ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయం :రేవంత్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఘన నివాళులర్పించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆమె 131వ జయంతి సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని సీఎం గుర్తుచేశారు. సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని సీఎం చెప్పారు. ఐలమ్మతో పాటు తెలంగాణ వీర మహిళలు చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.








