AI తో జంతువులతో మాట్లాడచ్చా? త్వరలో డాక్టర్ డూలిటిల్లా మారబోతున్నామా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని ఊహించటానికే వింతగా ఉంటాయి. అలాంటి ఊహలు మనం తెరపై చూస్తూంటాం. పుస్తకాల్లో చదువుతూంటాం. కానీ నిజ జీవితంలోకి వస్తాయని పొరపాటున కూడా అనుకోం. కానీ టెక్నాలిజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏదీ వింతా కాదు..ఏదీ ఇంక జరగబోదు అనుకోవటానికి లేదు. ఫర్ సపోజ్…మనింట్లో ఓ కుక్క ఉందనుకోండి. అది మన వైపు చూసి అరుస్తుంది. మనం ఏమనుకుంటాం. అరే దీనికి ఆకలేస్తోందేమో అని. లేదా ..ఏ చిచ్చుకో బయిటకు తీసుకువెళ్లమంటోందో అని. కానీ అసలు దాని మనస్సులో ఏముందో..అది ఏమంటోందో మనకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మనకు బౌబౌల భాష రాదు కాబట్టి. కానీ ఇప్పుడు AI తో అది సాధ్యం అయ్యేలా ఉంది.
నిజం..అదే భవిష్యత్తులో జరగబోతోంది. ఎందుకంటే AI తో పనిచేసే యానిమల్ యాప్ లు రాబోతున్నాయి. అప్పుడు మనం యాప్ ఓపెన్ చేసి… కుక్క అరుపు దానికి వినిపించగానే..అది మన అచ్చ తెలుగులోకి ట్రాన్సలేట్ చేసేసి..ఒరేయ్ బాబూ..నాకు ఆకలేయటం లేదు…బోర్ కొడుతోంది. కాస్త నన్ను పట్టింకోండిరా అని మొత్తుకుంటూ ఉండచ్చు. అది వినగానే మన రియాక్షన్ ఏమిటి…మొదట షాక్..తర్వాత నవ్వుకుంటాం. ఆ తర్వాత భయపడతాం. దీంతో ఎలా వేగగలంరా బాబూ అని. వింటానికే వైల్డ్ గా ఉంది కదా. అంటే ఓ రకంగా చెప్పాలంటే మన చిన్నప్పుడు ఎప్పుడో చూసి డాక్టర్ డూలిటిల్ లాగ మారిపోతాం అన్నమాట.
డాక్టర్ డూలిటర్ ఎవరని అంటారా..మీకు గుర్తు రాలేదా…ఆయన మాహా అద్బుతమైన ఓ ఊహల్లో పుట్టిన పాత్ర. జంతువులతో ఎడాపెడా, ఎడతెగకుండా మాట్లాడేస్తూంటాడు. ఎందుకంటే ఆయనకు అన్ని జంతువుల భాషా వచ్చు కాబట్టి. కుక్క ఏమంటోందో, పిల్లి ఏం పలవరిస్తోంది. కాకి ఏమని కారణాలు వెతుకుతోందో , ఎలుకలు ఏ కన్నాల్లో దూరుదామని ప్లాన్ చేస్తున్నాయో అన్ని అర్దం చేసుకుంటాడు.అఫ్ కోర్స్ ఆయన్ను… అవి చెప్పే పిట్ట కథలు, పిల్లి బాధలు, పక్షి కక్షల కథలు విసిగిస్తాయి అనుకోండి. ఆ పాత్రను మనం చూసినప్పుడు భలే ఉందే …మనకూ ఈ జంతువుల, పక్షుల భాషలు తెలిస్తే బాగుండును అనుకునే ఉంటారు కదా..గట్టిగా అనుకున్నట్లు ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఇలా యాప్ రూపంలో అవతరిస్తోంది.
అయితే ఎంతవరకూ ఈ యాప్ సక్సెస్ అవుతుంది
ఐడియాలు రావటం, వాటికి డబ్బు పెట్టే వాళ్లను వెతికి ఒప్పించటం వరకూ ఓకే …అయితే అవి ఎంతలా జనాల్లోకి వెళ్తాయి అనేదానిమీదే వాటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కానైతే ఈ యాప్ చాలా సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి మాటలు వినాలని ఎవరికి ఉండదు చెప్పండి.
కానీ ఇక్కడో సమస్య ఉంది. ఇప్పటిదాకా ఈ పక్షులు, జంతువుల లాంగ్వేజ్ ని ట్రాక్ చేసిన వాళ్లు, డీ కోడ్ చేసిన వాళ్లు లేరు. ఏదో కొందరు మాకు ఆ భాష అర్దం అవుతుందని అంటారు కానీ నిజమెంతో ఆ దేవుడుకే తెలియాలి. దాంతో ఏఐ నే దీనికి సమాధానం అని ఫిక్సైపోయారు సైంటిస్ట్ లు. Earth Species Project వంటి సంస్థలు జంతువుల కమ్యూనికేషన్‌ను అర్థం చేసుకునేందుకు AIని ఉపయోగిస్తున్నాయి.
దాంతో ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన పనిలో బిజీ అయ్యిపోయారు. వాళ్లు తెల్లారి లేచింది మొదలు జంతువులు చేసే శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు. కుక్కల అరుపులు. పక్షుల కూతలు. తిమింగలాల పాటలు. ఏనుగుల పిలుపులు ఇవన్నీ ఓపిగ్గా సేకరిస్తున్నారు. అందుకు చాలా ఓపిక కావాలి.ఇప్పటికే వేల గంటల ఆడియోలను సేకరించి… వాటిని AIకి ఇచ్చేసారు. ఇప్పుడు AI వాటిని ఓపిగ్గా వింటుంది. అందులో ఉన్న ప్యాటర్న్ ను వెతుకుతుంది.
అంటే ఒక ప్రత్యేకమైన శబ్దం వచ్చిన ప్రతిసారీ ఆ జంతువు ఏం చేస్తోంది? ఆ శబ్దం విన్న మిగతా జంతువులు ఎలా స్పందిస్తున్నాయి? ప్రమాదం వచ్చినప్పుడు ఎలా అరుస్తున్నాయి. ఆకలి వేసినప్పుడు ఎలా అరుస్తున్నాయి? తమ పిల్లలను పిలిచేటప్పుడు ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయి. ఇలాంటి విషయాలను AI రీసెర్చ్ చేస్తోంది.
ఇదంతా చూసేసి రేపటి నుంచి మీ కుక్కతో AI ద్వారా వాట్సాప్ చాట్ చేసేయచ్చని ముచ్చటపడిపోకండి. ఇది కనుక సక్సెస్ అయితే మనం జంతువులను ఇప్పటివరకు అర్థం చేసుకున్న దానికంటే ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం మాత్రం పెరుగుతోందని చెప్పచ్చు.
సరే..ఏఐ యానిమల్ ట్రాన్సలేషన్ యాప్ సక్సెస్ అయితే ఏం జరగచ్చు.?
అప్పుడు మన జీవితంలో అసలైన ఫన్ మొదలవుతుంది. మన ఇంట్లో ఉన్న కుక్క మెడలో ఓ చిన్న AI ట్రాన్స్‌లేటర్ ఉంటుది. మీరు సాయంత్రం ఇంటికి రాగానే ఆ కుక్క మీ వైపు సీరియస్ గా చూసి మొరుగుతుంది.
AI దాన్ని ఇలా ట్రాన్సలేట్ చేసి చెబుతుంది.
“స్వాగతం! ఈరోజు కూడా నన్ను ఉదయం నుంచి ఎనిమిది గంటలు ఒంటరిగా వదిలేసినందుకు ధన్యవాదాలు!” ..మీరు ఇంకేమి మాట్లాడగలరు. సరే అన్నట్లు తప్పు మీదే అన్నట్లు తలూపితే..అప్పుడు ఆ కుక్క.. “కాళ్లు గుదులు కట్టాయి..కాస్త ఇప్పటికైనా వాకింగ్‌కు తీసుకెళ్ళు?” అంతే మీకు వేరే ఆప్షన్ లేదు. దాని భాష అర్దం కానంత సేపు జీవితంలో ఏ సమస్యా లేదు. కానీ ఇప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. కొత్త ట్విస్ట్ లు వస్తాయి. ఎందుకంటే వాటి మాటలు విన్న తర్వాత చాలా సార్లు మనం వాటి బాధ్యత కూడా తీసుకోవాల్సి రావచ్చు.
అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. అసలు AI ట్రాన్సలేట్ చేసి మనకు ఇచ్చేది నిజంగా జంతువు మాటలేనా? అనేదే ఇప్పుడు ఈ యాప్ లతో మనం ఎదుర్కోబోయే పెద్ద సమస్య. ఎందుకంటే ఓ పక్షి …శబ్దాన్ని ఏఐ విని… “నాకు బాధగా ఉంది” అని ట్రాన్సలేట్ చేసిందనుకోండి..అని నిజమేనా…ఆ పక్షి నిజంగా బాధ పడుతోందా అనేది క్లారిటీ ఇచ్చేదెవరు.ఎందుకంటే దాని భాష తెలిసున్నవాళ్లు ఎవరూ లేరు. కాబట్టి ఈ మేటర్ తేలితే కానీ ఈ యాప్ లను నమ్మేది లేదు.
ఇక్కడ మరో సందేహం మేధావులైన జనాలను పీడిస్తోంది… జంతువులకూ ప్రైవసీ అక్కర్లేదా? అని వారు ఇప్పటికే కొన్ని కామెంట్స్ మొదలెట్టేసారు. అంటే అడవిలో రెండు ఏనుగులు మాట్లాడుకుంటున్నాయి అనుకోండి. మన AI డివైస్ ద్వారా వాటి మాటలన్నీ వినే హక్కు మనకు ఉందా?
ఏదైమైనా
ఏదో ఒకరోజు మీ కుక్క మీ వైపు చూసి… “ఏరా… నన్ను వాకింగ్‌కు తీసుకెళ్తానన్నావు కదా?” అని అడిగితే మాత్రం… మనమంతా నిజంగానే ఒక కొత్త… చాలా విచిత్రమైన… ఇంకా చాలా ఫన్నీ యుగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే!అప్పటిదాకా గప్ చుప్.








