Google Pay, PhonePe లను దాటేస్తుందా?.. ఈ కొత్త Money App ?! దీని స్పెషాలిటీ ఏంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఈ రోజుల్లో మన ఫోన్ నిండా రకరకాల యాప్‌లు కనిపిస్తాయి. ముఖ్యంగా మనీ యాప్స్ అయితే మస్ట్ అండ్ షుట్. రోజూ చాయ్ తాగి పది రూపాయలు పంపాలన్నా, లేదా కూరగాయలు కొని వంద రూపాయలు స్కాన్ చేయాలన్నా వెంటనే Google Pay లేదా PhonePe ఓపెన్ చేస్తాం. బ్యాంకింగ్ కోసం మనకు ప్రత్యేకంగా బ్యాంక్ యాప్‌లు ఉన్నాయి, షేర్లు లేదా పెట్టుబడుల కోసం మరో యాప్ రెడీగా ఉంటుంది. ఇక క్రిప్టో ప్రపంచం కోసం అయితే వేరే యాప్‌లు ఉన్నాయి.
ఇన్ని ఉన్నప్పుడు “మళ్లీ కొత్తగా ఇంకో Money App దేనికి సామీ?” అనే అనుమానం రావడం చాలా సహజం. కానీ, OpenAI లేదా ChatGPT బాస్ Sam Altman సహ-స్థాపకుడిగా ఉన్న World సంస్థ ఇటీవల తీసుకొచ్చిన World Money App మాత్రం మామూలుది కాదు. సాధారణంగా మనం వాడే యాప్‌ల లాంటిది అయితే కాదు. దాదాపు 150కి పైగా దేశాల్లో అందుబాటులోకి వస్తున్న ఈ యాప్ వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఈ మనీ యాప్ స్పెషాలిటీ ఏమిటి, ఎందుకు మనం దీన్ని వాడాల్సి వచ్చే అవకాసం ఉంది?
Google Pay, PhonePeల కంటే ఏ విషయంలో వేరు?
ముందుగా ఒక్క విషయం క్లియర్ గా చెప్పుకోవాలి. ఇది మనం రోజూ వాడే UPI యాప్‌లకు వెంటనే నేరుగా ప్రత్యామ్నాయం అయితే కాదు. మన దగ్గర రోజువారీ టీ, టిఫిన్ ఖర్చులకు UPI వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. కానీ World Money ఆడుతున్న గేమే వేరు.
Google Pay లేదా PhonePe మనం రోజూ వాడే సాధారణ రూపాయిల చెల్లింపుల చుట్టూ తిరిగితే, World Money మాత్రం డిజిటల్ కరెన్సీ, గ్లోబల్ ట్రాన్స్ఫర్స్, డిజిటల్ అసెట్స్, ఇంకా మీ సొంత డిజిటల్ గుర్తింపు (Human Identity) లాంటి అనేక అంశాలను ఒకే చోటకు తెస్తోంది. అంటే మనం Google Payలో కేవలం డబ్బు పంపితే, ఇందులో మాత్రం మీ డిజిటల్ డబ్బును భద్రపరుచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా సులభంగా పంపవచ్చు, అసెట్స్ ట్రేడింగ్ చేయవచ్చు, వాటిపై రివార్డులు కూడా పొందవచ్చు.
యాప్‌లో మీరేం చేయవచ్చు? దాని స్పెషాలిటీ ఏంటి?
ఒక్కో ఫీచర్ విడివిడిగా చూస్తే మనకు కొత్తగా అనిపించకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్లో క్రిప్టో ట్రేడింగ్, డిజిటల్ వ్యాలెట్లు, స్టేబుల్ కాయిన్లు ఉన్నాయి. కానీ వీటిన్నింటినీ World ID అనే ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడెంటిటీతో కలపడమే ఇందులో ఉన్న అసలైన ప్రత్యేకత.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరిగిపోయిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఫేక్ అకౌంట్లు, బోట్లు చాలా ఎక్కువైపోయాయి. అటువంటి సమయంలో “ఈ అకౌంట్ వెనుక ఉన్నది ఏ బాటో కాకుండా నిజమైన మనిషేనా?” అని నిరూపించే Proof of Human గుర్తింపుగా World ID పనిచేస్తుంది. మిగతా యాప్‌లు “మీ దగ్గర ఎంత డబ్బు ఉంది?” అని మాత్రమే అడిగితే, ఈ యాప్ “ఈ ఖాతా నడుపుతున్నది నిజంగా ఒక మనిషేనా?” అని కూడా వెరిఫై చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వచ్చే అనేక మోసాలకు ఇది చెక్ చెప్పే అవకాసం ఉందంటున్నారు.
ఒకే చోట డబ్బు, క్రిప్టో ఇంకా రివార్డులు
ఈ యాప్‌లో వివిధ కరెన్సీలకు సంబంధించిన స్టేబుల్ కాయిన్స్ బాలెన్స్లను మనం నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా వీటిని క్షణాల్లో పంపించుకోవచ్చు. బంగారం వంటి రియల్ వరల్డ్ అసెట్స్‌తో పాటు డిజిటల్ అసెట్స్‌ను కూడా ఈ యాప్‌లోనే కొనటం చేయడం, అమ్మడం చేయవచ్చు.
అంతేకాదు, మీరు World ID ద్వారా “నేను నిజమైన మనిషినే” అని వెరిఫై చేసుకుంటే, ఈ యాప్ ఇచ్చే Earn ప్రోగ్రామ్‌లలో అదనపు రివార్డులు లేదా బోనస్‌లు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీరు నిజమైన మనిషిగా వెరిఫై అయి, ఈ యాప్‌ని రోజూ వాడితే వారి ఈకోసిస్టమ్‌లో యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుందనేది వారి ప్రధాన ఆలోచన.
డబ్బు డిపాజిట్ చేయడం, ఇతర సదుపాయాలు
సాధారణంగా క్రిప్టో లేదా డిజిటల్ కరెన్సీ అనగానే “మన దగ్గర ఉన్న సాధారణ డబ్బును స్టేబుల్ కాయిన్‌గా ఎలా మార్చాలి?” అనే పెద్ద సందేహం చాలామందికి ఉంటుంది. ఈ శ్రమను తగ్గించడానికి వారు Stripeతో టైఅప్ అయ్యారు.
ఉదాహరణకు అమెరికా లాంటి ప్రాంతాల్లో Apple Payలో ఉన్న ఫండ్స్‌ను నేరుగా స్టేబుల్ కాయిన్స్‌గా మార్చి చాలా వేగంగా ఈ వ్యాలెట్లోకి తెచ్చుకోవచ్చు. అలాగే బ్రిడ్జ్-పావర్డ్ వర్చువల్ అకౌంట్స్ ద్వారా కొన్ని దేశాల్లో ఉద్యోగులు తమ జీతాలను కూడా నేరుగా ఈ World Money అకౌంట్లోకి తీసుకునే సదుపాయాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.
మరి మనలాంటి వాళ్లు దీనిని వాడాలా? రిస్కులు ఏమైనా ఉన్నాయా?
మనం రోజూ కూరగాయల షాప్‌లో ₹100 పంపడానికి ఈ యాప్ ఎంతమాత్రం అవసరం లేదు. కానీ డిజిటల్ అసెట్స్, స్టేబుల్ కాయిన్స్ వాడేవారికి, అంతర్జాతీయంగా డిజిటల్ కరెన్సీ లావాదేవీలు చేసేవారికి, తమ వ్యాలెట్పై పూర్తి స్వయంప్రతిపత్తి (Self-custody) కోరుకునేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
అయితే ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఇది మనం వాడుతున్న సాధారణ బ్యాంక్ కాదు. కాబట్టి ఇందులో ఉండే డిజిటల్ అసెట్స్‌కు బ్యాంకులకు ఉండే ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తించదు. అలాగే మీ డిజిటల్ వ్యాలెట్ పాస్వర్డ్ లేదా సెక్యూరిటీ బాధ్యత పూర్తి మీదే అవుతుంది.
ఫైనల్ గా…
ఇది కేవలం మన ఫోన్లో ఉన్న Google Pay, PhonePeలకు మరొక ప్రత్యామ్నాయం మాత్రం కాదు. AI యుగంలో “మన గుర్తింపు” , “మన డబ్బు” రెండింటినీ ఒకే చోటకు చేర్చి నడిపించే ఒక కొత్త రకం ప్రయోగం. కాలక్రమేణా ఇది ఎంతమందికి ఉపయోగకరంగా మారుతుందో, ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాలి!








