తెలంగాణ బీజేపీకి మళ్లీ ‘బండి’ జోరు దక్కేనా?
తెలంగాణలో ఏలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ సమరానికి పార్టీని సిద్ధం చేసేందుకు నేతృత్వంలో మార్పులు ఉంటాయా, లేక ప్రస్తుత సారథ్యాన్నే కొనసాగిస్తారా అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును తప్పించి, గతంలో పార్టీని పరుగులు తీటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రాజకీయ వర్గాల్లో బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి మాత్రం నాయకత్వ మార్పుపై స్పష్టమైన సంకేతాలేవీ వెలువడలేదు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘జమిలి’ విధానం అమల్లోకి వస్తే, ఇవి 2029 మే లేదా జూన్ నాటికి మారే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రస్తుత అధ్యక్షుడు రాంచందర్ రావు పదవీకాలం ఇంకా సుమారు రెండేళ్లకు పైగా ఉంది. ఎన్నికలకు ఇంకా తగినంత సమయం ఉన్నందున, ఇప్పుడు హడావుడిగా అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీలో నూతన అసంతృప్తులు, సమన్వయ లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో కేవలం బండి సంజయ్ మాత్రమే కాకుండా మరికొందరు అగ్రనేతలు కూడా ఉన్నారు. తెలంగాణలో బీజేపీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లిన అనుభవం బండి సంజయ్ కి ఉంది. కార్యకర్తలలో ఉన్న విపరీతమైన క్రేజ్, అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలరనే నమ్మకం ఆయనకు సానుకూల అంశాలు. ఇక ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు కూడా పార్టీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న ఈ సీనియర్ ఎంపీలు కూడా అధ్యక్ష బాధ్యతల కోసం జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే నూతన అధ్యక్షుడిని నియమిస్తే, ఆయన రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై పూర్తి పట్టు సాధించడానికి కొంత సమయం పడుతుంది. ఈ విరామం ఎన్నికల సమయానికి పార్టీకి ప్రతికూలంగా మారవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే అధ్యక్షుడిని మార్చడం కంటే, రాంచందర్ రావునే పదవిలో కొనసాగిస్తూనే.. రేసులో ఉన్న ఇతర కీలక నేతలకు వివిధ కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడం, బలమైన సామాజిక వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోవడం, నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచడంపైనే పార్టీ దృష్టి సారిస్తోంది.
మొత్తానికి, బండి సంజయ్ లేదా ఇతర నేతల పేర్లు ఎంతగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రాంచందర్ రావు నేతృత్వంలోనే కమలనాథులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ‘జమిలి’ నిర్ణయం, మారే రాజకీయ సమీకరణాలను బట్టి చివరి నిమిషంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి!








