ఉచితాల ముసుగులో ఆర్థిక విధ్వంసం.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
“కూర్చుంటే సొమ్ము.. నిలుచుంటే సొమ్ము.. ఎలా పడితే అలా పరిమితికి మించి అమలు చేస్తున్న ఉచిత పథకాలతో తీవ్ర ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇన్ని ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతే రేపు కుబేరుడైనా సరే ‘పనికి ఆహారం’ వంటి పథకం కింద కూలి పనికి వెళ్లాల్సిందే. ఆ ఖాతా పేరు కూడా ‘కుబేర’ అని పెట్టాలేమో!” శుక్రవారం తెలంగాణ హైకోర్టు ధర్మాసనం చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా నీళ్లలా ఖర్చు చేస్తున్న సమాజానికి, సంక్షేమ పాలనకు స్పష్టమైన హెచ్చరిక.
కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించిన రూ. 33.42 కోట్లలో.. 2024లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ నగేష్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు. విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరై, గత మే నెలలో రూ. 24 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా ఆరు నెలల్లో చెల్లిస్తామని తెలిపారు. రెండు ఏళ్లు గడిచినా చెల్లింపులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, ఉచిత పథకాల మితిమీరిన ధోరణిపై సంధించిన ప్రశ్నలు ప్రస్తుత వ్యవస్థల నిస్సహాయతకు, లోపాలకు అద్దం పడుతున్నాయి.
“అధికారులు మాత్రం ఏం చేయగలరు? మనకు వచ్చే ఆదాయమెంత? ఖర్చ ఎంత? రాష్ట్ర బడ్జెట్లో జీతాలు, అప్పుల వడ్డీలు పోనూ.. మిగిలినదంతా సంక్షేమ పథకాలకే వెచ్చించే పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు బైక్, ఐఫోన్‌తో ఉచిత బియ్యం కోసం వెళుతున్నారు. కోటీశ్వరులకూ రైతుబంధు ఇవ్వడమేంటి? దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతోంది? భవిష్యత్తులో పిల్లలకు ఏం మిగులుతుంది?” అని న్యాయమూర్తి సందర్భంగా ప్రశ్నించారు.
అంతేకాకుండా, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలను ఎండగట్టారు. అప్పులు తీర్చడానికి ప్రభుత్వ భూములను విక్రయిస్తుంటే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి?, అప్పు చేసి ఎవరైనా బెంజ్ కారు కొంటారా? మనం ఎర్రబస్సులో వెళ్లే వాళ్ళం.. ఎయిర్‌బస్సులో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంతకాలం నిలబడుతుంది? రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే ఏకంగా 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యం కాదు. సమాజం తీవ్రమైన ప్రమాదంలో పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉచిత పథకాల అమలుతీరును విశ్లేషిస్తూ, ఒక్క తెల్లకార్డునైనా తొలగించగలరా? అలా తొలగిస్తే అది పెద్ద రాజకీయమవుతుంది. అధికారులపై వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ అధికారీ ఏమీ చేయలేని పరిస్థితి. రేపు మీరే ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేరు అని కోర్టు కుండబద్దలు కొట్టింది.
ఈ వ్యాఖ్యలు నేటి సామాజిక-ఆర్థిక వైపరీత్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ఒకవైపు దేశంలో తెల్లకార్డులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. నిజంగా సంక్షేమ పథకాలు పేదరికాన్ని నిర్మూలిస్తుంటే, దశాబ్దాల పాలన తర్వాత పేద సంఖ్య తగ్గాలి. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం నిజమైన పేదలకు, కోటీశ్వరులకు వ్యత్యాసం లేకుండా పథకాలు వర్తింపజేస్తున్నారు. బైక్‌లు, ఐఫోన్లు ఉన్నవారు సైతం తెల్లకార్డులతో ఉచిత రేషన్ పొందుతుంటే, కోట్లు సంపాదించే భూస్వాములు సైతం రైతుబంధు వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను లబ్ధి పొందుతున్నారు.
ప్రస్తుత కేసులో చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేసినప్పటికీ, హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు పాలకవర్గానికి స్పష్టమైన ముందస్తు హెచ్చరిక. అర్హతలతో సంబంధం లేకుండా ఓట్ల వేట కోసం ఉచితాలను పంచుకుంటూ పోతే, రేపు ప్రభుత్వ యంత్రాంగం కూలిపోవడం ఖాయం. ఉచిత పథకాలకు స్పష్టమైన గీత గీసి, అర్హులైన నిరుపేదలకు మాత్రమే సంక్షేమాన్ని పరిమితం చేస్తూ, మిగిలిన నిధులను పునాది స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనకు మళ్లించకపోతే మన సమాజం, దేశం ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది.








