తెలంగాణపై బీజేపీ అధిష్టానం నజర్!
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, నేతల మధ్య సమన్వయాన్ని పెంచడమే లక్ష్యంగా అధిష్టానం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. హైదరాబాద్ వేదికగా సాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన తరుణంలో, తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తుండటం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
జూన్ 28 నుంచి జూన్ 30 వరకు నితిన్ నబీన్ ఇక్కడే ఉండి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర కేడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే, పైకి అంతా సజావుగానే కనిపిస్తున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దడానికే జాతీయ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్ర కమిటీలో కొందరు నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో క్రియాశీలంగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరాయి. ముఖ్యంగా, ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 15 రోజుల సేవా కార్యక్రమాలకు కొందరు ముఖ్య నేతలు హాజరు కాకపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమాన దూరం పాటించాలని హైకమాండ్ ఆదేశించినా, కొందరు నేతలు వాటిని పక్కనబెట్టారని రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్ అధిష్టానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అంతర్గత సమస్యలు, పనిచేయని నేతలపై నితిన్ నబీన్ కఠినమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగనుంది.
మొత్తంగా చూస్తే అటు అంతర్గత విభేదాలను చక్కదిద్దుతూ, ఇటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా అధిష్టానం చేస్తున్న ఈ ‘ఆపరేషన్ తెలంగాణ’ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.








