ఐపీఎల్ ట్రేడింగ్ పై అశ్విన్ సంచలన సలహా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్‌కు ముందే ట్రేడింగ్ విండో రూపంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ట్రేడ్ చేయడానికి యాజమాన్యం చర్చలు జరుపుతోందనే వార్తలు ఐపీఎల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లతో ముంబై ఇండియన్స్ గట్టిగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడం, గత సీజన్లలో పాయింట్ల పట్టికలో వెనుకబడిపోవడమే ఈ భారీ మార్పులకు కారణంగా తెలుస్తోంది.
ఈ సంచలన ట్రేడింగ్ ఊహాగానాలపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ గనుక హార్దిక్ పాండ్యాను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ట్రేడ్ చేయాలని ఫిక్స్ అయితే.. దానికి బదులుగా కేకేఆర్ నుండి ఏ ఆటగాళ్లను డిమాండ్ చేయాలో అశ్విన్ ఒక మాస్టర్ ప్లాన్ చెప్పారు. “నేనే కనుక ముంబై ఇండియన్స్ స్థానంలో ఉంటే.. హార్దిక్‌ను కేకేఆర్‌కు ఇవ్వడానికి ఒకే ఒక్క కండిషన్ పెడతాను. కేకేఆర్ నుండి స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, అలాగే యువ పేసర్ హర్షిత్ రానాలను ముంబై జట్టులోకి పంపాలని డిమాండ్ చేస్తాను. అప్పుడే ముంబై జట్టు మరింత బలంగా మారుతుంది” అని అశ్విన్ స్పష్టం చేశారు.
ట్రేడింగ్ మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హార్దిక్ కోసం శివమ్ దూబేతో పాటు ఒక ఇండియన్ పేసర్‌ను ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, కేకేఆర్ మాత్రం కామెరాన్ గ్రీన్‌ను ట్రేడ్ ఆప్షన్‌గా చూపించే ఆలోచనలో ఉంది. అయితే వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌పై దృష్టి పెట్టేందుకు గ్రీన్ ఒకవేళ దూరమైతే ముంబై నష్టపోతుందని, అందుకే రింకూ, హర్షిత్ రానాలే ముంబైకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, ఇతర జట్లు తమకంటే బలంగా మారకుండా ఉండాలంటే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరి అశ్విన్ చెప్పిన ఈ మాస్టర్ ప్లాన్‌ను ముంబై ఇండియన్స్ అమలు చేస్తుందో లేదో రాబోయే రోజుల్లో తేలనుంది.








