షాకింగ్ నిజం: మీరు వాడుతున్న యాప్… మిమ్మల్ని వాడుకుంటూ కోట్లు సంపాదిస్తోందా? – మైండ్ బ్లోయింగ్ AI గేమ్ ప్లాన్!!
—శివ దువ్వూరు
మీరు చేసిన కాల్… మీరు చేసిన సెర్చ్… మీరు చేసిన ఫిర్యాదు… ఇవన్నీ ఒక రోజు కంపెనీలకు కొత్త ఆదాయ మార్గం అవుతాయని ఎప్పుడైనా ఊహించారా? లేదు కదా..అదెలా అంటారా?
మీరు ఒక యాప్‌లో ఇల్లు గురించి వెతికారు. మరో యాప్‌లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. ఇంకో యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. అంతే. అక్కడితో మీ పని అయిపోయింది,మీరు ఆ యాప్ లను సమర్దవంతంగా ఉపయోగించుకున్నారు అనుకున్నారు. కానీ ఆ యాప్ కంపెనీల పని మాత్రం అక్కడి నుంచి మొదలవుతోంది? నిజానికి వాళ్లే మిమ్మల్ని ఉపయోగించుకున్నారనే విషయం మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు.
ఆయా యాప్ లలో మీరు ఏమి వెతికారు? ఏం అడిగారు? ఏ సమస్య ఎదురైంది? కస్టమర్ కేర్‌కు ఏమని ఫోన్ చేశారు? ఏ సేవను ఎందుకు ఎంచుకున్నారు? మీలాంటి ఇంకెంతమంది అదే సమస్యతో ఫోన్ చేశారు? ఏ ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి? ఏ సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి? అనేది ప్రతీది రికార్డ్ అవుతుంది. అయ్యింది. ఇలా కోట్లాది మంది వినియోగదారుల నుంచి సంవత్సరాల పాటు సేకరించిన సమాచారం ఇప్పుడు భారత యూనికార్న్‌లకు (స్టార్టప్ లకు) కొత్త సంపదగా మారుతోంది.
ఒకప్పుడు ఈ డేటా కేవలం రికార్డు మాత్రమే. ఇప్పుడు అదే డేటానే ఇప్పుడు ఆ సంస్దలకు కొత్త ఆదాయం. ఒకప్పుడు అది ఖర్చు. ఇప్పుడు అది ఆస్తి. ఒకప్పుడు అది సర్వర్‌లో ఉండేది. ఇప్పుడు అది AIగా మారి ఆ యాప్ యజమానులకు డబ్బు సంపాదిస్తోంది. భారత్ స్టార్టప్ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పెద్ద మార్పు ఇదే.
ఇల్లు చూపించిన కంపెనీ… ఇప్పుడు AI అమ్ముతోంది!
NoBroker గురించి మనలో చాలామందికి తెలుసు. ఇళ్లు అద్దెకు ఇవ్వడం, కొనడం, అమ్మడం కోసం పనిచేసే ఈ కంపెనీ రోజూ వేలాది కస్టమర్లతో మాట్లాడుతుంది. ఫోన్లు, చాట్స్, ఫిర్యాదులు, ప్రశ్నలు… ఇలా రోజుకు వేల గంటల సంభాషణలు జరుగుతాయి. మొదట్లో ఈ డేటాను కంపెనీ తన పనిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించింది.
ఆ డేటాని విశ్లేషించి… ఏ ఉద్యోగి బాగా పని చేస్తున్నాడు? కస్టమర్లు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఏ సమస్య ఎక్కువగా వస్తోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఒక AI సిస్టమ్‌ను నిర్మించింది. కానీ కొంతకాలం తర్వాత ఒక ఆలోచన వచ్చింది. “ఈ సమస్య మనకే కాదు కదా… ఇంకెన్ని కంపెనీలకో వస్తుంది కదా.” దీని నుంచే కొత్త బిజినెస్ పుట్టింది.
తమ కోసం తయారు చేసుకున్న AI సిస్టమ్ ని ఇప్పుడు ఇతర కంపెనీలకు అమ్మడం మొదలుపెట్టింది. బెంగళూరులోని ఈ రియల్ ఎస్టేట్ యాప్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతోంది.భారీగా డబ్బు చేసుకోవటం మొదలెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే… ఇల్లు అద్దెకు ఇచ్చే కంపెనీ ఇప్పుడు AI అద్దెకు ఇస్తోంది. నిజానికి ఇది కొత్త ఐడియా కాదు… కానీ పెద్ద ఐడియా. ఇదంతా వినగానే టెక్ ప్రపంచానికి ఒక పాత ఉదాహరణ గుర్తొస్తుంది.
ఇవి కూడా చదవండి
Amazon.
నేటి ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంపెనీలలో ఒకటైన AWS మొదట బిజినెస్ కాదు. Amazon తన అవసరాల కోసం నిర్మించుకున్న సిస్టమ్ మాత్రమే. కానీ తర్వాత అదే ప్రపంచవ్యాప్తంగా వేల కంపెనీలకు సేవలందించే వ్యాపారంగా మారింది. ఇప్పుడు భారత యూనికార్న్‌లను చూస్తున్న ఇన్వెస్టర్ల బుర్రలో కూడా అదే ప్రశ్న తిరుగుతోంది.
“NoBrokerకు ConvoZen ఉంటే… రేపు Swiggyకి ఏముంటుంది? PhonePe ఏమి చేస్తుంది? Ola దగ్గర ఏమి దాగి ఉంది?”. ఎందుకంటే వీళ్లందరి దగ్గర ఒక కామన్ అసెట్ ఉంది. అదే డేటా. అవును అది కోట్లాది మంది వినియోగదారుల డేటా.
అలాగే ‘స్లాక్’ (Slack) అనే చాట్ టూల్ కూడా మొదట్లో ఒక గేమింగ్ స్టూడియోనే. తమ సొంత అవసరాల కోసం తయారుచేసుకున్నదే చాట్ టూల్. ఇలా తమ సొంత అవసరాల కోసం చేసుకున్న టూల్, ఆ తర్వాత ఒక పెద్ద బిజినెస్ ప్లాట్‌ఫామ్‌గా మారడం అనేది సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత నమ్మకమైన సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఇండియా స్టార్టప్‌లు కూడా ఇదే ఫార్ములాను టెస్ట్ చేస్తున్నాయి.
AI రేస్ కొత్త కంపెనీల మధ్య కాదు
చాలామంది AI అంటే కొత్త స్టార్టప్‌లు అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో అసలు పోటీ పాత యూనికార్న్‌ల మధ్య మొదలవుతోంది. ఎందుకంటే కొత్త కంపెనీకి AI నిర్మించడానికి ముందు డేటా కావాలి. కానీ NoBroker, Practo, Swiggy, Zomato, PhonePe లాంటి కంపెనీల దగ్గర ఇప్పటికే ఏళ్ల తరబడి సేకరించిన డేటా ఉంది. అదే ఇప్పుడు వారి పెద్ద బలం.
ఒకప్పుడు వీరంతా కస్టమర్లను సంపాదించడానికి పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ కస్టమర్ల నుంచి వచ్చిన డేటాను సంపదగా మార్చుకోవడానికి పోటీ పడుతున్నారు.
Practo ది మరో దారి
అలాగని అందరూ AIని అమ్మడం లేదు. హెల్త్-టెక్ రంగంలో సీనియర్ అయిన ‘ప్రాక్టో’ కూడా ఇదే లిస్టులో వినిపిస్తున్నప్పటికీ, వారి వ్యూహం వేరుగా ఉంది. ప్రాక్టో తన AIని విడిగా ఒక B2B కంపెనీగా మార్చడం లేదు. దానికి బదులుగా, తమ సొంత హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌ను మరింత పటిష్టం చేయడానికి ఒక “ఇంటెలిజెన్స్ లేయర్” లాగా AIని వాడుతోంది.
రోగికి సరైన డాక్టర్‌ను సూచించడం… మెరుగైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా చేయడం… హెల్త్‌కేర్‌ను సులభతరం చేయడం… ఇవి వారి లక్ష్యాలు. అంటే ఒకే AI. కానీ రెండు వ్యూహాలు. ఒకరు AIని అమ్ముతున్నారు. మరొకరు AIతో తమ సేవను బలోపేతం చేసి బిజినెస్ పెంచుకుంటున్నారు.
కానీ ఇక్కడ ఓ ప్రమాదం
ప్రస్తుతం AI పేరు చెప్పగానే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీల విలువలు పెరుగుతున్నాయి. కానీ ప్రతి డేటా గని బంగారం అవ్వదు. ప్రతి AI ప్రొడక్ట్ AWS కాదు. చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. కొన్ని మాత్రమే విజయవంతమవుతాయి. అందుకే ఇది అవకాశాల కథ మాత్రమే కాదు… పరీక్షల కథ కూడా. ప్రయోగాల కథ కూడా.
డేటా కొత్త పవర్?
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపింది చమురు. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు AI యుగంలో డేటానే కొత్త ఇంధనంగా మారుతోంది. అందుకే భారత యూనికార్న్‌లు ఇప్పుడు యాప్‌లు నడపడం కంటే పెద్ద పని చేస్తున్నారు. వాళ్లు డేటాను డబ్బుగా మార్చే మార్గాలు వెతుకుతున్నారు. కస్టమర్ల డేటాతో ఎవరు ఎక్కువ విలువ సృష్టిస్తారనే అనేదే భవిష్యత్తు.
చివరగా ఒక సింపుల్ నిజం:
మీరు చేసిన ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్, ప్రతి కాల్, ప్రతి ఫీడ్‌బ్యాక్…ఇవన్నీ కలిసి రేపటి టెక్నాలజీ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. అందుకే మనని మనమే ఒక ప్రశ్న అడగాలి:
“నేను ఉపయోగిస్తున్న యాప్… నన్ను ఉపయోగిస్తోందా?”
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే డిజిటల్ యుగంలో అత్యంత ముఖ్యమైన అవగాహన.








