ఈ పథకం దేశానికే రోల్ మోడల్‌గా : గల్లా మాధవి
ప్రతి కుటుంబానికీ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా సంజీవని పథకాన్ని (Sanjeevani scheme) తీసుకొచ్చింది. ఈ పథకం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి (Galla Madhavi) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సంజీవని ప్రాజెక్టులో ఇంటి వద్దకే 104 మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాలు వస్తాయి. ప్రతి ఒక్కరికీ 42 నుంచి 75 రకాలు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే సుమారు 19 లక్షల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది అని వివరించారు. ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ఆరోగ్య ఖాతాలు సృష్టించి ఆరోగ్య వివరాలు డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయడం వల్ల సేవలు సులభతరం అవుతాయి. క్యాన్సర్ (Cancer) లాంటి వ్యాధులను ముందే గుర్తించి ప్రాణాలు కాపాడుకునే వీలుంటుంది అని పేర్కొన్నారు.








