సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిందా?
సూర్య ప్రకాష్ జోశ్యుల..
సముద్రం ఒక్కసారిగా వెనక్కి జారిపోతోంది… అడుగున దాగి ఉన్న పగడపు దిబ్బలు, చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయి…పిల్లలు ఆనందంగా వాటి వైపు పరుగెత్తుతున్నారు… చుట్టూ ఉన్నవాళ్లు ఫోన్లు తీసి రీల్స్, వీడియోలు తీస్తున్నారు… మీరు కూడా అదే చేస్తారా? ఒక్క క్షణం ఆగండి… ఎందుకంటే… మహా విపత్తు ముంచుకొచ్చే ముందు ప్రకృతి ఎప్పుడూ ఒకే ఒక్క సంకేతాన్ని ఇస్తుంది. ఆ హెచ్చరికను గుర్తిస్తే మనం తప్పించుకోగలుగుతాము… గుర్తించకపోతే… చరిత్రలో ఒక సంఖ్యగా మిగిలిపోతారు. 2004లో ఇదే జరిగింది… ఆసక్తి, అజ్ఞానం, ఒక చిన్న తప్పు… లక్షలాది ప్రాణాలను మింగేసింది.
ప్రపంచం చావుకు ఎదురెళ్లింది… వాళ్లు మాత్రం ముందే పారిపోయారు!
2004 డిసెంబర్ 26… ఇండోనేషియాలోని సుమత్రా సమీపంలో భూమి ఒక్కసారిగా చీలిపోయింది… భారీ భూకంపం భారత మహాసముద్రాన్ని కుదిపేసింది… కొన్ని గంటల్లోనే 14 దేశాల్లో సుమారు 2.28 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కానీ అదే రోజు… ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరిగింది. భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని ఒంగే, జరవా, సెంటినెలీస్, షోంపెన్ వంటి గిరిజన తెగల్లో భారీ ప్రాణనష్టం జరగలేదు. వాళ్ల దగ్గర టెక్నాలజీ లేదు… సైరన్లు లేవు… యాప్‌లు లేవు… అయినా… సునామీ వచ్చేలోపే వాళ్లు కొండలపైకి వెళ్లిపోయారు. వాళ్లకు ముందే ఎలా తెలిసింది?
అడవి వాళ్లకు గురువు… భూమి వాళ్లకు అలారం!
వాళ్లు పుస్తకాల్లో చదవలేదు… ప్రకృతినే చదివారు. వారి పెద్దలు తరతరాలుగా ఒకే మాట చెబుతూ వచ్చారు… “సముద్రం అసాధారణంగా కనిపిస్తే… దాన్ని నమ్మొద్దు.” అది వాళ్లకు కథ కాదు… జీవించే నియమం. భూమి కంపనం మొదలు కాగానే… సముద్రం వెనక్కి వెళ్లటం మొదలు కాగానే… వాళ్లు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు… పరుగెత్తారు…వెనక్కి కూడా తిరిగి చూడలేదు. అందుకే బతికారు.
సముద్రం ఊపిరి బిగబడితే… చావు దగ్గర్లోనే ఉంది!
సునామీకి ముందు సముద్రం ఒక్కసారిగా వందల మీటర్లు వెనక్కి వెళ్లిపోతుంది. చాలామందికి అది అద్భుతంగా కనిపిస్తుంది… కానీ నిజానికి… అది ప్రకృతి చెబుతున్న చివరి హెచ్చరిక. “ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో!” 2004లో వేలాది మంది ఈ సంకేతాన్ని అర్థం చేసుకోలేక సముద్రం వైపు పరుగెత్తారు. చేపలు పట్టుకున్నారు… ఫోటోలు తీశారు… కొద్దిసేపటికే… సముద్రం తిరిగి వచ్చింది… ఈసారి అలలా కాదు… మృత్యువులా దూసుకొచ్చింది.
ఆంధ్ర తీరంలో కూడా అదే కథ… అదే తప్పు!
సునామీ అంటే చాలామందికి ఇండోనేషియా మాత్రమే గుర్తొస్తుంది. కానీ అదే అలలు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కూడా తాకాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆ రోజు ఉదయం సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది… జనం ఆశ్చర్యంగా చూసారు… కొంతమంది దగ్గరికి వెళ్లారు… ప్రకృతి ఇచ్చిన ఆఖరి హెచ్చరికను అర్థం చేసుకోలేక… ప్రాణాలు కోల్పోయారు.
థాయిలాండ్‌లో ఏనుగులు చేసిన పని… మనుషులు చేయలేకపోయారు!
థాయిలాండ్ బీచ్‌లలో టూరిస్టులు ఆనందంగా ఉన్నారు… అప్పుడే కొన్ని ఏనుగులు ఒక్కసారిగా అసహజంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి… మావటివాళ్ల మాట వినకుండా గట్టిగా అరుస్తూ… వీపుపై ఉన్న టూరిస్టులను మోసుకుంటూనే… కొండల వైపు పరుగెత్తాయి! కొద్దిసేపటికే… సునామీ అలలు బీచ్‌ను మింగేశాయి. ఆ ఏనుగులు… మనుషుల కంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టాయి. ఈరోజు పరిస్థితి ఇంకా ప్రమాదకరం. యాక్సిడెంట్ జరిగినా… ముందు ఫోన్ తీసి వీడియో తీయడం… తర్వాత సహాయం చేయడం… ఇది మన కొత్త సంస్కృతి అయిపోయింది. రేపు కళ్లెదురుగా సముద్రం వెనక్కి వెళ్లినా… చాలామంది అదే చేస్తారు.
రీల్ కోసం…
లైక్స్ కోసం…
వ్యూస్ కోసం…
ప్రాణాలను పణంగా పెడతారు. కానీ గుర్తుంచుకోండి…
ప్రకృతి ముందు మీ ఫాలోవర్స్ పనికిరారు.
జంతువులు ముందే ఎందుకు పారిపోతాయి?
సునామీకి ముందు పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి… కుక్కలు బయటకు రావడానికి నిరాకరిస్తాయి… ఏనుగులు పరుగెత్తుతాయి… భూకంపాల సమయంలో వచ్చే లో-ఫ్రీక్వెన్సీ తరంగాలను జంతువులు ముందే గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం భాషలు వేరైనా… హెచ్చరిక మాత్రం ఒక్కటే.
హవాయిలో ఒక మాట ఉంది…
“When the ocean leaves, don’t follow it.”
ఇండోనేషియాలో ‘స్మోంగ్’ అనే జానపద పాట ద్వారా పిల్లలకు నేర్పిస్తారు… “భూమి కంపించి… సముద్రం వెనక్కి వెళ్తే… వెంటనే కొండపైకి వెళ్లాలి.”
శాస్త్రం ఓడిపోలేదు… మనం ఆలస్యమయ్యాం!
2004లో భారత మహాసముద్రంలో సునామీ వార్నింగ్ సిస్టమ్ లేదు. సెన్సర్లు లేవు… బోయ్‌లు లేవు… అందుకే హెచ్చరిక ప్రజలకు చేరలేదు. ఆ విషాదం తర్వాతే ప్రపంచం మేల్కొంది. ఈరోజు ఆధునిక టెక్నాలజీ సముద్రాన్ని గమనిస్తోంది. కానీ… ప్రకృతి ఇచ్చే సిగ్నల్‌ను మీరు గుర్తించకపోతే… ఏ టెక్నాలజీ కూడా మిమ్మల్ని కాపాడలేను.
మీ ప్రాణాలను కాపాడే 5 సంకేతాలు
భూమి అసాధారణంగా ఎక్కువసేపు కంపించడం
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం
చేపలు, పగడపు దిబ్బలు బయటపడటం
జంతువుల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవడం
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రాంతానికి పరుగెత్తడం
ఒక్క అపోహ… మీ చివరి నిర్ణయం కావచ్చు!
అపోహ: “సముద్రం వెనక్కి వెళ్లింది… వెళ్లి వీడియో తీద్దాం.”
నిజం: అది మీ జీవితంలో కనిపించే చివరి దృశ్యం కూడా కావచ్చు.
ఈ కథ 2004 గురించి కాదు… రేపు మీ గురించి!
మీరు వైజాగ్ బీచ్‌కైనా… గోవాకైనా… మెరెక్కడికైనా వెళ్లొచ్చు. ఆ రోజు… మీ చుట్టూ ఉన్నవాళ్లు ఫోన్లు తీసి వీడియోలు తీయవచ్చు. మీరు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకోండి… సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిందంటే… అది ప్రకృతి ఇచ్చిన చివరి అవకాశం. ఆ అవకాశాన్ని వృథా చేయకండి. వెనక్కి తిరిగి చూడకుండా… పరుగెత్తండి!








