“అలా అయితే మీరు గుహలోనే ఉండాలి!” జాన్వీ కపూర్ కేసులో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్?
ఒక సెలబ్రిటీ పేరు మీద ఫేక్ అకౌంట్ ఉంటే ఏం చేయాలి?
ఆమె ఫొటోతో ఏఐలో అసభ్యకరమైన కంటెంట్ తయారైతే? ఆమె పేరుతో నకిలీ బుకింగ్ ఏజెన్సీలు నడిస్తే?, “తన పేరుతో ఉన్నవి అన్నీ తొలగించాలి” అని కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు కూడా అదే ఆదేశిస్తుందా?
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ విషయంలో ఈ ప్రశ్నలు ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చాయి. తన పేరు, ఫొటోలు, గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ అశ్లీల ఏఐ కంటెంట్, ఫేక్ అకౌంట్లు, నకిలీ బుకింగ్ ఏజెన్సీలు, చాట్బాట్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జాన్వీ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో అశ్లీల, అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించిన న్యాయస్థానం.. ఇంటర్నెట్లోని 5వేలకుపైగా వెబ్‌పేజీలు, సోషల్ మీడియా పోస్టులను తొలగించాలన్న జాన్వీ తరఫు లాయర్ల వాదనలు మాత్రం ‘మరీ వాస్తవాన్ని దాటి అతిగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించింది.
జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ విచారణ చేపట్టిన జాన్వీ తరఫు న్యాయవాదిని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వెబ్‌పేజీలను లిస్ట్ రూపంలో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. స్పష్టంగా అశ్లీల, అసభ్యకర, లైంగిక ప్రేరేపిత కంటెంట్‌తో పాటు జాన్వీ పర్సనాలిటీ రైట్స్ నేరుగా కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్న వెబ్సైట్ల వివరాలను ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించారు.
అయితే.. ఇంటర్నెట్లో తనకు సంబంధించిన 5,000కుపైగా వెబ్‌పేజీలు, సోషల్ మీడియా పోస్టులు, లింకులను తొలగించాలని చేసిన విస్తృత అభ్యర్థన విషయంలో మాత్రం కోర్టు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. “అన్నింటినీ తొలగిస్తే.. ఆఖరికి మీరు గుహలో నివసించాల్సి వస్తుంది” అనే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేసింది.
అసలు కోర్టు ఎందుకు అలా వ్యాఖ్యానించింది? జాన్వీ కోరింది ఏంటి?
తనకు సంబంధించిన 5వేలకు పైగా లింకులను తొలగించాలన్న జాన్వీ అభ్యర్థనపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘‘మేం దేశానికి నైతిక సంరక్షకులం కాదు. సమస్యకు పరిష్కారం వెతుకుతూ అంతకంటే పెద్ద సమస్యను సృష్టించకూడదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం’’ అని వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ పేర్కొంది.
అభిమానుల పేజీలు తమ అభిమానాన్ని వ్యక్తం చేయొచ్చని, అదే సమయంలో విమర్శలు కూడా చేయొచ్చని కోర్టు తెలిపింది. ‘‘మీకు అభిమానులు వద్దా? ఇది డిజిటల్ ప్రపంచం. వ్యాఖ్యలు వద్దు. యూఆర్ఎల్లు వద్దు అని అన్నింటినీ ఆపేస్తే.. చివరకు మీరు గుహలో నివసించాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించింది.
ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులపై ఇంటర్నెట్లో రకరకాల వ్యాఖ్యలు, కంటెంట్ రావడం సహజమేనని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రతి ఫ్యాన్ పేజీని, ఆన్లైన్ కంటెంట్‌ను పూర్తిగా మూసివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేమని స్పష్టం చేసింది. జాన్వీ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అన్ని రకాల కంటెంట్‌పై డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
సెలబ్రిటీలు తమ పేరు, ఫొటోలు, గుర్తింపును ఇతరులు వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై గతంలోనూ కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు జాన్వీ కేసులో సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.
జాన్వీ ఫొటోలు, ఆమె రూపాన్ని ఉపయోగించి ఉత్పత్తులు విక్రయించిన ప్రతిసారీ ఆమె వ్యక్తిత్వ హక్కులను వాణిజ్యపరంగా వినియోగించినట్లేనా? అనే అంశంపైనా కోర్టు ప్రశ్నలు సంధించింది.
ఒక ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రానికి కాపీరైట్ అతనికే ఉంటుందని, ఆ ఫొటోను విక్రయించే హక్కు కూడా అతనికి ఉండొచ్చని పేర్కొంది. ‘‘ఒక ఫొటో నా వద్ద ఉంది. దాన్ని విక్రయించే హక్కు నాకు ఉంది. దాన్ని విక్రయించడం వల్ల అది మీ వ్యక్తిత్వాన్ని కమర్షియల్ గా ఉపయోగించుకున్నట్లేనా? ఒకరు పుస్తకం రాస్తే దాన్ని విక్రయించకూడదా? కాపీరైట్ ఉన్న వ్యక్తికి తన సృష్టిని విక్రయించే హక్కు కూడా ఉంటుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
అదేవిధంగా ఒక కళాకారుడు జాన్వీ ఫొటోను ముద్రించిన కప్పును తయారు చేసి విక్రయిస్తే.. ఆ ఉత్పత్తిపై హక్కులు, దానికి సంబంధించిన కాపీరైట్ అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.
మెటా ఏమంది?
జాన్వీ పిటిషన్‌పై మెటా తరఫు న్యాయవాది వరుణ్ పాఠక్ కూడా వాదనలు వినిపించారు. పిటిషన్లో పేర్కొన్న 5,000కుపైగా లింకులను ఒక్కొక్కటిగా పరిశీలించడం సాధ్యం కాదని మెటా తరఫు న్యాయవాది వాదించారు.
అంతేకాదు.. ఏఐ ద్వారా రూపొందించిన ఫొటో ఉందన్న కారణంతోనే అది స్వయంగా చట్టవిరుద్ధమైపోదని, ఆ కంటెంట్ ద్వారా జీవనోపాధి పొందుతున్న వ్యక్తుల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు.
అయితే అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌లు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేవన్న సంకేతాన్ని కూడా కోర్టు ఇచ్చింది.
ఫైనల్ గా…
జాన్వీకి సంబంధించిన స్పష్టమైన అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌పై కోర్టు రక్షణ కల్పించినప్పటికీ, ఇంటర్నెట్లోని ప్రతి రకమైన కంటెంట్‌పై డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది.
ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.
ఓ రకంగా ఈ కేసులో అసలు పోరాటం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఆలోచించాల్సింది “జాన్వీ ఫొటో ఎక్కడెక్కడ ఉంది?” అనేది కాదు. “డిజిటల్ ప్రపంచంలో ఒక సెలబ్రిటీకి తన ముఖం, పేరు, గుర్తింపుపై హక్కు ఎంతవరకు ఉంటుంది?” ఆ సరిహద్దును ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు గీస్తోంది.








