సౌదీకి హ్యాండిచ్చిన అమెరికా.. హుతీలతో రహస్య చర్చలు..
మిత్రదేశం సౌదీ అరేబియాకు అగ్రరాజ్యం అమెరికా చేయిచ్చింది. అదీ అలా, ఇలా కాదు.. ఏకంగా హుతీలు దాడులకు తెగబడుతున్న సమయంలో పక్కకు జరిగింది. అంతేకాదు.. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌తో ఒమన్‌లో రహస్యంగా సమావేశమైంది. ఈ చర్చల తర్వాత, హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీ అరేబియాకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది.
ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో వారాంతంలో ఈ భేటీ జరిగింది. ప్రాంతీయ మధ్యవర్తిగా ఒమన్ ప్రభుత్వం ఈ చర్చలకు సహకరించింది. ఈ సమావేశంలో అమెరికా తరఫున ఎంబసీ అధికారులు పాల్గొనగా, హౌతీల నుంచి మహ్మద్ అబ్దుల్ సలాం , అబ్దుల్ మాలిక్ అల్ అజిరి వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమెరికా నౌకలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని, 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హౌతీలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇజ్రాయెల్ లేదా ఇతర వాణిజ్య నౌకలను కూడా లక్ష్యంగా చేసుకోబోమని వారు చెప్పినట్లు తెలిసింది. అయితే, తమ దేశంపై సౌదీ దిగ్బంధనం విధించినందున, సౌదీకి సంబంధించిన నౌకలకు ఈ హామీ వర్తించదని స్పష్టం చేశారు.
ఇటీవల ఎర్ర సముద్ర తీరంలో హౌతీలు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సైనిక సహాయం కోరారు. అయితే, హౌతీలతో తాము నేరుగా సంప్రదింపులు జరుపుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే ధ్రువీకరించారు. తాజా భేటీతో సౌదీ అభ్యర్థనను అమెరికా తిరస్కరించినట్లయింది. ఈ పరిణామంతో, దౌత్య మార్గాలను అన్వేషించాల్సిన ఒత్తిడి సౌదీ అరేబియాపై పెరిగింది. దీంతో సౌదీ.. ఇప్పుడు పరోక్షంగా ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.








