అమెరికా వీసా ఇంటర్వ్యూలో సరికొత్త ట్విస్ట్, జాగ్రత్తగా ఉండాల్సిందే!!
మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?
అయితే మీ పాస్‌పోర్ట్ మాత్రమే కాదు… మీ Instagram కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఆశ్చర్యంగా ఉందా..ఇదేం లెక్క..అమెరికాకి, ఇనిస్ట్రగ్రమ్ కు సంభందం ఏమిటా అంటారా..అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
ఒక అమెరికా వీసా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు సాధారణంగా మనం ఏం చేస్తాం?
పాస్‌పోర్ట్ చెక్ చేస్తాం., డాక్యుమెంట్లు సర్దుతాం., బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకుంటాం. ఏ ప్రశ్న అడిగినా తడబడకుండా సమాధానం చెప్పేందుకు ఇంట్లోనే రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తాం. ఇకపై ఇంకో పని కూడా చేయాల్సి రావచ్చు. Instagramలో Privacy Settings ఓపెన్ చేయాలి. అంటే అమెరికా వెళ్లే ముందు మీ ఇంటి తలుపు మాత్రమే కాదు… మీ డిజిటల్ తలుపు కూడా తెరవాల్సి రావచ్చు. అక్టోబర్ 1 నుంచి కొన్ని కేటగిరీలకు చెందిన అమెరికా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను మరింత విస్తృతంగా పరిశీలించనున్నారు.
ఎవరికి ఈ కొత్త నిబంధన చుట్టుకోనుంది?
ముఖ్యంగా యూఏఈ (UAE) నుంచి అమెరికా వెళ్లాలనుకునే మీడియా ప్రతినిధులకు, కొన్ని రకాల ఉద్యోగులకు ఈ రూల్ బాగా వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కింది వీసా కేటగిరీల వారు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీని తొలగించాల్సి ఉంటుంది:
I Visa: విదేశీ మీడియా సంస్థల విలేకరులు, జర్నలిస్టులు, పత్రికలు మరియు టీవీ ఛానళ్ల సిబ్బంది.
TN Visa: USMCA ఒప్పందం కింద అమెరికాలో తాత్కాలికంగా పనిచేసే కెనడా, మెక్సికో దేశాల ప్రొఫెషనల్స్.
TD Visa: పైన చెప్పుకున్న TN వీసాదారుల భార్య లేదా భర్త మరియు వారి పిల్లలు.
మీరు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, లింక్డ్ఇన్ వంటి వాటిల్లో ఏ అకౌంట్స్ వాడుతున్నా.. వాటి సెట్టింగ్స్ ఓపెన్‌గా ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది.
అసలు సోషల్ మీడియాను ఎందుకు తవ్వుతున్నారు?
అమెరికా అధికారుల మాటల్లో చెప్పాలంటే.. తమ దేశంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడమే వారి లక్యం. జాతీయ భద్రతకు లేదా ప్రజా ప్రశాంతతకు ఎవరైనా ముప్పు తెస్తారా అనే కోణంలో ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ ఉపయోగపడుతుందట. వీసా ఇవ్వడం అనేది విదేశీయులకు ఒక హక్కు కాదని, అది తమ ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రత్యేక సదుపాయం మాత్రమేనని అమెరికా తెగేసి చెప్తోంది. మీరు నిజంగానే వీసా నిబంధనలకు కట్టుబడి ఉంటారా లేదా అనేది మీ ఆన్లైన్ పోస్టుల ద్వారా కూడా అంచనా వేస్తారు.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న మిగతా వీసాలు
నిజానికి సోషల్ మీడియాను తనిఖీ చేయడం అమెరికాకు పూర్తిగా కొత్తేమీ కాదు. ఇప్పటికే విద్యార్థి వీసాలైన F-1, M-1లతో పాటు మనవాళ్లు ఎక్కువగా దరఖాస్తు చేసే H-1B, H-3, H-4 వీసాలకు ఈ రూల్ వర్తిస్తోంది. వీటితో పాటు J-1 (ఎక్స్ఛేంజ్ విజిటర్), K-1 (ఫియాన్సే వీసా), సాంస్కృతిక, మతపరమైన వీసాలకు కూడా ఆన్లైన్ పరిశీలన నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా I, TN, TD వీసాలను కూడా ఈ లిస్టులో చేర్చారంతే.
“నేను ఏమీ పెట్టను” అనేవాళ్ల సంగతేంటి?
“నా సోషల్ మీడియాలో ఏమీ ఉండదు. నేను చాలా సైలెంట్.” అని మీరు చెప్పచ్చు. అయితే అది ఒకప్పుడు మంచి విషయం. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా స్క్రీనింగ్ పెరుగుతున్న ప్రపంచంలో అది కూడా ఒక విచిత్రమైన డిజిటల్ బయోగా మారొచ్చు. మీరు పోస్టులు పెట్టకపోవచ్చు.అయితే మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో?, ఏ విషయాలకు స్పందిస్తున్నారో?, ఏం షేర్ చేస్తున్నారో?, మీ పబ్లిక్ ప్రొఫైల్‌లో కనిపించే సమాచారం ఏమిటో? ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క ఆన్లైన్ ఉనికిలో భాగమే. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా సమస్య. యాక్టివ్‌గా లేకపోయినా—కనీసం ఒకసారి అయినా “నా గురించి ఇంటర్నెట్లో ఏముంది?” అని ఆలోచించాల్సిన పరిస్థితి.
అమెరికా వీసా వ్యవస్థలో ఇతర పరిణామాలు
సోషల్ మీడియా నిబంధనలు ఒకవైపు ఉంటే, మరోవైపు అమెరికా వీసా ప్రాసెసింగ్‌లో అనేక ఇతర మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 75 దేశాల ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేసేందుకు ప్రయత్నించినప్పటికీ, కోర్టు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయినప్పటికీ, కాన్సులేట్ అధికారులకు కొత్త రకం శిక్షణ ఇస్తుండటంతో వీసా ఇంటర్వ్యూల ప్రక్రియలో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. అమెరికా వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వ ఉచిత పథకాలపై ఆధారపడకుండా తమను తాము పోషించుకోగలరా లేదా అనే కోణంలో ఎంక్వైరీ చేసేలా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఫైనల్ గా…
ఇప్పటిదాకా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారి అడిగేవాడు: “Where are you going?” అని, ఇప్పుడు డిజిటల్ యుగం మరో ప్రశ్నను తయారు చేసింది: “Who are you online?”. మొదటి ప్రశ్నకు మనం సిద్ధం కావచ్చు. రెండో ప్రశ్నకు మాత్రం మనం సంవత్సరాలుగా మనకు తెలియకుండానే సమాధానాలు రాస్తూనే ఉన్నాం. కాబట్టి అమెరికా వీసా ఇక కేవలం Visa application కాదు. కొంతవరకు అది… Digital application కూడా.మరి అందులో చిన్న సమస్య ఏమిటంటే మీరు మీ వీసా ఫారమ్‌ను edit చేయవచ్చు.మీ Internet historyని మాత్రం ఎప్పుడూ edit చేయలేరు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








