విశ్వంభరకు ఊరటనిచ్చిన వార్త.. కానీ అసలు పరీక్ష ఇప్పుడే!
విశ్వంభర(vishwambhara) సినిమాపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి మధ్య అభిమానులకు ఊరటనిచ్చే వార్త వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ వశిష్ఠ(Vassishta) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఫైనల్ విజువల్స్‌ను చిత్ర బృందం వీక్షించగా, అవుట్‌పుట్‌పై చిరంజీవి కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఫాంటసీతో పాటు స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య టీజర్ రూపంలోనే వచ్చింది. ప్రారంభంలో విడుదలైన టీజర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో సినిమా హైప్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ను మరింత మెరుగుపర్చేందుకు అదనపు సమయం తీసుకోవడంతో విడుదల పదేపదే వాయిదా పడింది. దీంతో ఒకప్పుడు భారీ అంచనాలు సృష్టించిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు వీఎఫ్ఎక్స్ సిద్ధమైందనే వార్త అనుకూల సంకేతమే అయినప్పటికీ, ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం మేకర్స్‌కు అసలు పరీక్షగా మారింది. ఆకట్టుకునే ట్రైలర్, గుర్తుండిపోయే పాటలు, స్పష్టమైన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రమోషన్స్‌ను బలంగా ప్రారంభిస్తే సినిమాపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే చివరికి అద్భుతమైన విజువల్స్‌తో పాటు స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటేనే విశ్వంభర బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోగలదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.








