రివ్యూ: సినిమాకు తక్కువ…సీరియల్ కీ ఎక్కువ ల ‘పిఠాపురంలో అలా మొదలైంది’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు:మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్
నటీనటులు : డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన,
అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు
సంగీతం : జీసీ క్రిష్, సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్ తపస్వి,
ఎడిటింగ్ :బి సత్యనారాయణ, మాటలు : ఏదోటి శ్రీ రామ్
నిర్మాతలు : దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య)
దర్శకత్వం: మహేష్ చంద్ర
విడుదల తేది :18.09.2026
నిడివి : 2 ఘంటలు
‘ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం…’ వంటి హిట్ చిత్రాలు తీసిన చంద్రమహేశ్(Chandra Mahesh) తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకుని కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తీసిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ రోజు శుక్రవారం విడుదలైన ‘పిఠాపురంలో’ అనగానే ఈ సినిమాకు పవన్‌కల్యాణ్‌కు(Pawan Kalyan) లింక్ ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. ఇంతకూ ఈ చిత్రంలో ఏముంది? మహేశ్ చంద్ర ఈ సినిమాతో ఏం చెప్పబోయారు? ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
కథ :
పిఠాపురం సమీపంలో చిన్నగ్రామంలో నడిచే కథ ఇది. అక్కడ బాగా డబ్బున్న వ్యక్తి బంగారయ్య (పృథ్వీ),(Pridhvi) స్కూల్ టీచర్ విశ్వనాథం (కేదార్ శంకర్)(Kedar Shankar), ఆ ఊరి ప్రెసిడెంట్ వీర రాఘవ (రాజేంద్రప్రసాద్) (Rajendra Prasad)ముగ్గురూ మంచి స్నేహితులు. అలాగే వీరి ముగ్గురి పిల్లలు అయిన గీత (రిహాన), కీర్తన (శ్రీలు), అంజని (ప్రత్యుష) కూడా మంచి స్నేహితులే! బంగారయ్య కూతురికి ఫుల్ ఫ్రీడమ్, డబ్బు ఇచ్చి పెంచుతాడు. స్కూల్ మాస్టర్ అయిన విశ్వనాథం కూతురికి స్వేచ్ఛ అనేది లేకుండా, ఇక విశ్వనాథ్ తన కూతురు బాగా చదువుతూ 100 కు 95 మార్కులు తెచ్చుకున్నా.. వంద ఎందుకు రాలేదని కూతురును అదో రకంగా తిట్టే టైపు. వీర రాఘవ మాత్రం కూతురితో స్నేహంగా ఉంటాడు. నచ్చినట్లు ఉండాలి… హద్దులు మీరకూడదు అంటూ పెంచుతాడు. వీళ్ళు ముగ్గురు కూతుళ్లు స్కూల్ అయ్యాక పిఠాపురంలో కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతారు. ఆ తర్వాత డిగ్రీకి వెళ్తారు. కొత్త పరిచయాలకు ఎట్రాక్ట్ కావడంతో ముగ్గురు అమ్మాయిలు ముగ్గురిని ప్రేమిస్తారు. గీత ఓ అబ్బాయితో లేచిపోతుంది. కీర్తన ఐఏఎస్ చదవాలనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది. అది నచ్చని తండ్రి ఇంటికి బయటకు గెంటేయడంతో బయట కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఈ రెండు సంఘటనలు చూశాక అంజని తన ప్రేమను తండ్రితో చెప్పాలా వద్దా… అనే ఆలోచనలో పడుతుంది. అంజని ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకుందా? చదువుకునే వయసులో తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం జరుగుతుంది? వీరి జీవితాలు ఓ కొలిక్కి వచ్చాయా లేదా? అన్నది కథ.
నటీ నటుల హావభావాలు :
ఏ పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసే నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి వేరే చెప్పాలా? ఊరి ప్రెసిడెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సీన్స్‌లో ఓవర్ యాక్టింగ్ చేసినట్టు సాగదీతగా ఉంది. కేదార్ శంకర్ స్ట్రిక్ట్ ఫాదర్‌గా, పృథ్వీ తనదైన కామెడీ శైలిలో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. హీరోయిన్లు రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ పరిధి మేరకు గ్లామర్ మరియు ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు. ముగ్గురు అమ్మాయిల లవర్స్‌గా నటించిన సాయి ప్రణీత్, విరాట్, సన్నీ అఖిల్ అసలు నటించే అవకాశమే రాలేదు. ముఖ్యంగా గోవా రొమాంటిక్ సాంగ్‌లో విజువల్స్ మరియు సాంగ్ పిక్చరైజేషన్ చాలా రిచ్‌గా వచ్చాయి. కథ పాతదే అయినప్పటికీ, స్క్రీన్ ప్లే విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ లవ్ ట్రాక్స్ కొంత రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలలో ఆర్టిస్టుల మేకప్ మరియు డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే.
సాంకేతిక వర్గం పనితీరు :
ప్రస్తుతం సమాజంలో కనిపెంచిన తల్లిదండ్రులను కాదని చదువుకునే వయసులో ప్రేమ పేరుతో తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకోవడం. అంతా సవ్యంగా సాగితే ఓకే. కానీ ఏదైనా తేడా కొడితే వారిని పట్టించుకునే వారు ఉండరు. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మారుతున్న ఆడపిల్లల బతుకులు. తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉన్నా.. ఒక్కోసారి పిల్లలు తప్పుదారి పట్టడం దీని వల్ల కుటుంబంలో మానసిక అశాంతితో కుమిలి పోవడం వంటి అంశాలు కామన్ ఆడియన్స్‌ను కదిలించేలా తెరకెక్కించాడు మహేష్ చంద్ర. దర్శకుడు మహేష్ చంద్ర ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది, దాన్ని ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా తీయడంలో, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. జీసీ క్రిష్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. విజువల్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. బి సత్యనారాయణ ఎడిటింగ్ ఫర్వాలేదు. కాకపోతే సీన్‌కి సీన్‌కి లింక్ కుదరలేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
పవన్ కల్యాణ్‌కు, పిఠాపురానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే! ఆ టైటిల్‌తో సినిమాను ప్రకటించగానే మంచి హైప్ క్రియేట్ అయింది. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు… పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ గురించి ఏమన్నా చెప్పబోతున్నారా? అంటూ చర్చలు జరిగాయి. అయితే ఇందులో అదంతా ఏమీ ఉండదు. మధ్యలో పిఠాపురం గొప్పతనం, పవన్ కళ్యాణ్ గొప్ప తనం చెప్పే సీన్ మరీ ఇరికించినట్టుగా ఉంది. చూడ్డానికి కూడా అది ఓవర్‌గా ఉంది. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. ఓ విలేజ్ సాగే చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో రాజేంద్రప్రసాద్, పృథ్వీ, కేదార్ శంకర్ పాత్రలు వారి కుటుంబ నేపథ్యాల గురించి పరిచయం చేశారు. ఫస్టాప్ అంతా హీరోయిన్ల స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ ప్రేమ, పెళ్లి ఒక అమ్మాయి లేచిపోయే సీన్స్‌తో నింపేశారు. కాలేజ్ పేరుతో విలేజ్ నుంచి టౌన్‌కి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల్లో వచ్చిన మార్పును చూపించారు. ఈ మధ్యలో సాగే లవ్ ట్రాక్, ఇతర సన్నివేశాలన్ని రొటీన్‌గానే సాగుతాయి. కీర్తన పెళ్లి, గీత లేచిపోవడంతో విరామం పడుతుంది. ఆ తర్వాత అయినా కాస్త కొత్తగా ఏమన్నా చూపిస్తారేమో అని చూస్తే.. అక్కడ కూడా అదే రొటీన్ డ్రామా.
పెళ్లి తర్వాత కీర్తన కష్టాలు, లేచిపోయిన తర్వాత బాయ్‌ఫ్రెండ్ ద్వారా గీతకు ఎదురైన సమస్యలు చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా బాగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో అంజని పెళ్లితో అందరూ ఒక దగ్గరికి చేరినట్లు చూపించారు. క్లైమాక్స్‌లో పెళ్లి తంతు, తండ్రీ కూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రైతుల గురించి చర్చించిన సన్నివేశాలు సినిమాలో కాస్త ఊరట కలిగించే అంశాలు. ఫైనల్‌గా సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గెలవడంతో ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. దాన్నే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టి ఆడియన్స్‌లో అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. అసలు ఈ చిత్రానికి ‘పిఠాపురం అలా మొదలైంది’ అనే టైటిల్ పెట్టకపోయినా.. వేరే ఏదైనా ఊరు పెట్టిన ఈ సినిమా కథలో ఎలాంటి మార్పు ఉండదు. ‘పిఠాపురం అలా మొదలైంది’ సినిమాకు తక్కువ…సీరియల్ కీ ఎక్కువ లా ఉంది.








