రూ.1 కోటి గెలిచే ఛాన్స్.. ఆమిర్ ఖాన్‌ను ఆపేసిన సైరన్!
కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమితాబ్ బచ్చన్(Amitab bachan) మళ్లీ హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టడం షోకు ఉన్న ప్రత్యేక ఆకర్షణను కొనసాగిస్తోంది. తొలి ఎపిసోడ్లో బట్వారా 1947(Batwara 1947) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్ ఖాన్(Aamir Khan), సన్నీ డియోల్(Sunny Deol), ప్రీతి జింటా(Preethi Zinta) అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యంగా సన్నీ డియోల్ మొదటిసారి ఈ షోకు హాజరవగా, ఆమిర్ గతంలో పలుమార్లు పాల్గొన్న విషయాన్ని అమితాబ్ గుర్తుచేశారు. అదే సందర్భంలో ఆయన వెల్లడించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
అమితాబ్ చెప్పిన వివరాల ప్రకారం, ఒకసారి ఆమిర్ ఖాన్ రూ.50 లక్షలు గెలిచిన తర్వాత రూ.1 కోటి ప్రశ్నకు వెళ్లే అవకాశాన్ని పొందారని, అయితే ఆ ప్రశ్నను అడిగే టైమ్ కే సైరన్ మోగడంతో గేమ్ ముగిసిపోయింది. ఆమిర్ ఆ ప్రశ్నను వెంటనే చూపించాలని కోరినా, రూల్స్ కారణంగా షో ముగిసే వరకు వెల్లడించలేదని అమితాబ్ చెప్పారు. తర్వాత ప్రశ్నను చూపించగా, ఆమిర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారని, ఆయన జ్ఞానాన్ని తాను అభినందించానని అమితాబ్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ తో కొందరు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆమిర్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని కుట్రగా చూడాల్సిన అవసరం లేదని, ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామం మరో అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. కేబీసీ సెలబ్రిటీ స్పెషల్స్‌లో ఉత్కంఠ తగ్గిపోతుందనే అభిప్రాయం బలపడుతోంది. ప్రముఖులు సాధారణంగా మంచి మొత్తాన్ని చారిటీ కోసం గెలుస్తారనే భావన ఆడియన్స్ లో ముందే ఉండటంతో ప్రశ్నలు సులభంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జ్ఞానం ఆధారంగా సాగిన ప్రశ్నోత్తరాల సరళమైన ఫార్మాట్‌నే షో బలం కాగా, ఇప్పుడు ఓవర్ డ్రామా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా ట్రీట్మెంట్, స్పాన్సర్ ప్రస్తావనలు ఆ అసలు అనుభూతిని తగ్గిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తదుపరి ఎపిసోడ్లో సాధారణ పోటీదారులతో అమితాబ్ సంభాషణలు కనిపించనున్న సంకేతాలు రావడంతో, కేబీసీ మళ్లీ తన పాత బలమైన రూపానికి చేరుకుంటుందేమోననే ఆశాభావం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.








