భారత్ తో డీల్ పూర్తికి అమెరికా ప్రయత్నాలు..త్వరలో ఇండియాకు ట్రంప్..!
భారత్ తో చరిత్రాత్మక డీల్ పూర్తిదిశగా అగ్రరాజ్యం అమెరికా అడుగులేస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు సైతం ముమ్మరం చేసింది. ఒక్క టారిఫ్ సంగతి పక్కన పెడితే కీలకాంశాల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టారిఫ్ పోటీలో తమకు అధిక ప్రయోజనాలు దక్కేలా చేయాలని న్యూఢిల్లీ.. అమెరికాను డిమాండ్ చేస్తోంది. దీంతో ఈదిశగా అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.దీనిలో భాగంగా వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump to visit India)… భారత్ లో పర్యటించనున్నారు.
వచ్చే ఏడాదిలో ట్రంప్ భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు అద్భుతమంటూ కొనియాడారు. అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఖరారు చేయడానికి ఈ ఏడాది ముగిసేలోపే తాను భారత్‌కు వెళ్తానని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ మొదటి భారత పర్యటన ఇదే కానుంది.
అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి అని.. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) – ట్రంప్ (Donald Trump) మధ్య మంచి అనుబంధం ఉందని మార్కో రూబియో తెలిపారు. దౌత్యపరంగా వారి బంధం చాలా ఉపయోగకరమన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాణిజ్య ఒప్పందం గురించి మోడీ-ట్రంప్ చర్చించారని రూబియో వెల్లడించారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. ఇంధన సరఫరాను పెంచడానికి భారత్-అమెరికా కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. చమురు శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని దేశాలలో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు.
మోడీపై రూబియో ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)పై రూబియో ప్రశంసలు కురిపించారు. తాను ఆయనకు అభిమానినని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోడీ భారత్‌ను ఒక ప్రపంచ శక్తిగా మార్చారని ప్రశంసించారు.








