ఆకట్టుకొని పాత ఫార్మాట్ ‘రంభ ఊర్వశి మేనక’లు
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
నటీనటులు: అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్,
నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్
సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: చోటా కె. ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
దర్శకత్వం: చంద్ర మోహన్ చింతడ
విడుదల తేది :04.09.2026
నిడివి : 2 ఘంటల 24 నిముషాలు
ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందించే అల్లరి నరేష్ (Allari Naresh)కామెడీ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే కామెడీ సినిమాలు ఆడకపోవడంతో యాక్షన్ థ్రిల్లర్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. వాటిలో మూడు నాలుగు సినిమాలు సక్సెస్ అయినా, ఇటీవల అవి కూడా ఆడటం లేదు. దీంతో మళ్లీ తన కామెడీ జోనర్లోకి వచ్చాడు. ఇప్పుడు `రంభ ఊర్వశి మేనక`(Rambha Oorvasi Menaka) అనే సొషియో ఫ్యాంటసి చిత్రంలో నటించాడు. సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్ చింతాడ(Chandra Mohan Chinthada) దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్,(Hasya Movies) అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 4న) విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది? కామెడీ హీరో గా మరో సారి అల్లరి నరేష్‌కి హిట్ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
సూరి(అల్లరి నరేష్)కి చిన్నప్పట్నుంచి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అది వాళ్ల నాన్న కోరిక. ఆయన హీరో కాలేక రంభ ఊర్వశి మేనకు డ్రామా కంపెనీ పెట్టి నాటకాలు వేస్తుంటాడు. దీంతో తాను ఎలాగైనా హీరో అవ్వాలనుకుంటాడు సూరి. అయితే వాళ్ల ఇంట్లో వంశపారపర్యం ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దాంట్లో సరైన ముగ్గు వేస్తే రంభ ఊర్వశి మేనకు దిగి వస్తారని, వాళ్లు కోరిన కోరికలు తీరుస్తారని ఇంద్రలోకం నుంచి దిగి వస్తారని బాబాయ్ సీఈవో రమణ (సీనియర్ నరేష్) చెప్పిన మాటలను నమ్ముతాడు సూరి. దీంతో సూరి దాన్ని నమ్ముకొని 25ఏళ్లుగా ముగ్గులు వేస్తుంటాడు. కానీ అది ఓపెన్ కాదు. దాని పేరు చెప్పి ఊర్లో అప్పులు చేస్తాడు. అప్పుల వాళ్లు రోజూ ఇంటిమీదికొస్తుంటారు. వారికి ఏదో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తుంటారు. ఇంతలో వాళ్ల ఊరిలోకి తన చిన్నప్పటి లవర్ చిన్ని(సురభి) వస్తుంది. ఆమె అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తుంటుంది. కానీ సూరి కోసమే వస్తుంది. అయితే వాళ్ల నాన్న(గోపరాజు రమణ)కి సూరి అప్పుల విషయం తెలిసి పెళ్లికి నో చెబుతాడు.
నెల రోజుల్లో అప్పులన్నీ తీరిస్తే అమ్మాయిని ఇస్తానని కండీషన్ పెడతాడు. నెల కాదు ఐదు రోజుల్లో తీరుస్తానని సవాల్ విసురుతాడు సూరి. మళ్లీ రంభ ఊర్వశి మేనక విగ్రహాల వద్దకు వెళ్లి చివరి ప్రయత్నంగా మ్యాజిక్ బుక్‌పై ముగ్గువేయగా అది వర్కౌట్ అవుతుంది. నిజంగానే రంభ(రాశిసింగ్), ఊర్వశి(విష్ణు ప్రియా), మేనక(ప్రిషా సింగ్) వస్తారు. కానీ ఆ కంగారులో తన కోరికలు కోరలేకపోతాడు సూరి. రేపు రమ్మని చెప్పగా, వాళ్లు రేపు వస్తారు, కానీ ఈ విషయం ఇంద్రుడికి తెలిసి దేవకన్యలకు పవర్స్ ఉండే చేతి కడియాలు లేకుండా పంపిస్తాడు. దీంతో వాళ్లు సూరి కోరికలు తీర్చలేకపోతారు. తమకి పవర్స్ రావాలంటే చైత్ర పౌర్ణమి వరకు ఆగాల్సి వస్తుంది అని చెపుతారు. మరోవైపు సూరి అమ్మ అరుదైన జబ్బుతో ఆసుపత్రి పాలవుతుంది. ఆమెని బతకాలంటే 60లక్షలు ఖర్చు అవుతుంది. దేవకన్యలు కోరికలు తీర్చలేరు, మరోవైపు అమ్మ ఆసుపత్రిలో ఉంటుంది. ఇంకోవైపు అప్పుల వాళ్ల బాధలు ఎక్కువవుతాయి. మరి సూరి ఏం చేశాడు? సూరి అమ్మ బతికిందా? సూరి కోరికలు తీరాయా? ఇంద్రుడుతో సూరికి గొడవేంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల హవబవాలు :
బాధ్యతలు లేకుండా బలాదూర్‌గా తిరిగే యువకుడిగా జోవియల్ యాక్టింగ్‌తో అల్లరి నరేష్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు వన్ మెన్ ఆర్మీలా నిలిచాడు. అల్లరి నరేష్ ప్రియురాలిగా సురభి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. రంభగా రాశీసింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషాసింగ్ తమ గ్లామర్‌తో మెప్పించారు. సీఈఓగా సీనియర్ నరేష్‌తో పాటు ఇంద్రుడిగా వెన్నెలకిషోర్ కామెడీనే ఈ సినిమాకు బిగ్గెస్ట్ రిలీఫ్‌గా నిలిచింది. వారు కనిపించే ప్రతి సీన్ సినిమాను కాపాడింది. శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, గోపరాజు రమణ పంచ్‌లు కొన్ని వర్కవుట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప విలనిజం సెట్టవ్వలేదు. పూర్తిగా కమెడియన్లా కాకుండా, విలన్ అనే ఫీల్ కలగకుండా క్యారెక్టర్‌ను కన్ఫ్యూజింగ్గా వుంటుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. యూత్‌కు సంబంధించిన ఓ మెసేజ్‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు చంద్రమోహన్ చింతాడ ఈ కథను రాసుకున్నారు. సూపర్ హిట్ సినిమాల స్ఫూఫ్‌లు, స్టార్ డైరెక్టర్లపై పంచ్‌లతో ఈ సినిమాను నింపేశారు. యస్వీ కృష్ణారెడ్డి యమలీల ఛాయలు ఈ సినిమాలో ఎన్నో కనిపిస్తాయి. ఇక సంగీత దర్శకుడు పనితనం బాగనే ఉంది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ప్లెజెంట్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. పల్లెటూరి అందాలను కెమెరామెన్ రాంరెడ్డి హైలైట్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. నిర్మాతలు రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇది చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. దేవకన్యలు ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ వచ్చిన ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కొంత ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ అదే రొటీన్‌గా మారుతుంది. సెకండాఫ్ సైతం అదే నాయిస్‌తో, పేలవమైన కామెడీ సీన్లతో రన్ అవుతుంది. దేవతలను పట్టుకొంటే చనిపోవడమనేది కొత్తగా ఉంది. కానీ అందులోనూ ఫన్ పండలేదు. ఓవరాల్‌గా క్లైమాక్స్ ఉన్నంతలో బెటర్‌గా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్ రొడ్డకొట్టుడు, శవాలను దాచే సన్నివేశాలు కూడా ఓవర్‌గా ఉంటాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, బోరింగ్ అండ్ సిల్లీ ప్లేతో సినిమా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కొన్నిచోట్ల మాత్రమే ఫన్ బాగుంది. ఓల్డ్ ఫార్మాట్లో సాగే కామెడీ మూవీగా ఈ ‘రంభ ఊర్వశి మేనక’ ఏ మాత్రం ఆకట్టుకో లేకపోయారు.








