శవాన్ని యాసిడ్లో కరిగించినా లొంగలేదు! భర్త హత్యకు ఆ వీరనారి ఇచ్చిన “నగ్న శాపం” చరిత్రనే మార్చేసింది!
సూర్య ప్రకాష్ జోశ్యుల..
ఒక దేశ ప్రధానమంత్రిని చంపేశారు.అది సరిపోలేదు. శరీరాన్ని ముక్కలు చేశారు. అదీ సరిపోలేదు. యాసిడ్లో కరిగించి, ఆయన ఈ భూమ్మీద ఎప్పుడూ బతకనేలేదన్నట్టు ఆనవాళ్లన్నీ చెరిపేయాలని చూశారు.నిజానికి మనిషిని చంపడం వాళ్ల లక్ష్యం కాదు. చరిత్రనే హత్య చేయాలనుకున్నారు. కానీ… వాళ్లు ఒక పెద్ద విషయం మర్చిపోయారు. శరీరాన్ని కరిగించొచ్చు… కానీ ప్రజల జ్ఞాపకాన్ని కాదు. అందుకే 65 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఒక హత్య గురించి కాదు… ఒక ద్రోహం గురించి, ఒక మహిళ తిరుగుబాటు గురించి, ఒక నాయకుడి అమరత్వం గురించి మాట్లాడుతోంది.
ఎవరా నాయకుడు?
ఎందుకు అంత దారుణంగా చంపారు?
ఆ మహిళ ఏమి చేసింది?
ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎన్నో హత్యలు జరిగాయి. కానీ, హత్య తర్వాత శరీరాన్నే పూర్తిగా మాయం చేయాలని ప్రయత్నించిన ఘటనలు చాలా అరుదు. అలాంటి అత్యంత క్రూరమైన రాజకీయ కుట్రల్లో ఒకటి కాంగో తొలి ప్రజాస్వామ్య ప్రధానమంత్రి పాట్రిస్ లుముంబా హత్య. ఇందులో విదేశీ ప్రయోజనాలు, అధికార దాహం, ద్రోహం, చివరకు ఒక భార్య చేసిన చారిత్రక తిరుగుబాటు… అన్నీ కలిసిపోయాయి.
స్వాతంత్ర్యం వచ్చిందంటే… అందరికీ నచ్చలేదు!
1960లో బెల్జియం వలస పాలన నుంచి కాంగోకు స్వాతంత్ర్యం వచ్చింది. కొత్త దేశానికి తొలి ప్రజాస్వామ్య ప్రధానమంత్రిగా పాట్రిస్ లుముంబా బాధ్యతలు చేపట్టారు.స్వాతంత్ర్య వేడుకలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచాన్ని కుదిపేసింది. వలస పాలకులను పొగడటానికి బదులుగా, తమ ప్రజలు అనుభవించిన అవమానాలు, దోపిడీ, బానిసత్వాన్ని ప్రపంచం ముందే నిలదీశారు. అంతేకాదు, బంగారం, రబ్బర్, యురేనియం వంటి అపార సహజ వనరులపై పూర్తి హక్కు కాంగో ప్రజలకే ఉండాలని ప్రకటించారు. అదే క్షణం నుంచి ఆయన శక్తివంతమైన దేశాలకు అసౌకర్యంగా మారిపోయారు. వాళ్లకి పెద్ద విలన్ లాగ కనపడటం మొదలెట్టాడు.
నమ్మిన వ్యక్తే… వెన్నుపోటు పొడిచాడు!
ప్రతి పెద్ద రాజకీయ కథలో ఒక ద్రోహి ఉంటాడు. లుముంబా కథలో ఆ వ్యక్తి జోసెఫ్ డిజైర్ మొబుటు. అతనిపై లుముంబాకు అపారమైన నమ్మకం. కీలక సైనిక బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ అధికార దాహం, విదేశీ మద్దతు కలిసి ఆ నమ్మకాన్ని ద్రోహంగా మార్చేశాయి. 1960 సెప్టెంబర్ 14న మొబుటు సైనిక తిరుగుబాటు చేశాడు. పలు చారిత్రక అధ్యయనాలు, తరువాత వెలుగులోకి వచ్చిన పత్రాలు ఈ పరిణామాల్లో బెల్జియం వర్గాలు, అమెరికా గూఢచారి సంస్థ CIA పాత్రపై తీవ్ర అనుమానాలు, విమర్శలు ఉన్నాయని సూచించాయి. లుముంబాను గృహ నిర్బంధంలో పెట్టారు. ఆయనను ప్రజల నుంచి దూరం చేశారు. చివరకు ఆయన బతికి ఉంటే తమ అధికారానికి ప్రమాదమని భావించిన వారు, కటాంగా ప్రాంతంలోని ప్రత్యర్థుల చేతికి అప్పగించారు.
చరిత్రలోనే అత్యంత క్రూరమైన ముగింపు?
1961 జనవరి 17. కటాంగా అడవుల్లో ముందే ఒక గుంత తవ్వి సిద్ధం చేశారు. పాట్రిస్ లుముంబాను అక్కడే కాల్చి చంపేశారు. కానీ హత్యతో వాళ్ల పని పూర్తికాలేదు. ఆయన సమాధి కూడా ఉండకూడదని నిర్ణయించారు.మృతదేహాన్ని బయటకు తీసి ముక్కలు చేసి, సల్ఫ్యూరిక్ యాసిడ్లో కరిగించారు.
ఒక్క ఆనవాళ్లు కూడా మిగలకుండా చేశారు. చరిత్ర నుంచి ఆయన పేరును కూడా చెరిపేయాలని ప్రయత్నించారు.కానీ… శరీరాన్ని నాశనం చేయగలిగారు. సిద్ధాంతాన్ని కాదు. భర్త హత్య వార్త తెలిసిన తర్వాత పౌలిన్ ఓపాంగో లుముంబా మౌనంగా కూర్చోలేదు. వేలాది మందితో కలిసి ఐక్యరాజ్యసమితి కార్యాలయం వైపు భారీ నిరసన చేపట్టారు. కాంగో సంప్రదాయంలో అత్యంత తీవ్రమైన దుఃఖం, అన్యాయంపై నైతిక ఆగ్రహానికి ప్రతీకగా ఆమె ప్రత్యేక నిరసన వ్యక్తం చేశారు. ఆ దృశ్యాలు ప్రపంచ మీడియాను కుదిపేశాయి.
నగ్నవక్షోభరిత ప్రతిఘటన..
లుముంబా భౌతిక కాయాన్ని అంతం చేస్తే, ఆయన వారసత్వాన్ని కూడా అంతం చేయవచ్చని మొబుటు భావించాడు. కానీ అది అతని భ్రమ. చరిత్రలో విప్లవకారుల భార్యలను తరచూ తెర వెనకే ఉంచేస్తుంటారు, కానీ పౌలిన్ ఒపాంగో లుముంబా అలా దాగి ఉండటానికి నిరాకరించారు. తన భర్త ఘోర హత్యకు గురయ్యారనే వార్త వినగానే, ఆమె ఎవరూ మరచిపోలేని ఒక ఉద్వేగభరితమైన నిరసనను ఎంచుకున్నారు. ఇంట్లో కూర్చుని నిశ్శబ్దంగా ఏడవడం మానేసి, పౌలిన్ లియోపోల్డ్విల్ వీధుల గుండా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వైపు ఒక భారీ, గంభీరమైన నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు.
ఆ నిరసన ప్రదర్శన శక్తి: పౌలిన్ ఒపాంగో తన పై వస్త్రాన్ని పూర్తిగా తొలగించి (నగ్న వక్షంతో) నడిచారు. సాంప్రదాయ కాంగో సంస్కృతిలో, ఇది తీవ్రమైన దుఃఖానికి, సత్యానికి, నైతిక ఆగ్రహానికి అత్యున్నత రూపం. ఇది తప్పు చేసిన వారికి ఇచ్చే ఒక దృశ్య రూప శాపం లాంటిది. ఆమె తన శరీరాన్ని ప్రపంచం ముందు ఉంచడం ద్వారా, ఐక్యరాజ్యసమితి, మొబుటు ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను బద్దలు కొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కెమెరాలు కాంగో ప్రజల అసలు సిసలైన వేదనను నేరుగా చూసేలా చేశారు. ఒక్కసారిగా అందరి చూపు కాంగో వైపు మళ్లింది. ఒక మహిళ నిరసన, ప్రపంచ శక్తులు దాచాలనుకున్న కథను మళ్లీ ప్రపంచం ముందు నిలబెట్టింది. భర్తను చంపారు… కానీ ఆమెను మౌనం నుంచి ఏమార్చలేకపోయారు. లుముంబా మరణంతో ప్రమాదం ముగియలేదు.పౌలిన్పై కూడా నిఘా కొనసాగింది. పిల్లలతో కలిసి ఈజిప్ట్, క్యూబా, టాంజానియా వంటి దేశాల్లో ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. అయినా భర్త జ్ఞాపకాన్ని చెరిపేయలేదు. ఆయన గురించి ప్రపంచం మర్చిపోకుండా జీవితాంతం పోరాడింది.
కానీ చరిత్ర ఇచ్చిన తీర్పు ఇదే..
ప్రపంచం చాలా సార్లు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. లుముంబాను చంపినవాళ్లు అధికారంలోకి వచ్చారు. మొబుటు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించాడు. కానీ అవినీతి, నియంతృత్వం, దేశ సంపద దోపిడీ ఆరోపణలతో చివరకు అధికారాన్ని కోల్పోయి ప్రవాసంలోనే మరణించాడు. మరోవైపు, లుముంబా పేరు మాత్రం ఆఫ్రికా స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా మారింది. దశాబ్దాల తర్వాత బెల్జియం కూడా ఈ హత్యలో తమ దేశ పాత్రపై విచారం వ్యక్తం చేసింది. లుముంబా శరీరం నుంచి మిగిలిన ఒకే ఒక్క దంతాన్ని ఆయన కుటుంబానికి అప్పగించడం ప్రపంచ దృష్టిని మరోసారి ఈ ఘటనపైకి తీసుకొచ్చింది.
చివరికి ఎవరు గెలిచారు?
వాళ్లు ఒక నాయకుడిని చంపారు. శరీరాన్ని మాయం చేశారు. ఆనవాళ్లు చెరిపేయాలని చూశారు. కానీ 65 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం గుర్తుంచుకుంటున్న పేరు పాట్రిస్ లుముంబా. అధికారం శాశ్వతం కాదు. భయం కూడా కాదు. నిజం కోసం నిలబడిన ఒక నాయకుడి పేరు, ఒక మహిళ ధైర్యం… వాటిని ఏ యాసిడ్ కూడా కరిగించలేదని ఈ కథ చరిత్రకు గుర్తు చేస్తూనే ఉంది.








