వారెన్ బఫెట్ ఫార్ములా: ఈ 2600 ఏళ్ల నాటి కథ తెలిస్తే… షేర్ మార్కెట్లో మీరే కింగ్!
—శివ దువ్వూరు
“సార్… 50 వేలు పెట్టండి… ఏడాదిలో 5 లక్షలు అవుతాయి!”
“ఇప్పుడే కొనండి… రేపటికి ధర డబుల్!”
“ఈ షేర్ మిస్ అయితే జీవితాంతం పశ్చాత్తాపమే!”
“ఈ క్రిప్టో రేపటికి 10 రెట్లు పెరుగుతుంది!”
మనలో చాలామంది ఈ మాటలు ఎప్పుడో ఒకసారి విన్నవాళ్లమే. వాట్సాప్‌లో చూసి ఉండొచ్చు, యూట్యూబ్‌లో చూసి ఉండొచ్చు, లేదా స్నేహితుడి ద్వారా విని ఉండొచ్చు. కొంతమంది నమ్మి డబ్బు కూడా పెట్టి ఉండొచ్చు.
కానీ ఆశ్చర్యం ఏమిటంటే — ఈ ట్రిక్ కొత్తది కాదు. ఈ మాయ కొత్తది కాదు. ఈ మోసం కొత్తది కాదు. 2600 ఏళ్ల క్రితమే ఒక కథకుడు దీని గురించి హెచ్చరించాడు.
“A Bird in the Hand is Worth Two in the Bush.”
ఇవి కూడా చదవండి
అంటే — చేతిలో ఉన్న ఒక పిట్ట, పొదలో ఉన్న రెండు పిట్టల కంటే విలువైనది. ఈ చిన్న మాటలోనే పెద్ద సత్యం దాగి ఉంది. ప్రపంచంలో జరిగిన ప్రతి ఆర్థిక బుడగను, ప్రతి స్కామ్‌ను, ప్రతి మోసాన్ని అర్థం చేసుకునే మాస్టర్ కీ ఇదే.ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తరచూ గుర్తు చేసే మాట కూడా ఇదే.
మనిషి చాలా మారిపోయాడు. గుర్రపు బండ్ల నుంచి విమానాల వరకు, ఇంటర్నెట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రపంచం ముందుకు దూసుకెళ్లింది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆశ. అదే ఆశను చూసి స్కామర్లు నవ్వుకుంటారు.ఇన్వెస్టర్లు అందరికీ ఈ విషయం తెలుసు.
అయితే, మార్కెట్లో విపరీతమైన వేడి (Manias) ఉన్నప్పుడు, ఇన్వెస్టర్లు ఈ కనీస నియమాన్ని మర్చిపోతారు. కంపెనీలు సృష్టిస్తున్న అసలు విలువను (Value) చూడకుండా, కేవలం ధర పెరుగుతుందనే ఆశతో గుడ్డిగా పెట్టుబడి పెడతారు. ఆ సమయంలో అసలు ‘పక్షులు లేని పొదలను’ కూడా ఎంతో నిస్సిగ్గుగా విక్రయిస్తారు.
“పొదలో పిట్టలు ఉన్నాయి” అని చెప్పేవాళ్లు ఎవరు?
ప్రతి ఆర్దిక బుడగ వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను అమ్మేవాళ్లు కూడా ఉంటారు. డాట్‌కామ్ బూమ్ సమయంలో ఎన్నో కంపెనీలు లాభాలు లేకపోయినా, వ్యాపార నమూనా స్పష్టంగా లేకపోయినా, వాటిని భవిష్యత్తు దిగ్గజాలుగా చిత్రీకరించారు. ప్రమోటర్లు, మార్కెటింగ్ నిపుణులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు కలిసి ఒక కలను విక్రయించారు. ఆ కలలో నిజం ఎంత ఉందో తర్వాత తెలిసింది. చాలా సార్లు పెట్టుబడిదారులు కొనేది వ్యాపారాన్ని కాదు…ఒక కథను. అని అర్దమయ్యే సరికి అంతా అయ్యిపోయింది. చాలా మంది మునిగిపోయారు.
ప్రతి స్కామ్‌లో ఒకే మూడు మాటలు వినిపిస్తాయి — త్వరగా, సులభంగా, రిస్క్ లేకుండా. ఈ మూడు కలిసి కనిపిస్తే అది అవకాశం కాకపోవచ్చు, అది ఉచ్చు కూడా కావచ్చు.
అలాగే కొన్ని సంవత్సరాల క్రితం క్రిప్టోలో ఇదే జరిగింది. “ఈ కాయిన్ కొనండి… చంద్రుడి వరకు వెళ్తుంది!” అని చెప్పారు. లక్షల మంది నమ్మారు. కొంతకాలం ధరలు ఎగిశాయి. తర్వాత చాలా కాయిన్లు 90% కంటే ఎక్కువ పడిపోయాయి. మళ్లీ కొత్త కథ వచ్చింది. మళ్లీ కొత్త ఆశ పుట్టింది.
పేర్లు మారాయి. కానీ కథ మాత్రం మారలేదు.
ఇది కొత్త విషయం కాదు. 1637లో నెదర్లాండ్స్‌లో కూడా ఇదే జరిగింది. ట్యులిప్ అనే పువ్వు కోసం ప్రజలు ఇళ్లు అమ్మేశారు. ఒక పువ్వు మొక్క ధర ఒక ఇంటి ధరను దాటింది. ఎందుకంటే ఆ పువ్వు వల్ల లాభం వస్తుందని కాదు — రేపు ఇంకొకరు ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారని నమ్మకం. అక్కడే పెట్టుబడి ముగిసింది. జూదం మొదలైంది.
బుడగల స్వభావం ఒక్కటే
చరిత్రలో ప్రతి ఆర్దిక బుడగ ఒకే విధంగా మొదలైంది. మొదట కొందరు డబ్బు సంపాదిస్తారు. వారిని చూసి ఇంకొందరు వస్తారు. వారిని చూసి మరింత మంది వస్తారు.చివరకు అందరూ డబ్బు సంపాదిస్తున్నారని అనిపించే దశ వస్తుంది. అదే అత్యంత ప్రమాదకరమైన క్షణం. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు విలువను చూడరు… కేవలం ధరను మాత్రమే చూస్తారు.
బుడగ పగిలినప్పుడు…
మార్కెట్లో ఒక విషయం మాత్రం శాశ్వతం. వాస్తవికత ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఎంత పెద్ద కల అయినా, ఎంత గొప్ప ప్రచారం జరిగినా, ఒక దశలో సంఖ్యలు నిజం చెబుతాయి. అప్పుడు బుడగ పగులుతుంది.
వారెన్ బఫెట్ ఒకసారి చెప్పినట్లుగా…
“ప్రతి బుడగను పగలగొట్టడానికి ఎక్కడో ఒక పిన్ను సిద్ధంగా ఉంటుంది.” ఆ పిన్ను ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ వచ్చినప్పుడు, ఆశతో పరుగెత్తినవారే ఎక్కువగా గాయపడతారు.
ఎలా తప్పించుకోవాలి
ఎవరైనా మీకు పెట్టుబడి అవకాశం చూపిస్తే, మూడు ప్రశ్నలు అడగాలి.
మొదటిది — నిజంగా అక్కడ విలువ ఉందా? నిజంగా డబ్బు సంపాదించే వ్యాపారమా? లేక కథలే అమ్ముతున్నారా?
రెండవది — లాభం ఎప్పుడు వస్తుంది? స్పష్టమైన సమాధానం ఉందా?
మూడవది — రిస్క్ ఎంత? పెట్టిన డబ్బు పోయే అవకాశం ఎంత?
ఈ మూడు ప్రశ్నలకు జవాబు లేకపోతే, అది పెట్టుబడి కాదు. అది ఆశ మీద నడిచే ఆట.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మోసపోయేవాళ్లు అందరూ అమాయకులు కాదు. చాలామంది చదువుకున్నవాళ్లే. తెలివైనవాళ్లే. ఎందుకంటే స్కామ్‌లు లాజిక్‌ను కాదు, ఆశను టార్గెట్ చేస్తాయి. ఆశ పెరిగితే జాగ్రత్త తగ్గుతుంది. లాభాలు కనిపిస్తే ప్రశ్నలు తగ్గుతాయి. అందరూ పరుగెత్తితే మనమూ పరుగెత్తేస్తాం.
ఏదైమైనా…
వేదిక మారింది. ఒకప్పుడు వాల్ స్ట్రీట్‌లో అమ్మిన కథలు, ఇప్పుడు వాట్సాప్‌లో వస్తున్నాయి. ఒకప్పుడు బ్రోకర్లు చెప్పిన మాటలు, ఇప్పుడు యూట్యూబర్లు చెబుతున్నారు. కానీ అమ్మేది మాత్రం ఒక్కటే — పొదలో లేని పిట్టలు.
చివరికి గెలిచేది హైప్ కాదు. హడావిడి కాదు. గెలిచేది నిజమైన విలువ మాత్రమే. ఎందుకంటే సమయం అన్నింటినీ పరీక్షిస్తుంది. బుడగలను పగలగొడుతుంది. అబద్ధాలను బయటపెడుతుంది.
2600 ఏళ్ల క్రితం చెప్పిన పిట్టల కథను వారెన్ బఫెట్ మళ్లీ గుర్తు చేశాడు. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్లు మారుతాయి, మార్కెట్లు మారుతాయి. కానీ ఆశ మాత్రం మారదు. అందుకే ప్రతి తరం కొత్త స్కామ్‌ను చూస్తుంది. ప్రతి తరం కొత్త బుడగను నమ్ముతుంది. ప్రతి తరం పాత తప్పులనే మళ్లీ చేస్తుంది.
కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ఒక్క మాట:
“చేతిలో ఉన్న పిట్టను లెక్క పెట్టు… పొదలో ఉన్న కలలను కాదు!”








