడ ఒక్క రాత్రి గడపాలన్నా విసుగు పుట్టే పరిస్థితి. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నీ ఆ నిద్రలేని రాత్రే ఒక ప్రశ్నను పుట్టించింది…
“బడ్జెట్లో మంచి గది దొరకడం ఇంత కష్టమా?”
ఆ ఒక్క ప్రశ్నే తర్వాత భారతదేశంలోని లక్షలాది మంది ప్రయాణికుల అనుభవాన్ని మార్చింది. అదే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక హోటల్ సామ్రాజ్యానికి బీజం వేసింది. ఆ యువకుడి పేరు… రితేష్ అగర్వాల్. ఒకప్పుడు చౌక లాడ్జ్‌లో రాత్రి గడపాల్సి వచ్చిన అతడే… ఈ రోజు తన కంపెనీని ₹6,650 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్తున్నాడు.
చిన్న గ్రామం… పెద్ద కల
రితేష్ అగర్వాల్ ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఉన్న బిస్సంకటక్ అనే చిన్న గ్రామంలో పెరిగాడు. స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, పెద్ద కంపెనీల గురించి మాట్లాడే వాతావరణం అక్కడ లేదు. కానీ చిన్నప్పటి నుంచే సమస్యలను గమనించి, వాటికి పరిష్కారం వెతకడం అతని అలవాటైంది. ఎనిమిదేళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. పదహారేళ్లకే ముంబైలో జరిగిన ఆసియన్ సైన్స్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. చదువులో ప్రతిభ ఉన్నా, అతని మనసు ఉద్యోగం వైపు కాదు… సొంతంగా ఏదైనా నిర్మించాలనే కల వైపు పరుగులు తీసింది.
మొదటి ప్రయత్నం… మొదటి ఎదురుదెబ్బ
కాలేజీలో చేరిన కొద్ది రోజులకే చదువు మానేశాడు. చాలామంది దాన్ని జీవితంలో చేసిన పెద్ద తప్పు అనుకున్నారు. న తొలి స్టార్టప్ “వర్త్ గ్రోత్ పార్ట్నర్స్” కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. వ్యాపారం విఫలమైంది. కానీ రితేష్ ఆ పరాజయాన్ని ఓటమిగా కాకుండా, జీవిత పాఠంగా తీసుకున్నాడు. “చిన్న వయసులో ఓడిపోవడం ఒక వ్యాక్సిన్లాంటిది. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించడానికి భయం ఉండదు” అని తర్వాత చెప్పాడు. ఆ వైఫల్యాలు అతన్ని ఆపలేదు. అవే అతన్ని మరింత దృఢంగా మార్చాయి. ఈ రోజు అదే యువకుడు భారతదేశపు అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచాడు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, రితేష్ అగర్వాల్ నికర ఆస్తి విలువ సుమారు ₹18,402 కోట్లు (దాదాపు 2 బిలియన్ డాలర్లు).
ఇవి కూడా చదవండి
ఈవెంట్లలో దొంగ ఎంట్రీ.. ఇప్పుడు గ్లోబల్ కంట్రీ!
డబ్బు లేకపోయినా దేశమంతా జరిగే స్టార్టప్ ఈవెంట్లకు వెళ్లేవాడు. కొన్ని చోట్ల టికెట్ కొనడానికి కూడా డబ్బు ఉండేది కాదు. అయినా ఏదోలా లోపలికి వెళ్లి కొత్త ఆలోచనలు, కొత్త మనుషులను కలిసేవాడు. తి ప్రయాణంలో ఒకే సమస్య ఎదురయ్యేది… చౌక హోటళ్లు. బయట బోర్డు ఒకలా ఉంటుంది. గదిలోకి వెళ్లాక అసలు పరిస్థితి మరోలా ఉంటుంది. అనుభవాలే అతని జీవితాన్ని మార్చేశాయి.
OYO పుట్టక ముందు… మరో కంపెనీ ఉంది
2012లో “ఒరవెల్” పేరుతో ఒక స్టార్టప్ ప్రారంభించాడు. అది Airbnb తరహా హోమ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్.పెట్టుబడిదారుల నుంచి రూ.30 లక్షల పెట్టుబడి కూడా వచ్చింది. కానీ భారతీయుల అవసరం అది కాదని అతి త్వరలోనే అర్థమైంది. మన దేశంలో ఖాళీ ఇళ్లు కాదు… నమ్మకమైన బడ్జెట్ హోటళ్లే పెద్ద సమస్య అని గుర్తించాడు. ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒరవెల్ను దాదాపు మూసేసి… కొత్తగా OYOను ప్రారంభించాడు. అదే నిర్ణయం అతని జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది.
అసలు OYO ఎందుకు సక్సెస్ అయింది?
రితేష్ అగర్వాల్ విజయం కేవలం ఒక కంపెనీని ప్రారంభించడంలో లేదు… ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యను గుర్తించడంలో ఉంది. ఆ సమయంలో భారత్‌లో బడ్జెట్ హోటళ్లు వేల సంఖ్యలో ఉన్నా, వాటిలో నాణ్యతకు ఎలాంటి హామీ ఉండేది కాదు. ఒక హోటల్లో మంచి అనుభవం వస్తే, మరో హోటల్లో పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఉండేది. ఏ గదిలో పరిశుభ్రత ఉంటుందో, ఏ గదిలో వేడి నీళ్లు వస్తాయో, ఏ హోటల్ సురక్షితమో ముందే చెప్పలేని పరిస్థితి. రితేష్ అగర్వాల్ ఇదే సమస్యను వ్యాపార అవకాశంగా మార్చాడు. OYO హోటళ్లు స్వయంగా నిర్మించలేదు. ఇప్పటికే ఉన్న చిన్న, మధ్యతరహా హోటళ్లతో భాగస్వామ్యం చేసుకుంది. వారికి OYO బ్రాండ్, టెక్నాలజీ, ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్, మార్కెటింగ్, ధరల నిర్వహణ, సేవల ప్రమాణాలను అందించింది. ప్రతిగా ఆ హోటళ్లు ఒకే విధమైన నాణ్యతను పాటించేలా చేసింది. దీంతో వినియోగదారులకు “OYO బుక్ చేస్తే కనీసం ఏ స్థాయి గది వస్తుందో తెలుసు” అనే నమ్మకం ఏర్పడింది. అదే కంపెనీకి అతిపెద్ద బలం అయింది. అంతేకాదు, మొబైల్ యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లో గది బుక్ చేసుకునే సౌకర్యం, తక్కువ ధరలు, దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడం OYOను సాధారణ హోటల్ చైన్ నుంచి ఒక టెక్నాలజీ ఆధారిత హాస్పిటాలిటీ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాయి.
ఇంకో కీలక నిర్ణయం ఏమిటంటే… భారత్‌లో విజయంతో ఆగిపోకుండా అమెరికా, యూరప్ వంటి మార్కెట్లలోకి ప్రవేశించడం. అమెరికాలో Motel 6, Studio 6 వంటి ప్రముఖ హోటల్ బ్రాండ్లను కొనుగోలు చేయడంతో OYO ఒక భారతీయ స్టార్టప్ మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి హాస్పిటాలిటీ కంపెనీగా ఎదిగింది. సంక్షిప్తంగా చెప్పాలంటే… OYO గదులను అమ్మలేదు. “నమ్మకాన్ని” అమ్మింది. అదే దాని అసలు విజయ రహస్యం.
ఒకరు నమ్మారు… ప్రపంచం గమనించింది
కేవలం 19 ఏళ్ల వయసులో ప్రపంచ ప్రఖ్యాత థీల్ ఫెలోషిప్‌కు ఎంపికైన తొలి భారతీయుడిగా నిలిచాడు. లక్ష డాలర్ల గ్రాంట్ మాత్రమే కాదు… ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి కూడా అతనిపై పడింది. అయితే అందరూ అతన్ని నమ్మలేదు. ఒక ప్రముఖ ఇన్వెస్టర్‌కు కేవలం రూ.30 లక్షలకు OYOలో 15 శాతం వాటా కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. “ఇది పెద్దగా వర్కవుట్ కాదు” అనుకుని ఆ అవకాశాన్ని వదిలేశాడు. తర్వాత అదే నిర్ణయం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటని ఆయనే ఒప్పుకున్నాడు. చిన్న కంపెనీ నుంచి ప్రపంచ హోటల్ నెట్వర్క్ వరకు ఈ రోజు OYO కేవలం భారతీయ కంపెనీ కాదు. PRISM పేరుతో 35కు పైగా దేశాల్లో 43 బ్రాండ్లను నిర్వహిస్తోంది.
సుమారు 24 వేల హోటళ్లు… లక్షకు పైగా హోమ్స్… మొత్తం దాదాపు మూడు లక్షల ప్రాపర్టీలు దాని నెట్‌వర్క్‌లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… కంపెనీ ఆదాయంలో 84 శాతానికి పైగా విదేశాల నుంచే వస్తోంది. ఒకప్పుడు భారత మార్కెట్‌తో ప్రారంభమైన కంపెనీకి ఇప్పుడు అమెరికానే అతిపెద్ద మార్కెట్‌గా మారింది. Motel 6, Studio 6 వంటి ప్రముఖ హోటల్ బ్రాండ్లను కూడా కొనుగోలు చేసింది.
ఇప్పుడు అందరి చూపు IPOపైనే
ఎప్పుడో రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ యువకుడు… ఇప్పుడు తన కంపెనీని రూ.6,650 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ IPOలో వచ్చిన నిధుల్లో ఎక్కువ భాగాన్ని కంపెనీ అప్పులు తీర్చడానికి వినియోగించనుంది. గత కొన్నేళ్లతో పోలిస్తే కంపెనీ ఆదాయం, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి.
ఒక రాత్రి… ఒక ప్రశ్న… ఒక సామ్రాజ్యం
రితేష్ అగర్వాల్ కథలో గొప్ప విషయం వేల కోట్ల సంపద కాదు. ఒక సమస్యను చూసి… “ఇది ఎందుకు ఇలా ఉంది?” అని ప్రశ్నించడం. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం. ఆ సమాధానాన్ని ఒక వ్యాపారంగా మార్చడం. ఒక చౌక లాడ్జ్‌లో నిద్ర పట్టని రాత్రి… చివరకు ప్రపంచ హోటల్ పరిశ్రమలో భారతదేశం పేరు వినిపించే స్థాయికి తీసుకెళ్లింది. రితేష్ అగర్వాల్ ప్రపంచాన్ని మార్చేందుకు బయల్దేరలేదు. తనకు ఎదురైన ఒక చిన్న సమస్యకు పరిష్కారం వెతకాలని మాత్రమే అనుకున్నాడు. కానీ చరిత్రలో చాలా పెద్ద వ్యాపారాలు అలానే పుడతాయి. ప్రతిరోజూ లక్షల మంది చూసే సమస్యను… ఒక వ్యక్తి మాత్రం అవకాశంగా చూస్తాడు. మిగతావాళ్లు “ఇదే పరిస్థితి” అని ముందుకు వెళ్లిపోతారు.
అతను మాత్రం “ఇది ఎందుకు ఇలా ఉంది?” అని ఒక్క ప్రశ్న వేస్తాడు. ఆ ఒక్క ప్రశ్నే… కొన్ని కోట్ల రూపాయల కంపెనీని కాదు, వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. బహుశా రితేష్ అగర్వాల్ కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఇదే. జీవితాన్ని మార్చే అవకాశం ఎక్కడో దూరంలో ఉండదు… ప్రతిరోజూ మనకు ఎదురయ్యే అసౌకర్యాల్లోనే దాగి ఉంటుంది. దాన్ని సమస్యగా చూసేవాళ్లు ఫిర్యాదు చేస్తారు. అవకాశంగా చూసేవాళ్లు చరిత్ర సృష్టిస్తారు.
“జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు… ఒక సమస్యను మీరు ఎలా చూస్తారన్నదే.”








