మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారా? ‘బంగారం’ గురించి కొత్త స్టడీ చెప్పిన షాకింగ్ నిజం!
Gold Investment: ముగ్గురు స్నేహితులు… తలో రూ.10 లక్షలు ఉన్నాయి. వాటిని పెట్టుబడిగా పెట్టాలనకున్నారు. ఒకడు FD ఎంచుకున్నాడు, ఇంకొకడు బంగారం కొన్నాడు, మూడో వ్యక్తి షేర్లలో పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత ముగ్గురి ఖాతాలు తెరిచి చూస్తే… ఎవరు ఎక్కువ లాభం పొందారని మీరు అనుకుంటున్నారు? చాలామంది సమాధానం… షేర్లే అంటారు. కొందరు బంగారం అంటారు. ఇంకొందరు FD సేఫ్ అంటారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.
ఈ మూడు సమాధానాల్లో ఏదీ కరెక్ట్ కాదు… FD, షేర్లు, బంగారం… ఈ మూడింటినీ సరైన నిష్పత్తిలో కలిపిన వ్యక్తికే ఎక్కువ లాభం వచ్చింది. అంతేకాదు, రిస్క్ కూడా తక్కువగానే ఉంది. వైట్ఓక్ క్యాపిటల్ తాజా అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది.
అసలు గెలిచింది ఈ ఆలోచనే!
చాలామంది FD అంటే భద్రత, షేర్లు అంటే లాభం, బంగారం అంటే కష్టకాలానికి అండ అని భావిస్తారు. అందుకే ఈ మూడింటిలో ఏదో ఒక్కదాన్నే ఎంచుకుంటారు. కానీ వైట్ఓక్ అధ్యయనం చెప్పింది మాత్రం వేరే విషయం. ఈ మూడింటిలో ఏది బెస్ట్? అనేది కాదు… ఈ మూడింటినీ ఎలా కలిపితే బెస్ట్? అనేదే అసలు ప్రశ్న.
“ఒక్క చెట్టు.. తోట కాదు” అనే మన సామెతలా…”Don’t put all your eggs in one basket” అనే గ్లోబల్ సూత్రంలా…
పెట్టుబడుల్లో కూడా కలయికే అసలు బలం. సరైన నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ (FDలు, బాండ్లు వంటి స్థిర ఆదాయం పెట్టుబడులు), బంగారం కలిపితే, ఒక్క ఆస్తిపై ఆధారపడిన పెట్టుబడుల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అధ్యయనం చెబుతోంది.
ట్విస్ట్ ఇక్కడే ఉంది!
వైట్ఓక్ విశ్లేషణలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. FDలు, ప్రభుత్వ బాండ్లు వంటి భద్ర పెట్టుబడుల్లో మాత్రమే డబ్బు పెట్టినవారితో పోలిస్తే, కొంత భాగాన్ని షేర్లలో పెట్టినవారికి లాభాలు పెరిగాయి. అదే పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని కూడా చేర్చినప్పుడు, ఫలితాలు ఇంకా మెరుగయ్యాయి. ముఖ్యంగా మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఈ కలయిక పెట్టుబడులు స్థిరంగా ఉండే అవకాశం కనిపించింది. అంటే… “ఒకే పెట్టుబడిని నమ్మడం కంటే, పెట్టుబడుల సరైన కలయికే ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది.”
బంగారం ఎందుకు గేమ్ ఛేంజర్?
షేర్ మార్కెట్-బంగారం: ఒకరు కోపంగా ఉంటే.. ఇంకొకరు శాంతింపజేస్తారు! బిజినెస్ దిగ్గజం రతన్ టాటా గతంలో ఒక సందర్భంలో అన్నారు: “నేను సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నమ్మకం ఉంచను, నేను తీసుకున్న నిర్ణయాలను సరైనవిగా నిరూపిస్తాను.” మన పోర్ట్‌ఫోలియోను కూడా సరైనదిగా మార్చే శక్తి బంగారానికి ఉంది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే, భారతీయ షేర్ మార్కెట్‌కు, బంగారానికి మధ్య కొరిలేషన్ -0.42 (నెగెటివ్ కొరిలేషన్). మన వాడుక భాషలో చెప్పాలంటే వీరిద్దరూ మొగుడు పెళ్లాల లాంటివారు! ఒకరికి కోపం వస్తే, ఇంకొకరు తగ్గి సర్దుకుపోతారు. స్టాక్ మార్కెట్ విపరీతంగా పడిపోయి ఇన్వెస్టర్లు ఏడుస్తున్నప్పుడు… బంగారం ధరలు ఒక్కసారిగా పైకి లేచి మనల్ని లాభాల్లో నిలబెడతాయి. అందుకే, యుద్ధాలు వచ్చినా, ద్రవ్యోల్బణం (Inflation) పెరిగినా ‘గోల్డ్’ ఎప్పుడూ సేఫ్ హెవెన్.
ఒక్క గుర్రంపైనే పందెం ఎందుకు?
వైట్ఓక్ రూపొందించిన నమూనా పోర్ట్‌ఫోలియోలో 45% డెట్, 25% దేశీయ ఈక్విటీ, 25% బంగారం, 5% అమెరికా ఈక్విటీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రీబ్యాలెన్స్ చేసిన ఈ పోర్ట్‌ఫోలియోలో, ఒక్కో మార్కెట్ పరిస్థితిలో ఒక్కో ఆస్తి మెరుగైన ఫలితాలు ఇచ్చింది. ఎందుకంటే… “మార్కెట్‌ను ఎవరూ గెలవలేరు… కానీ వ్యూహంతో మార్కెట్‌ను తట్టుకోవచ్చు.”
చివరికి లెక్క తేలింది…
ముగ్గురు స్నేహితుల కథలో గెలిచింది FD కాదు… షేర్లు కాదు… బంగారం కూడా కాదు. ఈ మూడింటినీ సమతుల్యంగా కలిపిన ఆలోచనే గెలిచింది. “అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు” అనే మన సామెత… “Diversification is the only free lunch in investing” అనే గ్లోబల్ కోట్… రెండూ ఒకే విషయం చెబుతున్నాయి. ఒకే పెట్టుబడి సంపదను పెంచకపోవచ్చు… సరైన కలయిక మాత్రం సంపదను కాపాడుతూ పెంచగలదు. ఏదైమైనా.. “ఇంట్లో ఈరమ్మ ఉంటే… వీధిలో పేరమ్మ ఏం చేస్తుంది?” అని మన పెద్దలు ఊరికే అనలేదు. మన ఇంట్లో లక్ష్మీదేవి రూపంలో బంగారం ఉంటే, బయట మార్కెట్లో ఎన్ని తుఫాన్లు వచ్చినా అది మన సంపదకు ఒక అండగా నిలబడే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఒక మాట చెప్పారు… “రిస్క్ అనేది, మీరు ఏం చేస్తున్నారో తెలియకపోవడం వల్ల వస్తుంది.” కానీ మన తెలుగువాళ్లకు బంగారం విలువ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల పుట్టినా, పండగొచ్చినా, చేతిలో కాస్త డబ్బు మిగిలినా… ముందుగా గుర్తొచ్చేది బంగారమే. బంగారం కొనడం మనకు వెన్నతో పెట్టిన విద్య… కానీ దాన్ని తెలివైన పెట్టుబడిగా మార్చుకోవడమే అసలు కళ.
వైట్ఓక్ క్యాపిటల్ తాజా అధ్యయనం చెప్పిన సందేశం కూడా ఇదే… బంగారం ఒక్కటే సంపదను పెంచదు… కానీ సరైన పెట్టుబడులతో కలిసి నడిస్తే, సంపదను కాపాడుతూ పెంచే బలమైన రక్షణ కవచంగా మారుతుంది. “బంగారం మెడలో ఉంటే అందం పెరుగుతుంది… పోర్ట్‌ఫోలియోలో ఉంటే భరోసా పెరుగుతుంది.”








