రేవంత్ రివర్స్ ఎటాక్.. బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిందా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ధరణి పోర్టల్, 22ఏ నిషేధిత భూముల జాబితా గురించే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంధించిన అస్త్రాలు బీఆర్ఎస్ శిబిరాన్ని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడంలో సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో సుమారు కోటి ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. ఇందులో అడవులు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు పోను.. పౌరుల మధ్య వివాదంలో ఉన్న ప్రైవేట్ భూమి కేవలం 3.05 లక్షల ఎకరాలు మాత్రమేనని అధికారిక రికార్డులతో సహా నిరూపించారు.
అంతేకాకుండా, విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పెద్దల బాగోతాన్ని సభలోనే బట్టబయలు చేశారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో కేసీఆర్ కుటుంబం, బంధువుల పేరిట ఏకంగా 440 ఎకరాల భూకమతాలు ఉన్నాయని గణాంకాలతో సహా బయటపెట్టారు. కేసీఆర్ పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబం పేరిట 123 ఎకరాలు, హరీశ్ రావు కుటుంబానికి 29.5 ఎకరాలు, జోగినపల్లి సంతోష్ రావు కుటుంబం పేరిట 79 ఎకరాల భూములు ఉన్నట్లు ప్రకటించి ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేశారు.
ఇవి కూడా చదవండి
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కాంపౌండ్ చుట్టుపక్కల విస్తరించి ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూముల కేటాయింపులపై కేవలం 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సిద్దిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులను సీఎం ఆదేశించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఒకవేళ ఆక్రమణలు రుజువైతే, ఆ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన దళిత రైతులకు పంపిణీ చేస్తామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలమైన సామాజిక అస్త్రాన్ని ప్రయోగించింది. భూముల రక్షణ, దళిత హక్కుల అంశాన్ని ముందుకు తెచ్చి, బీఆర్ఎస్ను నైతికంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేసీఆర్ కుటుంబం వద్ద ఉన్న భూములన్నీ దశాబ్దాల క్రితం చట్టబద్ధంగా కొనుగోలు చేసినవేనని, వాటిని కేవలం వ్యవసాయ అవసరాల కోసమే ఉపయోగిస్తున్నామని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలు, 22ఏ డిజిటలైజేషన్ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసిందని మండిపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి భూసేకరణ జరగలేదని, విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని సవాల్ విసురుతోంది.
మొత్తానికి, 22ఏ వివాదం కాస్తా తెలంగాణలో వ్యక్తిగత ఆస్తులు, భూముల విచారణకు దారితీసింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టగా, రాబోయే 30 రోజుల్లో రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పెనుమలుపులు తిప్పుతుందో వేచి చూడాలి!








