తెలంగాణలో బలోపేతానికి బీజేపీ సరికొత్త వ్యూహం!
దక్షిణాదిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఐదుగురు ప్రముఖులతో కూడిన ప్రత్యేక నాయకత్వ కమాండ్ స్ట్రక్చర్‌ను తెరపైకి తెచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన ఈ సంస్థాగత మార్పులు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
అయిదుగురి కమాండ్ స్ట్రక్చర్‌లో రాజకీయ వ్యవహారాలు చూసేందుకు ముగ్గురు, సంస్థాగత బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇద్దరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. రాజకీయ వ్యవహారాల వైపు నుంచి చూస్తే.. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పాటిల్, రేఖా శర్మలు కో-ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సాల్ పైన పార్టీ అధిష్టానం మరోసారి నమ్మకం ఉంచి అదే స్థానంలో కొనసాగించింది.
ఇక సంస్థాగత విభాగం బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ హైకమాండ్, మధుకర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాష్ట్ర ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా నియమించింది. ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన మధుకర్ కు మధ్యప్రదేశ్ బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇకపై హైదరాబాద్ కేంద్రంగా తన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీగా దాశరథిని నియమించారు. ఆయన వరంగల్ కేంద్రంగా పనిచేయనున్నారు. జాతీయ జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ వర్గానికి చెందిన నేతలుగా వీరికి పార్టీలో బలమైన గుర్తింపు ఉంది.
తెలంగాణలో ఇటీవలి పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ ఈ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఒకవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న కాషాయ పార్టీకి, క్షేత్రస్థాయిలో అంతర్గత సమన్వయ లోపం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యవహారాలు, సంస్థాగత పటిష్టతను వేర్వేరుగా విభజించి వేర్వేరు కేంద్రాల నుంచి పర్యవేక్షించాలని హైకమాండ్ భావించింది.
రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్న బీజేపీ, రాబోయే ఎన్నికల నాటికి కేడర్‌లో జోష్ నింపేందుకు ఈ నాయకత్వ పునర్వ్యవస్థీకరణ దోహదపడుతుందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సమర్థులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో క్రమశిక్షణను మరింత కఠినతరం చేయాలని చూస్తోంది. అయితే రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ స్థాయి నుంచి నియమితులవుతున్న ఈ కమాండ్ స్ట్రక్చర్‌కు మధ్య సమన్వయం ఏ మేరకు కుదురుతుంది.. క్షేత్రస్థాయిలో ఇది పార్టీకి ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది.. అనేది వేచి చూడాలి.








