నవల సూపర్ హిట్.. అవార్డుల వర్షం! కానీ ఒక్క AI టెస్ట్‌తో సీన్ రివర్స్!
—సూర్య ప్రకాష
ఒకప్పుడు రచయిత తన పుస్తకం మనుషులు చదివి జనాలకు నచ్చుతుందో లేదో ఏమంటారో అని భయపడేవాడు. ఇప్పుడు అంతకంటే పెద్ద భయం వచ్చింది—AI చదివి ఏమనుకుంటుందో! అని. అదేంటి అంటారా…అవును మరి.. ప్రముఖ ప్రెంచ్ రచయిత థెలిసన్ ఒరేలియన్ రాసిన “It Was Either That Or Die” నవల విషయంలో ఇదే జరుగుతోంది. పుస్తకం వచ్చింది. ప్రశంసలు వచ్చాయి.భారీగా అమ్మకాలు వచ్చాయి. అవార్డుల జాబితాలో పేరు వచ్చింది. ఫ్రాన్స్ సాహిత్య ప్రపంచం ఒక కొత్త రచయితను కనుగొన్న ఆనందంలో ఉంది.
ఈ పుస్తకం ఎంత పెద్ద సక్సెస్ అంటే..కేవలం కొద్ది వారాల్లోనే 54 వేలకుపైగా కాపీలు అమ్ముడైంది. అంటే పుస్తక దుకాణంలో దాన్ని చూసి వెళ్లిపోయిన వారి కంటే, డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్లు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సాహిత్య ప్రపంచంలో ఇది చిన్న విషయం కాదు. పెద్ద రికార్డే. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడే ఏఐ వేలు పెట్టింది. ఉత్సాహం మొత్తం నీరు కార్చేసింది.
మిత్రులో, శతృవులో మరెవరో కానీ…ఒకరు ఈ పుస్తకాన్ని AI డిటెక్టర్‌లో పెట్టారు.అది సెకన్లలో చదివేసింది. చదివి ఊరుకుంటే సమస్య లేదు… “ఇక్కడ ఏదో తేడా ఉంది” అని నొసలు విరిచింది.
అంతే. కొన్ని రోజుల్లోనే అవార్డు షార్ట్‌లిస్ట్‌లో… సాహిత్య చర్చలో ఉన్న నవల నుంచి AI విచారణలో ఉన్న నవలగా మారిపోయింది. చివరకు ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారాల్లో ఒకటైన గోంకూర్ ప్రైజ్ షార్ట్‌లిస్ట్ నుంచి దాన్ని తొలగించారు. ఇంతవరకు సాహిత్యం. ఇక నుంచి ఫోరెన్సిక్ సైన్స్.
రచయిత ఏం చేసాడు.
ఇంత పెద్ద సమస్య వచ్చాక..రైటర్ ఒరేలియన్ ఏమనగలుడు. అతను అందరిలాగే…“నేనే సొంతంగా రాశాను.కావాలంటే ఈ మాట నేను మీకు రాసిస్తాను” అన్నాడు. అయితే రైటర్ “నేనే రాశాను” అంటే, పక్కనుండి ఒక కంప్యూటర్ లేచి “నిరూపించు.” అనే రోజులు ఇవి. దాంతో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. జనం మేము నీ కన్నా ఏఐ నే నమ్ముతామని తేల్చి చెప్పేసారు.
ఒకప్పుడు విమర్శ. ఇప్పుడు విచారణ
పాత రోజుల్లో ఒక విమర్శకుడు పుస్తకం చదివి ఇలా చెప్పేవాడు: “రచయిత భాష,శైలి, ప్లో, చాలా బాగుంది .” లేదా “కథనం కొంచెం నెమ్మదిగా సాగింది.”. అదే విమర్శకుడు నిజంగా కోపంగా ఉంటే “ఈ పుస్తకం చదవడానికి నేను నా జీవితంలోని మూడు రోజులు వృథా చేసుకున్నాను.” అని ముఖం మీదే చెప్పేసేవాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. శైలి, భాష కాదు..ముందు “ఈ పుస్తకం ఎవరు రాశారు?” అని పుస్తకాన్ని AI డిటెక్టర్‌లో వేస్తున్నారు. ఈ కేసులో Pangram, GPTZero సహా మూడు AI డిటెక్షన్ టూల్స్ నవలలో AI ఉపయోగం ఉన్నట్లు సూచించాయి.
ఇక రచయిత 34 అధ్యాయాలు తానే రాశానని అంటూంటే, AIకి మాత్రం 34 అధ్యాయాలు తానే రాసాను అంటోంది. ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా తప్పు మాట్లాడుతున్నారనేది సత్యం.అయితే ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారనేది తేలిపోతే..నిజం చెప్పేది ఎవరో తేలిపోతుంది.
సరే… AI డిటెక్టర్ అంత తెలివైందా?
AI డిటెక్టర్లు కూడా తప్పు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.వాటినే ఫైనల్ సాక్ష్యాలుగా పరిగణించవద్దని అంటున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రధానంగా ఉన్న డేటాతో శిక్షణ పొందిన డిటెక్టర్లు ఫ్రెంచ్ వంటి భాషల్లో ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయో అనేదానిపై అనుమానాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే… ఈ పుస్తకంలోని Acknowledgment పేజీ మాత్రం 100 శాతం మానవ రచన అని AI తేల్చి చెప్పింది. అయితే ఏఐ రాసింది నిజమైతే ఇప్పుడు ఎవరికి థాంక్స్ చెప్పాలి AI కే కదా. ఇదీ తేలని ప్రశ్నే.
ఈ ప్రశ్నకు బదులేది
AI ఉపయోగించారు అంటున్నారు కదా.. అయితే ఎంత ఉపయోగించారు? ఏ వాక్యాలు AIవి?
ఏ ఆలోచనలు మనిషివి? ఏ పేరా ఒరిజినల్? ఏ పదం అనుమానాస్పదం? ఆలోచనలు రచయితవి అయ్యినప్పుడు వాక్యాలు ఏఐ అయితే ఏదన్నా సమస్యా..అలాగే అద్బుతమైన కథ,కథనం ముఖ్యమా..లేక అది ఎవరు రాసారు అనేది ముఖ్యమా.. ఇలా విచారణ చేసుకుంటూ చదువుకుంటూ పోతే..చదివేది ఏమీ ఉండదు. కాబట్టి ఒకటే పరిష్కారం. ఒకప్పుడు పుస్తకం చివర్లో “The End” అని ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇంకో పేజీ అవసరం కావచ్చు: AI Usage Declaration: No robots were harmed in the writing of this novel అని. అదిదా మేటర్.
ఫైనల్ గా..
ఈ వివాదం ప్రచురణకర్తలను కూడా భయపెట్టింది. ఒక ప్రచురణ సంస్థ ఇప్పటికే “100% Human” అనే లేబుల్ తీసుకురావాలని ప్రకటించింది. అంటే ఆ పుస్తకం రాసిన రచయిత AIని ఆలోచనల కోసం కూడా ఉపయోగించలేదని హామీ ఇవ్వాలి.ఏదైమైనా సాహిత్యానికి మార్కెట్ వచ్చిదో లేదో కానీ… సాహిత్యానికి nutrition label రావడం మాత్రం మిగిలింది.








