కూటమి సర్కార్కు ‘కౌన్సిల్’ గండం..!
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం (YSRCP LP Meeting) ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే ఏపీ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలపై పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును వైఎస్ జగన్ అధికారికంగా ఎంపిక చేశారు.
అయితే, గత సమావేశాల మాదిరిగానే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. కానీ, తమకు పూర్తి మెజారిటీ ఉన్న శాసనమండలి (కౌన్సిల్) సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరుకావాలని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అసెంబ్లీకి దూరంగా ఉన్నప్పటికీ, శాసనమండలి వేదికగా అధికార చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది.
పోయినసారి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ చేసిన వైసీపీ, ఈసారి నిరుద్యోగుల సమస్యలను ప్రధాన అస్త్రంగా మార్చుకోనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో జరిగినట్లు చెప్తున్న అవకతవకలు, మరియు అభ్యర్థుల ఆందోళనలను మండలిలో బలంగా వినిపించాలని వైసీపీ భావిస్తోంది. మెగా డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా నిరుద్యోగుల పక్షాన నిలబడాలని వైఎస్ జగన్ తన ఎమ్మెల్సీలకు సూచించారు.
ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సులభంగా బిల్లులను ఆమోదింపజేసుకున్నప్పటికీ, శాసనమండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై సిట్ తుది నివేదికతో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీని కట్టడి చేయాలని చూస్తుండగా, మరోవైపు కల్తీ లడ్డు, డీఎస్సీ వ్యవహారాలను అడ్డం పెట్టుకుని శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. దీంతో ఈ వర్షాకాల సమావేశాలలో మండలి వేదికగా ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే రాజకీయం నడవనుందని స్పష్టమవుతోంది.








