కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే!?
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. రెండు కీలక స్థానాలకు సంబంధించి పార్టీ అధిష్టానానికి ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన జాబితాలు చేరినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, గెలుపు గుర్రాల ఎంపికకే ప్రాధాన్యం ఇస్తోంది.
ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానం నుంచి సూర్యాపేటకు చెందిన ప్రముఖ నేత ఆర్.సర్వోత్తమ రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, అలాగే నల్గొండ జిల్లాకు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఈ ముగ్గురిలో ఒకరిని బరిలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు తుది దశకు చేర్చింది.
మరోవైపు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ స్థానం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి, గౌరి సతీష్, మన్నె జీవన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. అయితే, మన్నె జీవన్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో మిగిలిన అభ్యర్థుల పేర్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ఈ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఒకదానితో ఒకటి ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో సర్వోత్తమరెడ్డిని ఖరారు చేస్తే, మిగతా ఆశావహులైన గౌరి సతీష్ లేదా పీవీ శ్రీనివాస్, సామా రామ్మోహన్ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు.. ఇతర స్థానాల సర్దుబాట్లపై పార్టీ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.
ప్రభుత్వ విధానాలను పట్టభద్రులకు చేరువ చేయడంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల నాడిని పట్టుకునే సమర్థుడైన అభ్యర్థికే టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.








