తెలుగు ప్రజల అభిమానం వెలకట్టలేనిది.. ఆటా సభల్లో పూజా హెగ్డే
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ప్రముఖ సినీ నటులు అడవి శేష్ , హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఈ వేదికపై ప్రవాస తెలుగువారితో తమ అనుభవాలను పంచుకుంటూ ఉత్సాహంగా మాట్లాడారు.
అడివి శేష్ మాట్లాడుతూ, ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, ఇక్కడ ఉన్నవారంతా యూతేనని సరదాగా వ్యాఖ్యానించారు. లేడీస్ ఫస్ట్ అంటూ మైక్‌ను పూజా హెగ్డేకు అందించగా, ఆమె ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు సినిమా పరిశ్రమ తనకు ఎంతో ప్రేమను, అభినందనలను అందించిందని పూజా హెగ్డే భావోద్వేగంతో తెలిపారు.
తెలుగు ప్రజల అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తారని, ముఖ్యంగా తనను ‘బుట్టబొమ్మ’ అంటూ పిలుస్తుంటే తాను ఎంతో గర్వంగా, అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. విదేశాలలో కూడా తెలుగు సంస్కృతిని, సినిమాలను ఇంతలా ఆదరిస్తున్న ప్రవాస తెలుగువారందరికీ వారు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.








