నేతన్నల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naid) రాష్ట్రంలోని చేనేత కార్మికులకు (Handloom Workers), వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని పునరుద్ధరించడానికి, నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. చేనేత కళ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆ కళను పరిరక్షించుకోవడంతో పాటు మరింత అభివృద్ధి చేయడానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
చేనేత మగ్గాల నిర్వహణ భారం తగ్గించేందుకు అవసరమైన విద్యుత్ (Electricity) రాయితీలను ప్రభుత్వం అందిస్తోంది. చేనేత కార్మికుల శ్రమను గుర్తించి, వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పింఛన్ (Pension) సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ. 25,000 చొప్పున నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ, మొత్తం రూ. 179 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.








