జెన్ జీ ఓట్ల కోసమే ‘రాజీవ్ యువ వికాసమా’?
తెలంగాణ రాజకీయాల్లో నిరుద్యోగ అంశం ఎప్పుడూ ప్రధాన అంశమే. అధికారంలోకి రావడానికి ముందు యువతను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత వాటి అమలులో జాప్యం ప్రభుత్వాల పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంటాయి. సరిగ్గా ఇదే కోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఈ ఫైలు గత కొన్ని నెలలుగా కార్యరూపం దాల్చకపోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది.
స్వశక్తితో యువత వ్యాపారాలు చేసుకునేలా ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. 6 వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపులతో, హైదరాబాద్‌లో భారీ హోర్డింగులతో చేసిన ప్రచారం యువతలో భారీ ఆశలను రేకెత్తించింది. అయితే, ఆచరణలోకి వచ్చేసరికి నిధుల కొరత, సిబిల్ స్కోర్ నిబంధనలు, బ్యాంకర్ల ఉదాసీనత వంటి కారణాలతో ఈ స్కీం నిలిచిపోయింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేల జోక్యం, సిఫార్సుల పర్వం నడుస్తోందన్న ఆరోపణలు ప్రభుత్వ నైతికతను ఇరుకున పెట్టాయి.
మాటిచ్చి అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ పథకం నిలిచిపోవడం బలాన్ని చేకూర్చింది. యువ శక్తి ఎటుపోయింది? అంటూ ప్రతిపక్షాలు ప్రతి వేదికపై నుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో, ప్రభుత్వం పట్ల యువతలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లారాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.
రాజకీయ విమర్శల నుంచి తప్పించుకోవడానికి, ముఖ్యంగా భవిష్యత్తు ఎన్నికల్లో కీలకమైన జెన్ జీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ సర్కార్ ఇప్పుడు మళ్లీ ఈ పథకానికి దుమ్ము దులుపుతోంది. ఇందులో భాగంగానే ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుంచి ఈ పథకం ద్వారా తొలి విడత ఆర్థిక సాయం అందించేలా కసరత్తు జరుగుతోంది. వచ్చిన లక్షలాది దరఖాస్తులను పరిశీలించడం, పారదర్శకత లేకపోతే మళ్లీ విమర్శలు ఎదురుకావడం ప్రభుత్వానికి కత్తి మీద సాములాంటి విషయమే. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఇంటర్వ్యూలు పూర్తి చేసినా, క్షేత్రస్థాయిలో అమల్లో స్పష్టత కొరవడింది.
హామీల అమలు విషయంలో ఎదుర్కొంటున్న వ్యతిరేకతను తిప్పకొట్టేందుకు, ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఈ డ్యామేజ్ కంట్రోల్ అవసరమని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 19 నాటికి నిజంగానే నిరుద్యోగుల ఖాతాల్లో సబ్సిడీ రుణాలు జమ అవుతాయా? లేక ఇది మరోసారి రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్న కాలయాపన ప్రకటన మాత్రమేనా అనేది వేచి చూడాలి.








