రసవత్తరంగా ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ డ్రామా..!
రాజేంద్రనగర్ రాజకీయం వేడెక్కింది. అధికారం, కుటుంబ బంధాలు, వ్యక్తిగత వివాహ నిర్ణయాలు కలగలిసి ఒక సంచలనాత్మక పొలిటికల్ డ్రామాకు తెరలేపాయి. నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు సొంత ఇంట్లోనే ఊహించని సవాలు ఎదురైంది. ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ నేరుగా తండ్రిపైనే తీవ్రస్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగరవేసి, మీడియా ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాప్రతినిధిగా అధికార పీఠంపై ఉన్న తండ్రికి, తన ప్రేమ వివాహానికి రక్షణ కోరుతున్న కుమారుడికి నడుమ సాగుతున్న ఈ పోరు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదానికి మూలం సంతోష్ గౌడ్ ప్రేమ వివాహ నిర్ణయమే. రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పటి నుంచి కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేవలం వివాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, తమకు మద్దతుగా నిలిచిన వారిపై భౌతిక దాడులు చేయిస్తున్నారని సంతోష్ నేరుగా ఎమ్మెల్యేపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల మణికొండలోని రూపా రెడ్డి నివాసంలో అపరిచిత వ్యక్తులు ప్రవేశించి సృష్టించిన అలజడి వెనుక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం ఉందని, అంతర్గత ఆస్తి తగాదాలు, మనస్పర్థలే ఈ దాడులకు కారణమని ఆయన స్పష్టం చేశారు.
అధికార వర్గాల ఒత్తిడి, పోలీసుల వైఖరిపై కూడా సంతోష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాణభయంతో అత్యవసరంగా డయల్-100 ద్వారా రక్షణ కోరినప్పటికీ, నార్సింగ్ పోలీసులు స్పందించిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి రాజకీయాధికారానికి పోలీసులు తలొగ్గారని, బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, రివర్స్‌లో తమపైనే అక్రమ కేసులు బనాయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. నిజాలు బయటపెట్టినందుకు తమ ప్రాణాలకు మరింత ముప్పు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అటు బాధితురాలు రూపా రెడ్డి సైతం ఇది ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. తమను జైలుకు పంపించేందుకు ఎమ్మెల్యే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ప్రశాంతంగా జీవించే తమ కుటుంబానికి పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ డ్రామాలో ఊహించని మలుపుగా రూపారెడ్డిని పోలీసులు చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే కేసులో అరెస్టు చేయడం స్థానికంగా మరింత ఉత్కంఠను పెంచింది. ఇది పోలీసులపై వచ్చిన ఆరోపణల కవర్-అప్ చర్యనా లేక పాత కేసుల అమలులో భాగమా అనే చర్చ మొదలైంది.
మరోవైపు ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శైలి వ్యూహాత్మకంగా ఉంది. వాడెవడో తనకు తెలియదని, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సింపుల్ గా కొట్టి పారేశారు. సొంత కుమారుడి గుర్తింపునే ప్రశ్నించేలా వ్యాఖ్యానించడం ద్వారా ఈ వివాదం తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించారా లేక సరైన సమయంలో పూర్తిస్థాయి సమాధానం చెప్పేందుకు సమయం తీసుకుంటున్నారా అనే కోణంలో విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి రాజేంద్రనగర్ శాసనసభ్యుడి కుటుంబంలో రగులుకున్న ఈ నిప్పు, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. అధికార బలం, కుటుంబ అంతర్గత వివాదాలు, పోలీసు వ్యవస్థ తీరు కలగలిసిన ఈ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.








