మరోసారి మీనాక్షి నటరాజన్ మెడకు ‘శ్రీలత’ కేసు..!
తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం సృష్టించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ చిక్కుల్లో పడ్డారు. ఉన్నత చదువుల నిమిత్తం విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న ఆమెకు వ్యతిరేకంగా బాధితురాలు శ్రీలత నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్తే న్యాయ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, తక్షణమే ఆమె పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
ఈ మొత్తం వివాదానికి మూలాలు 2022 నాటి సంఘటనల్లో ఉన్నాయి. నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నేత కంభం శివకుమార్ రెడ్డి తనను లైంగిక వేధింపులకు గురిచేసి, బెదిరింపులకు పాల్పడ్డారంటూ మాజీ కార్పొరేటర్ ఏఎస్ శ్రీలత పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
అయితే తనపై జరిగిన అఘాయిత్యం, వేధింపుల గురించి నాటి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని, బాధితురాలికి అండగా నిలవాల్సిన పార్టీ పెద్దలు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారనేది శ్రీలత ప్రధాన ఆరోపణ. న్యాయం జరగకపోవడంతో ఆమె 2025లో హైదరాబాద్‌లోని నాంపల్లి 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో మీనాక్షి నటరాజన్‌తో పాటు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులను ప్రతివాదులుగా చేర్చారు. బాధితురాలికి అండగా నిలవాల్సిందిపోయి, నేరానికి పరోక్షంగా సహకరించారనేది వీరిపై ఉన్న ప్రధాన అభియోగం.
ఈ లీగల్ చిక్కులు కేవలం స్థానిక నేతలకే పరిమితం కాలేదు. మీనాక్షి నటరాజన్ జాతీయ రాజకీయ భవిష్యత్తునే దెబ్బతీశాయి. కొద్ది నెలల క్రితం మధ్యప్రదేశ్ నుంచి ఆమె తలపెట్టిన రాజ్యసభ నామినేషన్ పర్వంలో ఈ తెలంగాణ కేసు పెద్ద దుమారమే రేపింది. నామినేషన్ అఫిడవిట్లో తనపై ఉన్న ఈ కోర్టు కేసు వివరాలను గోప్యంగా ఉంచారంటూ బీజేపీ పెద్దలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఆమె నామినేషన్ రద్దయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఆమెకు ఊరట లభించలేదు.
ఇప్పుడు మరోమారు ఇదే కేసు తెరపైకి వచ్చింది. ఉన్నత విద్య పేరుతో ఆమె విదేశాలకు పయనం అవుతుండటంతో.. విచారణను తప్పించుకునేందుకే ఈ టూర్ పెట్టుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తి దేశం విడిచి వెళితే విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే వాదనను బాధితురాలు శ్రీలత బలంగా వినిపిస్తున్నారు.
మొత్తానికి, ఒక మహిళా పార్టీ కార్యకర్త పెట్టిన చిచ్చు కాంగ్రెస్ హైకమాండ్ ను నిద్రపోనివ్వట్లేదు. ఎంపీ పదవి రాకుండా చేసిన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా విదేశీ పర్యటనకు సైతం బ్రేక్ వేస్తుందా లేదా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








