‘మే డే’ మూవీ రివ్యూ: కోల్డ్ వార్ టైమ్ లో యాక్షన్ కామెడీ.!
Rating : 2.75
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఈ కథ 1987 లో జరుగుతూంటుంది. అప్పట్లో ప్రపంచం మొత్తం అప్పట్లో రెండు శిబిరాలుగా విడిపోయి ఉంది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్.ఒకరంటే ఒకరికి పడదు. డైరెక్ట్ యుద్దం లేకపోయినా,కోల్డ్ వార్ నడుస్తూండేది. ఆ ఇంపాక్ట్ ప్రపంచమంతా కమ్ముకుని ఉంది. ఆ టైమ్ లోనే అమెరికా నేవీకి చెందిన ట్రాయ్ కెల్లీ (Ryan Reynolds) అనే పైలట్ ఒక టాప్ సీక్రెట్ మిషన్ కోసం ఆకాశంలోకి ఎగురుతాడు.
ట్రాయ్‌కు తనపై తనకున్న నమ్మకం కాస్త ఎక్కువే. అందుకే అతడిని అందరూ సరదాగా “అస్సాసిన్” అని పిలుస్తుంటారు. విమానం నడపడంలో తనని కొట్టగలిగినవారు లేరు అని అనుకుంటూంటాడు. ప్రమాదాలని పలకరించటం, అవకాశం వస్తే ప్రమాదం ఆడుకోవటం తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు చెప్పుకుంటూంటాడు. అందుకు తగ్గట్లే ముందుకు వెళ్తూంటాడు. అయితే అత్యుత్సాహం, అతి ధైర్యం అన్ని వేళలా కలిసి రావు కదా. అలాగే సీక్రెట్ మిషన్ మీద వెళ్తున్న అతను ఓ రోజు ఊహించని చిక్కుల్లో పడిపోతాడు.
ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ట్రాయ్ విమానం నుంచి దూకాల్సి వస్తుంది. ప్రాణాలతో బయటపడ్డాననే ఆనందం కూడా అతడికి ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే కళ్లు తెరిచి చూసేసరికి అతడు అమెరికాలో ఉండడు. తన సైనిక స్థావరంలో అసలే ఉండడు. తమ శత్రు దేశం సోవియట్ రష్యాలో ఉంటాడు. అది కూడా దట్టమైన అడవుల మధ్య, ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక విచిత్రమైన ఇంట్లో ఉంటాడు.
ట్రాయ్‌కు స్పృహ వచ్చినప్పుడు అతడి కాలు తీవ్రంగా గాయపడి ఉంటుంది. పైగా మంచానికి కట్టేసి ఉంటాడు. ఎదురుగా భారీ గడ్డంతో, చూడటానికి కాస్త భయంకరంగానే కనిపించే ఒక రష్యన్ వ్యక్తి నిలబడి ఉంటాడు. అతడి పేరు నికొలాయ్ ఉస్తినోవ్ (Kenneth Branagh). కానీ అంత పొడవైన పేరు పలకడం కష్టమేమో అనుకున్నాడో ఏమో, తనను మాత్రం “నిక్” అని పిలవమంటాడు.
ట్రాయ్‌కు మొదటి నుంచి అతడిపై నమ్మకం ఉండదు. అసలు శత్రుదేశంలో ఇతనెవరు..తన ప్రాణాలను ఎందుకు కాపాడాడు? తనను మంచానికి ఎందుకు కట్టేశాడు? బయటకు వెళ్లనివ్వకుండా ఎందుకు చూస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అతడి తలలో తిరుగుతూనే ఉంటాయి.
కానీ నిక్‌ను కొద్దిసేపు గమనిస్తే ట్రాయ్‌కు ఇంకో పెద్ద సందేహం వస్తుంది.ఇతడు నిజంగా రష్యన్ అతనేనా? అని. ఎందుకంటే నిక్కు అమెరికా అంటే మామూలు అభిమానం కాదు. అతడి ఇంట్లో అత్యంత విలువైన వస్తువు Top Gun సినిమా VHS క్యాసెట్. గోడపై కూడా అదే సినిమా పోస్టర్ ఉంటుంది. అమెరికన్ సినిమాలంటే పిచ్చి. అమెరికన్ సంగీతమంటే మోజు. ముఖ్యంగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ పాటలంటే ప్రాణం. జీవితంలో ఇప్పటివరకు మెక్‌డొనాల్డ్స్‌లో ఒక్కసారి కూడా తినకపోయినా, ఒకరోజు తింటే మాత్రం అది తనకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మే రకం. ఏమిరా ఈ మనిషి..సగటు అమెరికన్ కన్నా వింతగా ఉన్నాడు అనుకుంటాడు.
ఈ మనిషిని, అతని చేష్టలు చూస్తూంటే ట్రాయ్‌కు బుర్ర తిరిగిపోతూంటుంది. అప్పుడు మరోషాక్ తగులుతుంది.ఆ రష్యా అతను మామూలోడు కాదు. అతనూ ఒక మాజీ KGB ఏజెంట్. అంటే రష్యా గూఢచారి. కానీ అమెరికా గురించి కలలు కనే మనిషి. అతడి మాటలు వింటే శత్రువులా అనిపించడు. గతం గురించి తెలిస్తే మాత్రం దగ్గరగా వెళ్లాలంటేనే భయం వేస్తుంది.
నిక్ మాత్రం ట్రాయ్‌ను చాలా ప్రశాంతంగా ఉండమని చెబుతాడు. బయటకు వెళ్తే ప్రమాదమని, ఇక్కడే ఉంటే సురక్షితమని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కోల్డ్ వార్ ముగిసే వరకు కూడా ఇక్కడే ఉండొచ్చన్నంత తేలికగా మాట్లాడతాడు. కానీ ట్రాయ్ మాత్రం అంత తేలిగ్గా నమ్మే మనిషి కాదు. తనను రక్షించేందుకు వచ్చాడా, లేక బంధించేందుకు వచ్చాడా అన్న అనుమానంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు.
కానీ బయట అడుగుపెట్టిన తర్వాతే అసలు పరిస్థితి అతడికి అర్థమవుతుంది. తాను నిక్ ఇంట్లో బందీగా లేడని, నిజానికి అతడు కాపాడుతున్న ప్రపంచంలో ఉన్నానని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు. సహాయం కోసం వెళ్లిన చోటే ట్రాయ్‌పై దాడి జరుగుతుంది. అప్పుడే మళ్లీ నిక్ ప్రత్యక్షమవుతాడు.
ఇప్పటివరకు అమెరికన్ సినిమాలు, మెక్‌డొనాల్డ్స్ గురించి మాట్లాడిన ఆ ప్రశాంతమైన గడ్డం మనిషి ఒక్కసారిగా మారిపోతాడు. దాడి చేసిన వారితో అతడు ఫైట్ చేసే తీరు చూసి ట్రాయ్ కూడా ఆశ్చర్యపోతాడు. వయసు మీద పడినట్టుగా కనిపించినా, నిక్ తగ్గేదేలే అన్నట్లు యాక్షన్ లో విశ్వరూపం చూపెడుతూంటాడు.
అప్పుడే ట్రాయ్‌కు నిక్ గురించి పూర్తి నిజం తెలుస్తుంది. అతడు సాధారణ KGB ఉద్యోగి కాదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ కోసం అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించిన వ్యక్తి. ఇప్పుడు ఆ గతాన్ని వదిలేసి ప్రశాంతంగా జీవించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ట్రాయ్ అతడి ఇంట్లో పడటంతో ఆ ప్రశాంత జీవితం మొత్తం మళ్లీ తలకిందులవుతుంది.
ఇక ఇద్దరికీ ఒకటే దారి కనిపిస్తుంది. కలిసి పారిపోవడం. ట్రాయ్‌కు ఒకటే కోరిక. ఎలాగైనా అమెరికాకు చేరుకోవాలి. నిక్కు కూడా తన గతం నుంచి బయటపడాలి. కానీ వారిద్దరి వెంటపడుతున్నది సాధారణ పోలీసు వ్యవస్థ కాదు. నిక్ గతం గురించి తెలిసిన, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లే ఒక ప్రమాదకరమైన సోవియట్ ఏజెంట్ వారి వెంటే ఉంటాడు.
అలాగే అమెరికాలో ఉన్న తన టీమ్ తో మాట్లాడాలంటే ట్రాయ్ కు ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ పరికరం సంపాదించాలి. దాని కోసం ఈ ఇద్దరూ సోవియట్ యూనియన్ అంతా దాదాపు తలకిందులు చేస్తూ ప్రయాణం మొదలుపెడతారు.అప్పుడు ఏమౌతుంది. చివరకు వాళ్లు అమెరికా చేరారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
‘మే డే’ను కేవలం ఒక అమెరికన్ పైలట్ సోవియట్ రష్యాలో చిక్కుకుని అక్కడి నుంచి తప్పించుకునే కథగా చూస్తే ఇందులో స్పెషల్ గా ఏమీ కనిపించదు. ఆ లేయర్ లో కథ చాలా సింపుల్. కానీ రచయితలు అసలు ఇంట్రస్ట్ ని కథాంశంలో కాకుండా, ఆ కథలో కలిసే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విరుద్ధతలో వెతికారు.
ఒకడు అమెరికా కోసం పనిచేసే నేవీ పైలట్. మరొకడు సోవియట్ వ్యవస్థలో అత్యంత రహస్యమైన సంస్థ అయిన KGBలో పనిచేసిన వ్యక్తి. సహజంగా వీరిద్దరూ శత్రువులుగా ఉండాలి. కానీ కథలోని ట్విస్ట్ ఏమిటంటే అమెరికన్ హీరో ప్రాణాలను కాపాడేది ఆ మాజీ KGB ఏజెంటే కావడం. అంతేకాదు, అతను అమెరికా పిచ్చోడు కావడం. దీన్నే స్క్రిప్ట్ చాలా తెలివిగా ఉపయోగించుకుంటుంది.
ఇక్కడ ట్రాయ్‌కు బయటపడటానికి శత్రుదేశం వాడైనా నిక్ అవసరం. నిక్కు తను అనుకున్నది అమలు చేయడానికి ట్రాయ్ పరిస్థితి కొత్త సమస్యలను తెస్తుంది. ఈ అవసరాల సంబంధమే క్రమంగా నమ్మకంగా మారుతుంది.
ఇక్కడ రచయితలు చేసిన మరో మంచి పని ఏమిటంటే, కోల్డ్ వార్ నేపథ్యాన్ని రాజకీయ ఉపన్యాసాల కోసం ఉపయోగించకపోవడం. ఆ కాలాన్ని కథకు ఒక ప్రమాదకరమైన భౌగోళిక వాతావరణంగా మాత్రమే ఉపయోగించారు.
అలాగే ట్రాయ్, నిక్‌ల మధ్య ఉన్న సంబంధాన్ని మరింత డెప్త్ గా డవలప్ చేయచ్చు. ముఖ్యంగా ఒకరి ప్రపంచం గురించి మరొకరు తెలుసుకునే సందర్భాలు పెరిగి ఉంటే, చివరికి వారి మధ్య ఏర్పడే స్నేహం మరింత ఇంపాక్ట్ గా ఉండేది. కానీ సినిమా ఆగకుండా ముందుకు పరుగెత్తాలనే ఉద్దేశంతో యాక్షన్ సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
స్క్రీన్ ప్లే పరంగా చూస్తే … ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. కథ ఏ జానర్లో నిలబడాలనుకుంటుందో కొన్ని సందర్భాల్లో క్లారిటి లేకుండా పోయింది. సర్వైవల్ కథ, కోల్డ్ వార్ స్పై థ్రిల్లర్, బడ్డీ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ ఇవన్నీ ఒకే సినిమాలో ఉన్నాయి. దేనికి దానికి ఇంట్రస్టింగ్ గానే ఉన్నా, వాటన్నింటినీ ఒకే ఎమోషన్ గా బిల్డ్ చేయటంలో స్క్రీన్‌ప్లే తడబడింది.
ఫైనల్ థాట్:
‘మే డే’లో పెద్దగా చెప్పుకోదగ్గ ఆశ్చర్యపరిచే కథా మలుపులు లేకపోవచ్చు. కానీ పాతకాలపు బడ్డీ యాక్షన్ కామెడీలను ఇష్టపడేవారికి, యాక్షన్‌తో పాటు ఇద్దరు భిన్నమైన వ్యక్తుల మధ్య సాగే సరదా ప్రయాణాన్ని చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంటర్టైనింగ్ రైడ్. కథ కంటే పాత్రల జోడీ గుర్తుండిపోయే సినిమా ఇది.
ఎక్కడ చూడచ్చు?
లెంగ్త్ : 1 గంట 50 నిమిషాలు
Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది.








