వ్యాపార, కమ్యూనిటీ నెట్వర్క్ బలోపేతమే లక్ష్యంగా… AAA-ABC నూతన బృందం నియామకం
ఉత్తర అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసుల వ్యాపార, వృత్తిపరమైన , సామాజిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ (AAA) , ‘ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ’ (ABC) సంయుద్ధంగా ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా 2028 నుంచి 2031 వరకు సేవలందించే ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లను అధికారికంగా ప్రకటించాయి. ఈ నూతన నాయకత్వం స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు , నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది.
25 రాష్ట్రాలకు విస్తరించిన ప్రాంతీయ నెట్వర్క్:
ఈ నియామకాల ద్వారా మొత్తం 25 అమెరికన్ రాష్ట్రాలను ఐదు ప్రాంతాలుగా విభజించి డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు నూతన వ్యాపార అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది.
నియమితులైన ప్రాంతీయ డైరెక్టర్లు , వారి పరిధిలోని రాష్ట్రాలు:
బొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్): లాస్‌వేగాస్‌కు చెందిన ఐటీ నిపుణుడు, పారిశ్రామికవేత్త , రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ అయిన వెంకట్… మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
కేటాయించిన రాష్ట్రాలు: నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా.
హనుమంతు సింహబలుడు (సింహ): ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా సేవలందిస్తున్న ప్రముఖ మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాంతాల మధ్య బలమైన వారధిగా నిలవనున్నారు.
కేటాయించిన రాష్ట్రాలు: న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ.
దొమ్మరాజు హేమంత్ వర్మ: టెక్నాలజీ, స్టార్టప్స్, కన్సల్టింగ్ , రియల్ ఎస్టేట్ రంగాల్లో అనుభవం ఉన్న ఈయన, ఈఆర్పీ అండ్ ఆటోమేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, కమ్యూనిటీ వృద్ధి ఈయన ప్రాధాన్యతలు.
కేటాయించిన రాష్ట్రాలు: పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా.
గొట్టిపాటి కళ్యాణ్: 18 ఏళ్లకు పైగా ఐటీ , ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనుభవం కలిగిన పారిశ్రామికవేత్త. వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ఏపీ సంస్కృతిని కాపాడుతూ తెలుగు సమాజానికి సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
కేటాయించిన రాష్ట్రాలు: అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో.
చౌటకూరి చేతన్ రెడ్డి: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవమున్న టెక్ నిపుణుడు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు సరికొత్త వ్యాపార భాగస్వామ్యాలు, సుస్థిర కమ్యూనిటీ ప్రభావాన్ని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నారు.
కేటాయించిన రాష్ట్రాలు: జార్జియా, మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా.
భవిష్యత్ కార్యాచరణ ..
జనవరి 1, 2028 నుంచి డిసెంబర్ 31, 2031 వరకు అమల్లో ఉండే ఈ పదవీకాలంలో, డైరెక్టర్లు అందరూ కలిసికట్టుగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, పరస్పర సహకారాన్ని విస్తరించడం , విభిన్న రంగాల నిపుణులను సమన్వయం చేయడం ద్వారా ఉత్తర అమెరికాలోని ప్రవాస ఆంధ్రప్రదేశ్ సమాజానికి మరింత ప్రయోజనం చేకూర్చేలా AAA-ABC సంస్థ ఈ ప్రణాళికను రూపొందించింది.








