రష్యాపై ఆంక్షల బిల్లుకు సెనెట్ ఆమోదం.. వందశాతం సుంకాల ముప్పు జాబితాలో ఇండియా, చైనా….!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్న విధంగానే ముందుకెళ్తున్నారు. రష్యా ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసే క్రమంలో .. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వందశాతం సుంకాలు విధించేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సెనెట్ ఆమోద ముద్ర వేసింది.దీంతో.. భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి వీలు కలగనుంది. సెనెట్ లో 262-159 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది. ఆగస్టులోనే సెనెట్ ఈ బిల్లును ఆమోదించింది.ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేయడమే మిగిలింది.
దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా శాంక్షనింగ్ రష్యా (Russia), ఇరాన్ యాక్ట్ 2026ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యా (Russia) పై ఒత్తిడి పెంచడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. అప్పట్లో దీనిని ట్రంప్ (Donald Trump) ఆర్థిక బంకర్ బస్టర్‌గా అభివర్ణించారు. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. దీనికింద ఆంక్షల నుంచి తప్పించుకుంటూ రష్యా చమురును అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే రహస్య నౌకలపై (Shadow Tankers) కఠిన చర్యలు తీసుకుంటారు. ఇరాన్ ఇంధన, ఆయుధ రంగానికి నిధులు అందకుండా గతంలో ఉన్న ఆంక్షలను 2031 వరకు పొడిగించారు.
రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100% వరకు పెనాల్టీ సుంకాలు (Tariffs) విధించే అసాధారణ అధికారం ట్రంప్‌నకు లభించనుంది. ప్రస్తుతం రష్యా చమురును ప్రపంచంలోనే అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా (China) మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ బిల్లు అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాల్చిన తర్వాత కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ సర్కార్ 100 శాతం వరకు అదనపు పన్నులు విధించే ముప్పు పొంచి ఉంది.








