ఉష వల్లే క్రైస్తవంలోకి పునరాగమనం.. భార్యకు క్రెడిట్ ఇచ్చేసిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన చిన్నతనం నుంచి ఉపాధ్యక్షుడిగా రూపాంతరం చెందిన సరళిని న్యూయార్క్ టైమ్స్ తో పంచుకున్నారు. తాను చిన్నతనం నుంచి నాస్తికుడిగా ఉండిపోయానన్నారు. అలానే పెరిగి పెద్దయ్యాననితెలిపారు. అయితే భారత్ నుంచి వచ్చిన వలసదారుల సంతతికి చెందిన ఉషతో ప్రేమ, పెళ్లి.. తన దృక్పధాన్ని మార్చేశాయని తెలిపారు. ఉష స్వయంగా క్రైస్తవురాలు కాకున్నా..తాను తిరిగి క్రైస్తవంలోకి పునరాగమనం చేసేందుకు గట్టిమద్దతుదారుగా నిలిచిందన్నారు జేడీ వాన్స్..
ఇవి కూడా చదవండి
న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ రాస్ డౌథాట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సంవత్సరాల తరబడి తాను అవలంభించిన నాస్తికత్వం , ఆధ్యాత్మిక అనిశ్చితి గురించి ప్రస్తావించారు వాన్స్… ఉషతో తనకున్న సంబంధం తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు.., విశ్వాసం పట్ల తనకున్న దృక్పథాన్ని కూడా మార్చివేసిందని వాన్స్ చెప్పారు.
తన కల్లోలభరిత బాల్యం, ఆ తర్వాత మతంపై విశ్వాసాన్ని కోల్పోవడం నుంచి క్యాథలిక్ మతంలోకి మారడం వరకు సాగిన తన ప్రయాణాన్ని వివరించే ‘కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్’ అనే తన కొత్త జ్ఞాపకాల పుస్తకం గురించి వాన్స్ ప్రస్తావించారు.”నాకు ఒక జ్ఞానోదయం కలిగింది.. దీన్ని అతిశయోక్తిగా చెప్పొచ్చు .. కానీ ఉషతో ప్రేమలో పడటం వల్ల, ప్రేమలో నిజంగానే ఒక పవిత్రమైన విషయం ఉందని నేను గ్రహించాను,” అని వాన్స్ అన్నారు.
తన మత జీవితానికి ఆసరాగా నిలిచిన అమ్మమ్మ మరణం తర్వాత, క్రైస్తవ మతంతో తనకున్న తొలి బంధం బలహీనపడిందని వాన్స్ చెప్పారు. మా అమ్మమ్మ చనిపోవడం, ఆ తర్వాత రెండేళ్లకు నేను నన్ను నాస్తికుడిగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు వాన్స్.
సంవత్సరాల తరబడి, మతానికి దూరమై, విద్య, వృత్తిపరమైన ఆశయాలు , వ్యక్తిగత విజయాల కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు వాన్స్.. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఆ ప్రయత్నాలు చివరికి తనకు సంతృప్తిని ఇవ్వలేదని చెప్పారు. ఇది తనను శూన్యంగా మార్చేసినట్లు గ్రహించానన్నారు.అయితే సాదారణంగా మనుషులు వేదాంతం ద్వారా మతపరమైన క్రియల్లో మునిగిపోతారని.. తాను మాత్రం సంబందాల ద్వారా మతంలోకి వచ్చానన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు తాను వివాహం చేసుకున్న న్యాయవాది అయిన ఉషా వాన్స్ గురించి వాన్స్ విస్తృతంగా మాట్లాడారు. ఆమెకు తనలాంటి క్రైస్తవ విశ్వాసం లేనప్పటికీ, తాను తిరిగి మతంలోకి రావాలనే నిర్ణయం తీసుకోవడంలో ఆమె మద్దతు ఒక ముఖ్యమైన అంశంగా మారిందని ఆయన అన్నారు.
కుటుంబ జీవితం గురించి వివరిస్తూ వాన్స్ ప్రస్తావించారు, “ప్రతి ఆదివారం నేను,భార్య ఉష.. మా ముగ్గురు పిల్లలు కలిసి బయటకు వెళ్ళినప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. వాళ్ళు బూట్లు వేసుకోవడానికి ఆలస్యం చేస్తారు, ఎప్పుడూ అల్లరిగా ప్రవర్తిస్తారు.” దీన్ని ఎప్పుడు ఉష అంగీకరించదన్నారు వాన్స్.
ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న వాన్స్, భర్తగా, తండ్రిగా మారడం తనను జీవితానికి అర్థం, బాధ్యత, ఉద్దేశ్యం వంటి లోతైన ప్రశ్నలను ఎదుర్కొనేలా చేసిందని, చివరికి అవే తనను తిరిగి క్రైస్తవ మతంలోకి తీసుకువచ్చాయని అన్నారు.








