జీవితం నాశనం చేసుకోవద్దు: హోంమంత్రి అనిత..!
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన మరియు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొందరి రాజకీయ ప్రలోభాలకు లోనై అనవసర ఆందోళనలకు దిగవద్దని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సూచించారు. అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం వల్ల వారి సువర్ణ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని పోలీస్ ఉద్యోగాలు వచ్చాయో, నియామక ప్రక్రియలు ఎంత పారదర్శకంగా జరిగాయో ఒక్కసారి అభ్యర్థులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె కోరారు.
నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి తెలిపారు. ఏటా పక్కాగా విడుదల చేసే ‘జాబ్ క్యాలెండర్’ ద్వారా క్రమం తప్పకుండా పోలీస్ పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నియామకాలను పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, దీనికోసం నిరంతరం కసరత్తులు జరుగుతున్నాయని హోంమంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా పోలీస్ అభ్యర్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడానికి కానిస్టేబుళ్ల స్టైఫండ్ పెంపే నిదర్శనమన్నారు. గతంలో ట్రైనింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్లకు ఇచ్చే నెలవారీ స్టైఫండ్‌ను ఏకంగా రూ.12,500కు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె గర్వంగా గుర్తుచేశారు. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించి వారికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని నమ్మి, ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా కేవలం తమ కెరీర్ మరియు ఉద్యోగ సాధనపైనే దృష్టి పెట్టాలని వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.








