మళ్లీ కల్లోలంగా పశ్చిమాసియా.. ఇరాన్ పై అమెరికా భీకర ప్రతీకార దాడులు.!
పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఓవైపు శాంతి ప్రక్రియ పట్టాలెక్కుతోందన్న ఆనందం కాసేపు కూడా నిలవకుండానే పరస్పరం దాడులు జరిగాయి. జలసంధిలో ప్రయాణిస్తున్న చాలా ఖరీదైన వాణిజ్య నౌకపై శుక్రవారం ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా యూఎస్ దాడులు చేపట్టింది. హర్మూజ్‌కు సమీపంలోని ఇరాన్ మిలటరీ స్థావరాలు, క్షిపణి-డ్రోన్ల నిల్వ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. శాంతి ఒప్పందానికి తామూ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని, దాన్ని అమలు చేసేందుకు అత్యంత అప్రమత్తతో పనిచేస్తున్నామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఇరాన్‌కు ఇంకా ఎదురుదాడులు చేసే సామర్థ్యం ఉందని అన్నారు.అయితే.. అదంత ఎక్కువేం కాదు. వారు విజయం సాధించే స్థితిలో ఏం లేరు. కానీ, ఎదురుదాడులు చేయగలరనే అనుకుంటున్నా. హర్మూజ్ (Strait of Hormuz)లోని ఓ నౌకపైకి వారు నాలుగు డ్రోన్లు పంపించారు. అందులో మూడింటిని కూల్చేశాం. ఒకటి మాత్రం నౌకకు తగిలి కొంత మేర ధ్వంసమైంది’’ అని ట్రంప్ వెల్లడించారు కానీ, అమెరికా సైనిక చర్య పశ్చిమాసియాలో సుదీర్ఘ ఘర్షణలను నివారించిందని పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై అమెరికా (USA) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. మేం దాన్ని గౌరవిస్తున్నాం. కానీ, ఇరాన్ మాత్రం ఉల్లంఘిస్తోంది. ఒకవేళ ఒప్పందంలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వారు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కానీ ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. హింసకు సమాధానం హింసే అవుతుంది’’ అని వాన్స్ పరోక్షంగా టెహ్రాన్‌ను హెచ్చరించారు.
అమెరికా దాడులను ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ హెడ్ ఇబ్రహీం అజీజీ తీవ్రంగా ఖండించారు. ‘‘చర్చల మధ్య అమెరికా మరోసారి మాపై దాడి చేసింది. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పట్ల నిబద్ధత లేదని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించుకున్నారు. ఈ నిర్లక్ష్యపు ఉల్లంఘనకు వారు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. ఇలాంటి నిందలు ఇకపై పనిచేయవు’’ అని అగ్రరాజ్యాన్ని హెచ్చరించారు.








