కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చాం : నారా లోకేష్
ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి
పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. మూడు ‘పీ’లను అందరూ పాటించాలి
కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్
కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దాం
టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు రేపటితో మూడేళ్లు
‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి పిలుపు
అమరావతి: కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని, ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్ షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ.. మనందరం నాయకులుగా ఇక్కడ కూర్చొన్నామంటే అందుకు కారణం కార్యకర్తల త్యాగం. ఒక తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, మంజుల వంటి కార్యకర్తలపై ఆనాడు దాడులకు పాల్పడ్డారు. కొంతమందిని హతమార్చారు. వారి పోరాటం వల్లే మనం అధికారంలోకి వచ్చాం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రొటీన్ కాంక్లేవ్ కాదు. నాయకులకు శిక్షణ ఇచ్చేందుకే ఈ కాంక్లేవ్ పెట్టాం. కార్యకర్తలకు, ప్రజలకు ఎలా దగ్గర కావాలి, పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే అంశాలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకోసారి కాంక్లేవ్ నిర్వహిస్తాం.
ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి
2019లో మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆనాడు అనేక మంది విమర్శించారు. 2024 ఎన్నికల్లో 91వేల మెజార్టీతో గెలుపొందాను. నాయకులకు వారి బలహీనతలేంటో చెప్పగలగాలి. నాయకులు పుట్టరు, నాయకులు తయారవుతారు. నేను నాయకుడిగా ఎదిగానంటే ఆ క్రెడిట్ చంద్రబాబు గారిది కాదు.. సైకోది. రాష్ట్రస్థాయిలో మిమ్మల్ని నాయకులుగా గుర్తించే ఈ సమావేశానికి ఆహ్వానించాం. మన బలహీనతల్ని గుర్తించి, అధిగమించడానికే ఈ కాంక్లేవ్. ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే మన బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి. ఇందుకు ఎంతో మంది నాయకులు మనకు మోడల్స్ గా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటి నాయకులు మనకు మోడల్స్ గా ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. వారి నుంచి మనం నేర్చుకోవాలి. దేశంలో కూడా మనకు మోడల్స్ ఉన్నారు. సీఆర్ పాటిల్ మనకు ఆదర్శం.
పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. మూడు ‘పీ’లను సీరియస్ గా తీసుకోవాలి
మూడు ‘పీ’లను నేను ప్రతిపాదిస్తున్నాను. వీటిని అందరూ పాటించాలి. పార్టీ, పర్సనల్, ప్రభుత్వం. వీటిని సీరియస్ గా తీసుకోవాలి. పర్సనల్ గా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. బాధ్యతగా ఉండాలి. నాయకులుగా మనం ముందు వినగలగాలి. దీనిని నేను ప్రధాని మోదీ గారి నుంచి నేర్చుకున్నాను. ఒక ప్రధానిగా ఉండి ఆయన నా నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మీరు కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని మనల్ని మనం మార్చుకోవాలి. మానవత్వం, అణకువతో ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రజలు సింప్లిసిటీ కోరుకుంటున్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు అందరినీ కలవాలి. మనమే వంద మందిని వెంటేసుకుని వెళ్లకూడదు. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. ప్రజలు మన ఇళ్లలో జరిగే విషయాలను కూడా గమనిస్తారు. నీతులు మనం చెప్పడమే కాదు.. పాటించాలి.
కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి
రెండో పీ.. పార్టీ. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన సైన్యం సరిగా ఉంటేనే యుద్ధంలో గెలుస్తాం. పార్టీకి దూరంగా ఉన్నవారిని, అలకబూనిన వారిని గుర్తించి దగ్గరికి తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన వారిని గుర్తించాలి. కార్యకర్తలకు చేయగలిగే పనులు చేయాలి. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య అయినా సీరియస్ గా తీసుకోవాలి. గూగుల్ కోసం తెలంగాణ, మహారాష్ట్రలు పోటీపడుతున్నాయి. అదే గూగుల్ మన వైజాగ్ కు వస్తే దుష్ప్రచారం చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలి.
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్
డీఎస్సీ విషయంలో మనం ఏ తప్పూ చేయలేదు. జగన్ ఏనాడు బాబాయి హత్య, ఏపీపీఎస్సీ, దస్తగిరి, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడలేదు. డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. మనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే డీఎస్సీపై అందరం మాట్లాడుతున్నాం. 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఇచ్చింది సున్నా. ఐదేళ్లలో మనం 30వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. డీఎస్సీ విషయంలో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. వైసీపీ అబద్దాలు చెప్పినంత ఈజీగా మనం నిజాలు చెప్పలేకపోతున్నాం. వాస్తవాలు ప్రజలకు వివరించాలి. వైసీపీ దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి. కాకినాడలో పోలీస్ రిక్రూట్ మెంట్ గురించి ఆందోళన జరిగింది. వైసీపీ హయాంలో ఇచ్చింది సున్నా. మనం 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఈ ఏడాది 3వేలు భర్తీ చేస్తున్నాం. ఈ ఐదేళ్లలో 10వేల పోస్టులు భర్తీ చేస్తాం. అయినా మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలి. 2024 టీమ్ అద్భుతంగా పనిచేసిందని చంద్రబాబు గారు మెచ్చుకునే విధంగా మన పనితీరు ఉండాలి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోవాలి. నెలకోసారి జిల్లా ప్రజాప్రతినిధులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే కలిసికట్టుగా చేయాలి. మన మధ్య ఐక్యత అవసరం. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి.
ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా ముఖ్యం
మూడో పీ.. ప్రభుత్వం. నేతలు పోస్ట్ ఆఫీస్ లా మారకూడదు. లీడర్ లా వ్యవహరించాలి. నేతలు తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలకు వెళ్లి తనిఖీ చేయాలి. చేసిన పనులు చెప్పుకోవాలి. డీఆర్సీ సమావేశాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలి. ఈ మూడు ‘పీ’లను అందరూ పాటించాలి. హ్యూమన్ కనెక్షన్, ఎమోషన్ అనేది చాలా కీలకం. ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పరచుకోవాలి. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా అవసరం. మళ్లీ గెలవాలంటే మూడు ‘పీ’లను పాటించాలి.
ఇది తెలుగుదేశం పార్టీ 3.o వెర్షన్
ఇది తెలుగుదేశం పార్టీ 3.o వెర్షన్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరం కలిసి చర్చిద్దాం. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తూచా తప్పకుండా పాటించాలి. నేను ఏనాడూ లక్ష్మణరేఖ దాటలేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ లైన్ కు అందరూ కట్టుబడి ఉండాలి. ఈగోలు, అహంకారం వద్దు, సింప్లిసిటీ పాటించాలి. నో ఈగో, ఓన్లీ సర్వీస్. ప్రజలకు సేవ చేద్దాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే అన్న ఎన్టీఆర్ నినాదం నేటికీ వర్తిస్తుంది.
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు రేపటితో మూడేళ్లు
పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారిని అరెస్ట్ చేసి రేపటితో మూడేళ్లు. చంద్రబాబు గారిని అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో కోర్టుకు తీసుకెళ్లారు. 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారు. చంద్రబాబు గారికి కోర్టు, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. రేపు ‘నిజం గెలిచింది’ పేరుతో పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్ లెవల్ లో 53 దీపాలు వెలిగిద్దాం. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను బ్లాక్ డే గా పాటిద్దాం. చంద్రబాబు గారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే క్లీన్ చిట్ వచ్చింది. హిట్ అండ్ రన్ చేసి చిన్నోడు, సొంత బాబాయిని లేపేస్తే పిల్లోడని జగన్ అన్నారు. సొంత పీఏ పట్టుబడితే ఎదురుదాడి చేస్తున్నారు. ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. నేను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యానంటే అందుకు కారణం మీ అందరి సహకారం వల్లే. కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దామని ఈ సందర్భంగా నేతలకు మంత్రి పిలుపునిచ్చారు.








