‘Confirm Shaming’పై Rapidoకు షాక్.. రూ.10 లక్షల జరిమానా
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. ఎక్కడికో అర్జెంట్ గా వెళ్లాలి. మీరు Rapido యాప్ ఓపెన్ చేసి గమ్యస్థానం ఎంటర్ చేశారు. స్క్రీన్‌పై ₹60 ఛార్జీ కనిపించింది. మీరు ఆ మొత్తానికి రైడ్ బుక్ చేయబోతుండగా.. “Higher the price, higher the chance of getting a ride” అనే సందేశం కనిపించింది. అంటే.. “ధర పెంచితే రైడ్ దొరికే అవకాశం పెరుగుతుంది” అన్న భావన కలిగించేలా మెసేజ్ కనిపిస్తుంది. దాంతో పాటు ₹10, ₹20, ₹30 అదనంగా చెల్లించే ఆప్షన్లు కూడా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు సహజంగానే ఒక అనుమానం వస్తుంది. ₹60కే బుక్ చేస్తే రైడ్ దొరకదా? ఇంకో ₹10 లేదా ₹20 పెంచితే త్వరగా రైడ్ కన్ఫర్మ్ అవుతుందా? అని, మనం వెంటనే రేటు పెంచుతాము. అయితే నిజంగానే రేటు పెంచితే రైడ్ కన్ఫర్మ్ అవుతుందా. ఈ సందేహమే వినియోగదారుల పరిరక్షణ సంస్థ దృష్టిని ఆకర్షించింది.
పది లక్షలు జరిమానా
కస్టమర్లు రైడ్ పొందాలంటే అదనంగా చెల్లించాల్సిందే అన్న భావన కలిగించే విధంగా యాప్‌లో సందేశాలు, డిజైన్‌ను ఉపయోగించిందన్న అంశంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) Rapidoను నిర్వహించే Roppen Transportation Services Pvt Ltdపై చర్య తీసుకుంది. సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
CCPA దృష్టిలో ఈ వ్యవహారంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair Trade Practices), అన్యాయమైన ఒప్పంద నిబంధనలు (Unfair Contract Terms), అలాగే వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే డార్క్ ప్యాటర్న్స్ (Dark Patterns) వంటి అంశాలు ఉన్నాయి.
అసలు ‘Confirm Shaming’ అంటే ఏమిటి?
ప్రభుత్వం 2023లో గుర్తించిన డార్క్ ప్యాటర్న్స్‌లో ‘Confirm Shaming’ కూడా ఒకటి. అంటే.. వినియోగదారు ఒక ఆప్షన్‌ను ఎంచుకోకపోతే తాను ఏదో తప్పు చేస్తున్నట్టుగా, లేదా తనకే నష్టం జరుగుతున్నట్టుగా భావించేలా యాప్ డిజైన్ చేయడం.
రాపిడో విషయంలో.. అదనంగా డబ్బు చెల్లించకపోతే రైడ్ త్వరగా దొరకదనే భావనను వినియోగదారుల్లో కలిగించిందని CCPA పేర్కొంది. ఆగస్టు 31న జారీ చేసిన 34 పేజీల ఉత్తర్వుల్లో CCPA ఈ విషయాన్ని వివరించింది. ముఖ్యంగా.. బుకింగ్ ప్రక్రియలో ఇప్పటికే ముందుకు వెళ్లిన వినియోగదారుడికి ఆ దశలో ధరపై చర్చించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో ఎక్కువ చెల్లించేలా ప్రేరేపించడం సమస్యాత్మకమని తెలిపింది.
‘ధర పెంచితే రైడ్ వస్తుంది’.. నిజంగా ఆధారం ఉందా?
CCPA విచారణలో మరో కీలక అంశం బయటపడింది. అదనంగా చెల్లించే మొత్తాన్ని పెంచితే నిజంగానే రైడ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం పెరుగుతుందని చూపించే డేటాను రాపిడో సమర్పించలేకపోయిందని అధికార సంస్థ తెలిపింది.
అయితే రాపిడో మాత్రం ఇది డ్రైవర్-రైడర్ మధ్య జరిగే రియల్ టైమ్ నెగోషియేషన్ మాత్రమేనని వాదించింది.
ఈ వాదనను CCPA అంగీకరించలేదు.
ఎందుకంటే.. రైడ్‌కు ధరను నిర్ణయించేది ప్లాట్ఫారమేనని, అదే సమయంలో కస్టమర్ ,డ్రైవర్ ఇద్దరి వైపు జరిగే లావాదేవీని కూడా ప్లాట్‌ఫారమ్ నియంత్రిస్తోందని పేర్కొంది. కాబట్టి రాపిడోను కేవలం తటస్థ మధ్యవర్తిగా చూడలేమని స్పష్టం చేసింది.
‘Set your price’ ఫీచర్‌పైనా అభ్యంతరం
రాపిడోలోని ‘Set your price’ ఇంటర్ఫేస్ను కూడా CCPA తప్పుబట్టింది. కస్టమర్ స్లైడర్‌ను పైకి జరిపి ఎక్కువ ధరను ఎంచుకుంటే.. యాప్‌లో “Higher the price, higher the chance of getting a ride” అనే సందేశం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
అదే ధరను తగ్గించడానికి ప్రయత్నిస్తే ఎరుపు లేదా ఆరెంజ్ రంగులో హెచ్చరిక కనిపిస్తుంది. అంతేకాదు.. ధరను పెంచేందుకు ఇచ్చిన స్థలం, తగ్గించేందుకు ఇచ్చిన స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందని CCPA గుర్తించింది.
ఇలాంటి డిజైన్ వినియోగదారుడిని సహజంగా ఎక్కువ ధర వైపు నడిపిస్తుందని, ఇది మరో డార్క్ ప్యాటర్న్ అయిన ‘Interface Interference’ కిందకు వస్తుందని అధికార సంస్థ పేర్కొంది.
అంటే కేవలం మాటలతోనే కాకుండా.. యాప్ స్క్రీన్ డిజైన్, రంగులు, బటన్ల అమరిక ద్వారా కూడా వినియోగదారుడి నిర్ణయాన్ని ప్రభావితం చేయడం అన్నమాట.
ఇది ‘Tip’నా.. లేక రైడ్ ధరలో భాగమా?
‘టిప్’ అనే పదాన్ని ఉపయోగించడంపైనా CCPA ప్రశ్నలు లేవనెత్తింది. సాధారణంగా టిప్ అనేది సేవ అందించిన తర్వాత వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చే అదనపు చెల్లింపు. కానీ రైడ్ బుక్ చేసుకునే ముందే.. “ఎక్కువ ఇస్తే రైడ్ త్వరగా దొరుకుతుంది” అనే విధంగా దాన్ని చూపించడం సరైన పద్ధతి కాదని CCPA అభిప్రాయపడింది.
CCPA ప్రకారం.. కస్టమర్‌కు చూపించే అసలు రైడ్ ధరలో ఇప్పటికే దూరం, ప్రయాణ సమయం, ట్రాఫిక్ పరిస్థితులు, టోల్ ఛార్జీలు, డ్రైవర్‌కు చెల్లించాల్సిన మొత్తం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.
అందువల్ల రైడ్ అందించడానికి ముందు అదనంగా చెల్లించే మొత్తాన్ని ‘టిప్’గా చూపించడం వినియోగదారుడిని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొంది.
కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
CCPA తన ఉత్తర్వులో Motor Vehicle Aggregator Guidelines, 2025ను కూడా ప్రస్తావించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. డ్రైవర్‌కు ఇచ్చే స్వచ్ఛంద టిప్ ఆప్షన్ ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే వినియోగదారుడికి కనిపించాలి.
రైడ్ బుక్ చేసే సమయంలో లేదా ప్రయాణం జరుగుతున్నప్పుడు టిప్ ఆప్షన్ అందుబాటులో ఉండకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి.
Ola, Uberపైనా విచారణ
రాపిడోపై తీసుకున్న చర్య ఒక్క కంపెనీకి మాత్రమే పరిమితం కాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రైడ్-హెయిలింగ్, బైక్-ట్యాక్సీ ప్లాట్‌ఫారమ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ వినియోగంపై CCPA విస్తృతంగా పరిశీలిస్తోంది.
Uber, Ola ప్లాట్‌ఫారమ్‌లపై విచారణ ఇంకా కొనసాగుతోంది. రాపిడోకు CCPA తన ఆదేశాలను అమలు చేసినట్లు చూపించే కంప్లయన్స్ రిపోర్ట్‌ను 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.








