తిరుమల విదేశీ భక్తులకు కేంద్రం బిగ్ అప్డేట్..!
విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అంతర్జాతీయ భక్తులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త చెప్పింది. తిరుపతి (రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ‘ఈ-వీసా’ (e-Visa) ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో ఈ-వీసా సేవలు అందించే 37వ విమానాశ్రయంగా, మొత్తంగా 88వ అధికారిక ఎంట్రీ పోర్ట్‌గా తిరుపతి ఎయిర్పోర్ట్ ఈ ఘనత సాధించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ప్రయాణ ఇబ్బందులు చాలా వరకు తప్పనున్నాయి.
ఇప్పటివరకు విదేశీ భక్తులు తిరుపతికి రావాలంటే మొదట చెన్నై, బెంగళూరు, లేదా హైదరాబాద్ వంటి సమీప అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడ తమ ఈ-వీసా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత అక్కడి నుండి రోడ్డు మార్గంలోనో లేదా డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా తిరుపతికి చేరుకునేవారు. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా, చెల్లుబాటు అయ్యే వీసాతో విదేశీ ప్రయాణికులు నేరుగా తిరుపతి విమానాశ్రయంలోనే ల్యాండ్ అయి తమ ఈ-వీసా వెరిఫికేషన్ ప్రక్రియను సులభంగా ముగించుకోవచ్చు.
ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ, రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. తాజా ఈ-వీసా సదుపాయం నోటిఫికేషన్‌తో తిరుపతి ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దుబాయ్, అబుదాబి వంటి ప్రముఖ గల్ఫ్ దేశాల నుండి నేరుగా తిరుపతికి విమాన సర్వీసులు నడిపేలా ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) వంటి ప్రముఖ విమానయాన సంస్థలతో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మరియు అధికారులు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైతే విదేశీ భక్తులకు నేరుగా తిరుమల శ్రీవారి చెంతకు చేరే అద్భుత అవకాశం లభిస్తుంది.








