EMI కట్టలేదా? మీ బైక్, కారు, ట్రాక్టర్ ఎత్తుకెళ్లొచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఉదయం లేచి ఇంటి బయటకు వచ్చారు. మీ బైక్ కనిపించడం లేదు. ఆఫీస్ టైమ్ అయ్యిపోతోంది. దొంగలు ఎత్తుకెళ్లారా అర్దం కాలేదు. “ఏమైంది?” అని ఇంటి చుట్టు ప్రక్కల వాళ్లని అడిగితే ఎవరికీ తెలియదనే రిప్లై వచ్చింది. చివరకు ఎందుకో అనుమానం వచ్చి.. ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేస్తే.. “EMI బకాయి ఉంది కదా.. వాహనం తీసుకెళ్లాం” అని సమాధానం.అయితే చెప్పాపెట్టకుండా నోటీసు కూడా ఇవ్వకుండా ఇలా దొంగల్లా రాత్రిళ్లు వచ్చి ఎత్తుకు వెళ్లటమేంటి అనిపించింది. కానీ ఏం చెయ్యగలం అని ఫైనాన్స్ ఆఫీస్ కు బయిలుదేరారు. అయితే అందరూ ఇలాగే స్పందిస్తారనే గ్యారెంటీ లేదు.
ఇలాంటి పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు?
బైక్ EMI కావచ్చు.. కారు లోన్ కావచ్చు.. పొలంలో పంటకు ఆధారమైన ట్రాక్టర్ బకాయి కావచ్చు. రెండు మూడు వాయిదాలు ఆలస్యమయ్యాయని అర్ధరాత్రి వచ్చి వాహనం తీసుకెళ్లే హక్కు ఫైనాన్స్ కంపెనీకి ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఒక ట్రక్ యజమాని విషయంలో రాత్రి ఒంటిగంటకు స్టీరింగ్ లాక్ పగలగొట్టి వాహనం తీసుకెళ్లిన ఘటనపై కోర్టు ఇచ్చిన తీర్పు.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఒక్క మాటలో చాలా పెద్ద విషయం.
లోన్ బకాయి ఉండొచ్చు.. కానీ రికవరీ పేరుతో మీ వాహనాన్ని బలవంతంగా, దొంగచాటుగా ఎత్తుకెళ్లడానికి ఫైనాన్స్ కంపెనీలకు ఎలాంటి అధికారం లేదు. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఫైనాన్స్ కంపెనీలకు నచ్చిన పద్ధతిలో వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. అంటే రుణం బకాయి ఉన్నప్పుడు రికవరీకి చట్టబద్ధమైన ప్రక్రియ పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది.
రాత్రి ఒంటిగంటకు ట్రక్ ఎత్తుకెళ్లారు
ఈ తీర్పు వెనుక ఉన్న కేసు హరి దత్త శర్మ అనే ట్రక్ యజమానికి సంబంధించినది. టాటా SFC 407 ట్రక్ కొనడానికి ఆయన చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.10.40 లక్షల రుణం తీసుకున్నారు. తర్వాత EMIలు చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యారు.
2023 ఏప్రిల్ 9న అయోధ్యలోని ఒక గోడౌన్ వద్ద ట్రక్ పార్క్ చేసి ఉంది. సమయం అర్ధరాత్రి దాటింది. దాదాపు ఒంటిగంట సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ట్రక్ స్టీరింగ్ లాక్‌ను పగలగొట్టి తీసుకెళ్లారు.
వాహనం స్వాధీనం చేసుకునే ముందు తనకు సరైన నోటీసు ఇవ్వలేదని శర్మ కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది. లోన్ డిఫాల్ట్ అయితే వాహనం తీసుకోవచ్చు.. కానీ పద్ధతి ముఖ్యం. అయితే సుప్రీంకోర్టు చెప్పింది “EMI కట్టకపోయినా వాహనం స్వాధీనం చేసుకోకూడదు” అని కాదు.
రుణ ఒప్పందం, వర్తించే చట్టాలు, RBI మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనాన్స్ సంస్థలు వాహనాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అందుకు బలప్రయోగం, బెదిరింపులు, దొంగచాటుగా తీసుకెళ్లడం లేదా ఏకపక్ష పద్ధతులు ఉపయోగించకూడదు. కోర్టు దృష్టిలో అసలు సమస్య వాహనం రికవరీ కాదు.. రికవరీ చేసే విధానం.
అలాగే ఒక రుణగ్రహీత EMI చెల్లించకపోతే అతనిపై ఒప్పందపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ ప్రక్రియ చట్టం నిర్దేశించిన హద్దుల్లోనే ఉండాలి.
ట్రక్ అమ్మేసి .. బకాయి అడిగారు
ఈ కేసులో మరో అంశం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. స్వాధీనం చేసుకున్న ట్రక్‌ను ఫైనాన్స్ కంపెనీ రూ.4.5 లక్షలకు విక్రయించింది. ఆ తర్వాత కూడా శర్మ నుంచి రూ.5.71 లక్షల బకాయి చెల్లించాలని డిమాండ్ చేసింది. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కోర్టు కంపెనీ చర్యలను పరిశీలించింది.
చివరకు శర్మకు చెందిన రుణ ఖాతాలను మూసివేయాలని, ట్రక్ అమ్మకం ద్వారా వచ్చిన రూ.4.5 లక్షలను 6 శాతం వార్షిక వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. మానసిక వేదన, జీవనోపాధి నష్టానికి రూ.10 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చులకు మరో రూ.50,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. ఆ ట్రక్ శర్మకు కేవలం ఒక ఆస్తి కాదు. ఆయన జీవనోపాధికి ఆధారం. వాహనం పోవడంతో ఆదాయంపై కూడా ప్రభావం పడింది.








