ఆస్కార్ రేసులోకి నాగాలాండ్ ‘అంఘ్’.. ఈ చిత్రం కథేంటి, ప్రత్యేకత ఏమిటి?
భారతీయ సినిమా అంటే ముంబై, హైదరాబాద్, చెన్నై మాత్రమే కాదు. దేశం చివరన ఉన్న ఓ చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన సినిమా కూడా ప్రపంచ సినిమా వేదికపై తనదైన ముద్ర వేయగలదని ‘అంఘ్’ నిరూపిస్తోంది. 1960ల నాగాలాండ్ నేపథ్యంలో, దాదాపు పూర్తిగా కొన్యక్ భాషలో, 16mm ఫిల్మ్‌పై తెరకెక్కిన ఈ చిత్రం 2027 అకాడమీ అవార్డుల International Feature Film కేటగిరీలో పరిశీలనకు అర్హత సాధించింది. అయితే ఇది ఇంకా ఆస్కార్ నామినేషన్ కాదు.
నిజానికి ఈ రోజుల్లో ఓ సినిమా ఆస్కార్ ఎంట్రీ అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ప్రతీ సంవత్సరం జరిగేదే. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే… ఈ సినిమా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని మనదేశపు ఒక అరుదైన సంస్కృతిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన అద్భుతమైన ప్రయాణం కావటం.
కథేంటి
1963లో ఈ కథ జరుగుతుంది. నాగాలాండ్‌లోని ఇండియా–మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఓ మారుమూల కొండ గ్రామం. ఒకప్పుడు జనాలతో కళకళలాడిన ఆ గ్రామం ఇప్పుడు దాదాపు ఖాళీ. కొత్తగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కుటుంబాలు గ్రామాన్ని విడిచి, సమీపంలోని మిషన్ కేంద్రం చుట్టూ ఏర్పడిన కొత్త నివాసానికి వెళ్లిపోయాయి. పాత గ్రామంలో మాత్రం అంఘ్బా అనే వృద్ధ గ్రామపెద్ద, అతని అనారోగ్యంతో ఉన్న భార్య అంఘ్యా, వారి చిన్న కుమారుడు అమావో మాత్రమే మిగులుతారు.
‘అంఘ్’ అంటే కొణ్యక్ నాగాల సమాజంలో గ్రామపెద్ద లేదా నాయకుడు. తన పూర్వీకుల విశ్వాసాలు, ఆచారాలు, జీవన విధానమే తనకు ప్రపంచం. కానీ అతని చుట్టూ ప్రపంచం మాత్రం వేగంగా మారిపోతోంది. ఒకరోజు అడవిలో వేటకు వెళ్లిన అంఘ్బా దూరంగా ఓ పడవను గమనిస్తాడు. అందులో ఓ అమెరికన్ మిషనరీ. అతడితో పాటు క్రైస్తవ మతంలోకి మారిన కొందరు నాగాలు. చేతిలో రేడియో.. కొత్త దుస్తులు.. కొత్త జీవన విధానం. అంఘ్బా ప్రపంచంలోకి ఆధునికత అప్పటికే అడుగుపెట్టిందని అర్దమవుతుంది.
మిషనరీ కేవలం మతాన్ని తీసుకురావడం కాదు. సౌకర్యాలను కూడా తీసుకొస్తాడు. వైద్యం, విద్య, కొత్త వస్తువులు, కొత్త జీవనశైలి.. ఒక్కొక్కటిగా గ్రామంలోని యువతను ఆకర్షిస్తాయి.గ్రామం ఖాళీ అవుతున్న కొద్దీ అంఘ్బా ఒంటరివాడవుతాడు. అతని పాత పొరుగువాళ్లు ఇప్పుడు మిషన్ సమీపంలో నివసిస్తున్నారు. వారు పాశ్చాత్య దుస్తులు ధరిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. చర్చికి వెళ్తున్నారు. రేడియో వింటున్నారు.
ఒకప్పుడు అందరూ కలిసి ఉపయోగించుకున్న వనరులు కూడా మారిపోతున్నాయి. సామూహిక జీవితం స్థానంలో వ్యక్తిగత ఆస్తి, మార్కెట్ ఆధారిత ఆలోచనలు వస్తున్నాయి. చెట్లు నరికివేసి కొత్త రోడ్డు వేయడం మొదలవుతుంది.అంఘ్బా ఈ మార్పును అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు. అతను కాపాడుకోవాలనుకుంటున్న ప్రపంచం కళ్లముందే కూలిపోతుంది.
మరీ ముఖ్యంగా అంఘ్బా కుమారుడు అమావో ఆ కొత్త ప్రపంచం వైపు ఆసక్తిగా చూస్తుంటాడు. అతను మూగ బాలుడు కావడంతో తండ్రితో తన అసంతృప్తిని మాటల్లో చెప్పలేడు. కానీ అతని ప్రవర్తనలో మాత్రం ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
అయితే మిషనరీ బలవంతంగా ఎవరినీ మార్చడం లేదు. మరి ఒక సమాజం ఎలా మారిపోతుంది?
ఒక సహాయం. ఒక బహుమతి. ఒక పాట. ఒక రేడియో. ఒక మెరుగైన జీవితం మీద ఆశ.
మార్పు ఒక్కసారిగా రాదు. చిన్న చిన్న సౌకర్యాల రూపంలో వస్తుంది. అమావోను కూడా అదే ఆకర్షిస్తుంది.
అతని తండ్రి మాత్రం దాన్ని ప్రమాదంగా చూస్తాడు. అంఘ్యా అనారోగ్యం తీవ్రమవుతుంది. మిషనరీ ఆమెకు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంఘ్బా దాన్ని తిరస్కరిస్తాడు. తన భార్యను తన పూర్వీకుల ఆచారాల ప్రకారమే చూసుకుంటానని పట్టుబడతాడు.అమావోకు మాత్రం ఇది అర్థం కాదు.తన తల్లి బతికే అవకాశం ఉంటే ఎందుకు తండ్రి అడ్డుకుంటున్నాడు?
అతని మనసులో తండ్రిపై కోపం పెరుగుతుంది. చివరకు అంఘ్యా మరణిస్తుంది. ఆమె మరణంతో తండ్రి–కొడుకుల మధ్య చీలిక మరింత పెరుగుతుంది.
అక్కడితో అంఘ్బా తన భార్యను కోల్పోవడమే కాదు.. తన కుమారుడిని కూడా కోల్పోయే దశకు చేరుకుంటాడు. భార్య అంత్యక్రియలను కూడా అంఘ్బా తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తాడు. ఆ ఆచారాల్లో భాగంగా కుటుంబ కుక్కను బలి ఇవ్వడం, మృతదేహంతో పాటు మరణానంతర జీవితం గురించి ఉన్న పాత నమ్మకాలను అనుసరించడం అమావోను తీవ్రంగా కలచివేస్తాయి.
అదే సమయంలో దూరంగా ఉన్న మిషన్ గ్రామం నుంచి వినిపించే ‘Amazing Grace’ గీతం అతని చెవుల్లో పడుతుంది. ఒకవైపు తండ్రి ప్రపంచం. మరోవైపు మిషన్ ప్రపంచం. ఒకవైపు పురాతన ఆచారాలు. మరోవైపు కొత్త విశ్వాసం. అమావో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకునే వయసులోనే తండ్రి ప్రపంచం నుంచి దూరమవుతాడు.
ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత?
‘అంఘ్’ను సాధారణంగా “మిషనరీ వచ్చారు.. నాగాల సంస్కృతిని నాశనం చేశారు” అనే సింపుల్ కథగా దర్శకుడు చెప్పితే ఈ సినిమాని పట్టించుకోవాల్సిన అవసరమే లాదు. కథలో చాలా లేయర్స్ ఉన్నాయంటున్నారు చూసిన వాళ్లు. అలాగే కథలో అంఘ్బా కూడా పరిపూర్ణమైన హీరో కాదు. అతను మొండివాడు. తన నమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడు. తన కొడుకు కోరుకుంటున్న మార్పును అర్థం చేసుకోవడంలో కూడా విఫలమవుతాడు.
ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు కత్తి పట్టుకుని వచ్చి ఒక సంస్కృతిని నాశనం చేయడం లేదు. ఒక పాటతో.. ఒక బహుమతితో.. ఒక వైద్య సహాయంతో.. ఒక రేడియోతో.. ఒక రోడ్డుతో.. ఒక కొత్త ఆశతో.. ఒక ప్రపంచం నెమ్మదిగా మరొక ప్రపంచం స్థానాన్ని ఆక్రమిస్తోంది. చివరికి అంఘ్బా గ్రహించేది ఇదే. తాను పోరాడుతున్నది ఒక వ్యక్తితో కాదు. కాలంతో. అతని భార్య లేదు. గ్రామం లేదు. అతని ప్రజలు లేరు. తనతో కలిసి ఆ పాత ప్రపంచాన్ని గుర్తుపెట్టుకునే వాళ్లు కూడా దాదాపు లేరు.
అతని పక్కన మిగిలింది కుమారుడు అమావో మాత్రమే. అమావో కూడా ఆ పాత ప్రపంచం నుంచి బయటకు వెళ్లే దారిలో ఉన్నాడు. ఈ సినిమా చూస్తున్న వారికి …ఒక ప్రపంచం నెమ్మదిగా అంతరించిపోతున్న దృశ్యాన్ని చూస్తున్న అనుభూతి కలిగిందని చెప్తున్నారు. అదే ఈ సినిమాని అంతర్జాతీయ స్దాయిలో నిలబెట్టే అంశం అవ్వచ్చు. రెండు తరాల భావజాల పోరాటమే ‘అంఘ్’ను ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలబెట్టింది.
మాయమవుతున్న సంస్కృతిని 16mm ఫిల్మ్‌పై ఎందుకు బంధించారు?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ కెమెరాలు, గ్రాఫిక్స్ వెంట పడుతుంటే, దర్శకుడు థేజా రియో మాత్రం పాతకాలపు 16mm ఫిల్మ్ కెమెరాను ఎంచుకోవడం వెనుక ఒక గొప్ప కళాత్మక ఆలోచన ఉంది. 1960ల కాలపు నాగాలాండ్ వాతావరణాన్ని నాచురల్ గ్రెయిన్, వెలుతురు, టెక్స్చర్లతో ప్రేక్షకులకు అనుభూతి చెందించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాల గర్భంలో కలిసిపోతున్న ఒక సంస్కృతిని చూపించడానికి, ఆయన పాతకాలపు ఫిల్మ్ టెక్నాలజీనే ఆశ్రయించడం విశేషం. అంతేకాదు, అక్కడ ప్రొఫెషనల్ నటులు దొరకకపోవడంతో నేరుగా గ్రామాల్లోకి వెళ్లే స్థానిక ప్రజలనే నటులుగా ఎంపిక చేసుకున్నారు. దాంతో తెరపై కనిపించే ప్రతీ దృశ్యం స్టూడియో సెట్ లా కాకుండా, నేటివిటీతో ఎంతో సహజంగా అనిపిస్తుంది.
షార్ట్ ఫిల్మ్ నుంచి మొదలైన ఆస్కార్ ప్రయాణం
ఈ సినిమా ఆస్కార్ ప్రయాణం వెనుక ఉన్న కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2021లో థేజా రియో ఇదే కథను ‘అంఘ్’ పేరుతోనే లఘుచిత్రంగా తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘క్లెర్మాంట్-ఫెరార్డ్’ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఆ చిన్న కథే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్‌గా మారి ఆస్కార్ వైపు అడుగులు వేస్తోంది.
కథలో ఊహించని మలుపు: టొరంటో విజయం, ఆస్కార్ దారి!
2027 ఆస్కార్స్ కోసం భారత్ అధికారికంగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రేసులో ‘అంఘ్’ సినిమాకు కూడా 14 ఓట్లలో 11 ఓట్లు వచ్చినా, గడువులోగా థియేట్రికల్ రిలీజ్ సాధించడంపై ఉన్న అనిశ్చితి వల్ల అధికారిక ఎంట్రీ చేజారింది. ఇక ప్రయాణం ముగిసిపోయిందనుకున్న సమయంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఊహించని మలుపు తిరిగింది. ‘ప్లాట్‌ఫామ్ ప్రైజ్’ పోటీలోని 12 చిత్రాల్లో భారత్ నుంచి పోటీపడిన ఏకైక చిత్రం ‘అంఘ్’ కాగా, సెప్టెంబర్ 20న ఈ సినిమా ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకుంది.
2026లో అకాడమీ తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం, టొరంటో లాంటి ప్రముఖ ఫెస్టివల్స్‌లో ప్రత్యేక జ్యూరీ అవార్డులు గెలుచుకున్న సినిమాలు తమ దేశం అధికారికంగా పంపకపోయినా నేరుగా ఆస్కార్ బరిలో నిలిచే అర్హత సాధిస్తాయి. అలా ఈ కొత్త మార్గం ద్వారా ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా ‘అంఘ్’ నిలిచింది. దీంతో ఒకే ఏడాది భారత్ నుంచి ‘గోంధల్’, ‘అంఘ్’ అనే రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ పరిశీలనకు వెళ్లే అరుదైన అవకాశం ఏర్పడింది.
మేకర్స్ ఆలోచించాల్సిన విషయం
పెద్ద నటులు, భారీ బడ్జెట్, డిజిటల్ టెక్నాలజీ ఏమీ లేకపోయినా ఒక చిన్న తెగ కథ ప్రపంచ వేదికపై మెరిసిందంటే కారణం.. సినిమా ప్రపంచం ఎప్పుడూ కేవలం ఆడంబరాల కోసం కాదు, ఎవరూ చెప్పని నిజాయితీగల కథల కోసం ఎదురుచూస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. మారుతున్న ప్రపంచంలో మనం దేన్ని కాపాడుకోవాలనే విషయం ప్రశ్నిస్తూనే, ఆస్కార్స్ కోసం మనం ఎప్పుడూ అందరికీ తెలిసిన భారతదేశాన్నే చూపించాలా, లేక మనలో దాగి ఉన్న ఇలాంటి అన్వేషించని సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేయాలా అనే కొత్త ఆలోచనను కూడా ఈ సినిమా మన ముందుకు తెచ్చిందనటంలో సందేహం లేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








