PhonePe, Google Pay హవా ముగుస్తుందా? WhatsApp కోసం Meta మాస్టర్ ప్లాన్!
—శివ దువ్వూరు
“WhatsApp ను మీరు రోజుకు ఎన్ని సార్లు ఓపెన్ చేస్తారు?”
10 సార్లా…
20 సార్లా…
లేక 100 సార్లా?
మనందరి జీవితంలో భాగమైపోయిన WhatsApp లో ఒక షాకింగ్ మార్పు చోటు చేసుకోబోతోంది.
అవును…ప్రపంచంలో 300 కోట్ల మంది… భారత్‌లో 50 కోట్ల మంది వాడుతున్న ఈ యాప్… Metaకు మాత్రం ఆశించినంత డబ్బు సంపాదించి పెట్టలేకపోతోంది! దాదాపు పదేళ్లుగా ఈ సమస్యతో పోరాడుతున్న మార్క్ జుకర్‌బర్గ్… చివరకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏకంగా రూ.7,700 కోట్ల పెట్టుబడి పెట్టి భారతీయ స్టార్టప్ CREDలో వాటా కొనుగోలు చేయడమే కాదు… దాని వ్యవస్థాపకుడు కునాల్ షాను WhatsApp గ్లోబల్ హెడ్‌గా నియమించింది.
Meta నమ్మకం ఇప్పుడు టెక్నాలజీ మీద కాదు… ఒక భారతీయుడి ఆలోచన మీద. మరి 300 కోట్ల మంది వాడే WhatsApp కథను… కునాల్ షా నిజంగానే మార్చగలడా? ఈ భారతీయుడులో జుకర్‌బర్గ్ ఏమి చూశాడు? ఇది తెలియాలంటే మొదల సమస్య మూలాల్లోకి వెళ్లి చూద్దాం.
WhatsApp ఎందుకు, ఎక్కడ విఫలమైంది?
Facebook ప్రకటనలతో వేల కోట్ల డాలర్లు సంపాదిస్తోంది. Instagram ప్రకటనలు, షాపింగ్, రీల్స్‌తో Metaకు భారీ ఆదాయం తెస్తోంది. కానీ… WhatsApp మాత్రం కోట్లాది మంది వాడుతున్నా… డబ్బు సంపాదించే మిషన్ గా మారలేదు.
Meta ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. WhatsApp Business, Channels, Communities, AI ఫీచర్లు, WhatsApp Pay అన్నీ తీసుకొచ్చింది. అయితే భారత్‌లో డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో PhonePe, Google Pay ముందుకెళ్లిపోయాయి. WhatsApp Pay మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయింది. అంటే… యూజర్లు ఉన్నారు… కానీ డబ్బు వచ్చే మార్గం లేదు. ఆ యూజర్లను ఆదాయంగా మార్చే ఫార్ములా మాత్రం దొరకలేదు.
అందుకే రంగంలోకి దిగాడు ఓ భారతీయుడు!
కునాల్ షా పేరు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ భారత స్టార్టప్ ప్రపంచంలో ఆయన చాలా పెద్ద పేరు. ఫిలాసఫీ చదివిన ఆయన… టెక్నాలజీ కంటే ముందు మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. మొదట FreeChargeను నిర్మించి విజయవంతంగా విక్రయించారు. ఆ తర్వాత 2018లో CREDను ప్రారంభించారు. ఇక్కడే ఆయన ఆలోచన మిగతా కంపెనీల కంటే భిన్నంగా నిలిచింది. అందరినీ కస్టమర్లుగా చేసుకోవడం కాదు… సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే, ఎక్కువ ఖర్చు చేసే ప్రీమియం వినియోగదారులనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
1.7 కోట్ల యూజర్లు… కానీ భారీ బిజినెస్!
CREDకు నెలకు సుమారు 1.7 కోట్ల యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. ఇది WhatsAppతో పోలిస్తే చాలా చిన్న సంఖ్య. కానీ ఆ యూజర్లే భారతదేశంలో జరిగే 40 శాతం కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను నిర్వహిస్తున్నారని కంపెనీ చెబుతోంది. అంతేకాదు… భాగస్వామ్య సంస్థల ద్వారా 2.5 బిలియన్ డాలర్లకు పైగా రుణ ఆస్తులను నిర్వహిస్తోంది. అంటే… ఎక్కువ మంది కాదు… ఎక్కువ విలువ ఉన్న కస్టమర్లతో కూడా భారీ వ్యాపారం చేయవచ్చని కునాల్ షా నిరూపించారు. అదే Metaను ఆకట్టుకుంది.
జుకర్‌బర్గ్ ప్లాన్ ఏమిటి?
Meta ఇప్పుడు మరో యాప్ కొనలేదు. డబ్బు సంపాదించే ఆలోచన ఉన్న వ్యక్తిని తీసుకెళ్లింది. WhatsAppను మెసేజింగ్ యాప్ నుంచి… వ్యాపారాలు, చెల్లింపులు, సేవలు మరింత సులభంగా జరిగే వేదికగా మార్చాలని కంపెనీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయాణంలో కునాల్ షా కీలక పాత్ర పోషిస్తారని Meta భావిస్తోంది.
ఇది మొదటిసారి కాదు… ఇదే Meta కొత్త స్ట్రాటజీ!
ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో కూడా Meta… AI రంగంలో Scale AIలో భారీ పెట్టుబడి పెట్టి, ఆ సంస్థ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్‌ను AI విభాగంలో కీలక బాధ్యతలకు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని WhatsApp విషయంలో అమలు చేస్తోంది. కంపెనీని పూర్తిగా కొనకుండా… ఆ కంపెనీని విజయవంతం చేసిన వ్యక్తిని తమ జట్టులోకి తీసుకురావడం.
కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది!
CRED విజయం వెనుక ఉన్న సూత్రం… కొద్దిమంది ప్రీమియం కస్టమర్లు. కానీ WhatsApp పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ పల్లెటూరి రైతు నుంచి… సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు… చిన్న వ్యాపారి నుంచి పెద్ద కంపెనీ వరకు… ప్రతి ఒక్కరూ ఉన్నారు. దాంతో 17 మిలియన్ ప్రీమియం యూజర్ల కోసం పనిచేసిన వ్యూహం… 300 కోట్ల మంది ఉన్న WhatsAppలో కూడా పనిచేస్తుందా? అదే ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న ప్రశ్న.
దీని అర్థం ఏమిటి?
ఈ నిర్ణయం ఒక్క విషయం స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే చూడడం లేదు. ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని ఇచ్చే దేశంగా కూడా గుర్తిస్తున్నాయి. ఒక భారతీయుడు… ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు నాయకత్వం వహించడం… మన స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు కూడా పెద్ద గుర్తింపే.
ఫైనల్ గా…
“నిజానికి ఇది కేవలం రెండు కంపెనీల మధ్య జరిగిన డీల్ కాదు.. ఇండియన్ యూజర్ల ‘డిజిటల్ అలవాట్లను’ మార్చేందుకు మార్క్ జుకర్‌బర్గ్ వేసిన బిలియన్ డాలర్ల జూదం! గా చెప్పాలి.
ఇన్నాళ్లూ మనకు వాట్సాప్ అంటే కేవలం ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్‌లు, చాటింగ్‌లు, స్టేటస్లు మాత్రమే. కానీ కునాల్ షా ఎంట్రీతో.. రేపు పొద్దున మన వాట్సాప్ చాట్ బాక్స్‌లోనే లోన్లు, ఇన్సూరెన్స్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల ఆఫర్లు వచ్చి పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం… ఐఐటీ, ఐఐఎం డిగ్రీలు లేకపోయినా, మనుషుల సైకాలజీని అర్థం చేసుకుని ఓ భారతీయుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌కు నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం.
అయితే.. కేవలం ‘ప్రీమియం కస్టమర్ల’ జేబులు ఖాళీ చేయించిన కునాల్ షా స్ట్రాటజీలు, రూపాయి రూపాయి లెక్క చూసుకునే సామాన్య భారతీయ వాట్సాప్ యూజర్ దగ్గర వర్కవుట్ అవుతాయా? గూగుల్ పే, ఫోన్ పేలకు అలవాటు పడిపోయిన మన జనాలు వాట్సాప్ వైపు మొగ్గు చూపుతారా? అనేది కాలమే సమాధానం చెప్పాలి!”








