ఓరుగల్లు వేదికగా కవిత పార్టీ తొలి ఫైట్!
తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తెరలేపిన కల్వకుంట్ల కవిత, తన కొత్త రాజకీయ వేదిక తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) తొలి సమరానికి చారిత్రక నగరం వరంగల్‌ను ఎంచుకున్నారు. ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఓరుగల్లు గడ్డ నుంచే తన పార్టీ ఎన్నికల ప్రస్థానం మొదలుకానుందని హనుమకొండ వేదికగా కవిత ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలోనూ తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు. సరికొత్త పేరు, పాత సెంటిమెంట్ల కలబోతతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కవితకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ మనుగడను, భవిష్యత్ రాజకీయ బలాన్ని నిర్ణయించే కీలక అగ్నిపరీక్షగా మారనున్నాయి.
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని అస్త్రంగా చేసుకుని కవిత రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.13వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమె నిరసన బాట పట్టారు. హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన కవిత, అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.
రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన ఏ పార్టీకైనా క్షేత్రస్థాయి క్యాడర్ బలం, ఓటు బ్యాంక్ నిర్మాణమే అతిపెద్ద సవాలు. కవిత తెలంగాణ రక్షణ సేనను ప్రకటించిన నాటినుంచీ ఆమె రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలనే నిర్ణయం ఆ పార్టీకి ఒక కత్తిమీద సాము వంటిది.
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే పటిష్టమైన క్యాడర్‌తో ఉన్నాయి. అలాంటి త్రిముఖ పోటీ వాతావరణంలో టీఆర్ఎస్ తనకంటూ సొంత ఓటు శాతాన్ని రాబట్టుకోగలదా లేదా అన్నది ఈ ఎన్నికల్లోనే తేలిపోనుంది. అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకోవడమే కవిత వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, బలమైన అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకోవడంలో పార్టీ ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది కీలకం. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించి, ప్రజా సమస్యల ద్వారా పాలకులపై పోరాడటం ద్వారా తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కవిత ఆశిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో తాము నామమాత్రపు పాత్రధారులం కాదని, ప్రత్యర్థులకు గట్టి సవాలు విసరగల పూర్తిస్థాయి ప్రత్యామ్నాయ శక్తినని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కవితపై ఉంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కవిత కొత్త ప్రస్థానానికి నైతిక స్థైర్యాన్ని ఇస్తాయా, లేక ఎదురీతను తప్పించవా అనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికల వేదికపై తెలంగాణ రక్షణ సేన ప్రదర్శించే ప్రభావమే ఆ పార్టీ భవిష్యత్ రాజకీయ మనుగడను దిశానిర్దేశం చేయనుంది.








