అంతరిక్షంలో శృంగారం సాధ్యామా? పిల్లలు పుడతారా? కొన్ని షాకింగ్ నిజాలు
ఎలాన్ మస్క్ వంటి అంతరిక్ష వ్యాపారవేత్తలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనుషులను అంగారక గ్రహం (మార్స్)పై స్థిరపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా వింటానికి బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి కొన్ని కొత్త సమస్యలకు ఈ ప్రయాణం ఆహ్వానం పలుకుతుందేమో అనిపిస్తోంది. అవి ఎలాంటి సమస్యలు కావచ్చు. అనేది ఇప్పుడు శాస్త్రవేత్తులు చేస్తున్న ప్రయోగాలు, ఆలోచనలు.
ఒక్కసారి ఊహించండి.
అది 2050 సంవత్సరం. అప్పటికి మనుషులు మార్స్‌పై నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న కాలనీలు ఏర్పడ్డాయి. ఇళ్లు ఉన్నాయి.కావాల్సిన పంటలు పండిస్తున్నారు.
పిల్లలు స్కూల్‌కు కూడా వెళ్తున్నారు.
ఆగండి… పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారా?
అసలు మార్స్‌లో పిల్లలు పుడతారా?
ఇదిగో… మనం మార్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మర్చిపోయే ప్రశ్న ఇదే. రాకెట్ తయారు చేయడం గురించి మాట్లాడుతున్నాం. మార్స్‌కు ఎంతమందిని పంపాలి అనే ప్లాన్లు వేస్తున్నాం. అక్కడ ఇళ్లు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నాం. కానీ ఒక చిన్న విషయం మాత్రం ఇంకా క్లియర్ కాదు.
భూమి వెలుపల మనుషులు శృంగారం చేయగలరా? పిల్లలను కనగలరా?
వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది కదా! కానీ నిజానికి ఇదే మానవజాతి భవిష్యత్తులో అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి కావచ్చు. స్పేస్ హోటల్‌కు వెళ్తే… అక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు అంతరిక్ష ప్రయాణం అంటే కేవలం వ్యోమగాముల విషయం మాత్రమే కాదు. భవిష్యత్తులో సాధారణ ప్రజలు కూడా డబ్బు ఉంటే అంతరిక్షంలోకి వెళ్లే రోజులు రావచ్చు. కొన్ని కంపెనీలు ఇప్పటికే భూమి చుట్టూ తిరిగే స్పేస్ హోటళ్ల గురించి ప్లాన్ చేస్తున్నాయి. అంటే… మీరు ఒకరోజు హోటల్‌కు వెళ్లినట్టే స్పేస్ హోటల్‌కు వెళ్లే అవకాశం ఉండొచ్చు.
ఇక్కడే ఒక పరిశోధకురాలు సరదాగా ఒక ప్రశ్న వేసింది. “హోటళ్లకు వెళ్లినప్పుడు మనుషులు ఏం చేస్తారో మనందరికీ తెలుసు కదా!” అదే సంగతి గురించి అడిగింది. మనిషి ఎక్కడికి వెళ్లినా మనిషే కదా! అయితే స్పేస్‌లో శృంగారం అనేది మనం ఊహించినంత సింపుల్ కాదు.
అసలు అంతరిక్షంలో ఎవరైనా శృంగారం చేశారా?
ఇప్పటివరకు అంతరిక్షంలో మనుషులు శృంగారం చేసినట్లు అధికారికంగా ధృవీకరించబడిన ఒక్క ఘటన కూడా లేదు. అవును. ఇన్ని సంవత్సరాలుగా మనుషులు అంతరిక్షంలో తిరుగుతున్నారు. చంద్రుడి మీదకు వెళ్లారు. స్పేస్ స్టేషన్లో నెలల తరబడి ఉన్నారు. కానీ… జీరో గ్రావిటీలో శృంగారం ఎలా ఉంటుందో మనకు నిజంగా తెలియదు!సినిమాల్లో చూసింది వేరు. వాస్తవం వేరు.
అక్కడ అసలు మూడ్ వస్తుందా?
సరే… శృంగారం చేయటం ఎలా అనే విషయం తర్వాత చూద్దాం. ముందు అసలు ఆ పరిస్థితుల్లో మనిషికి లైంగికపరమైన ఆసక్తి ఉంటుందా? అనే ప్రశ్న ఉంది. కొన్ని పరిశోధనల్లో చంద్రుడు లేదా మార్స్‌లో ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించారు. అక్కడ కొంతమంది వాలంటీర్లను వారాల తరబడి ఉంచారు. బయటి ప్రపంచంతో సంబంధం తక్కువ. ప్రైవసీ లేదు. పరిమిత ఆహారం. కఠినమైన నియమాలు. అన్నీ టైమ్‌టేబుల్ ప్రకారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? చాలామందిలో లైంగిక ఆసక్తి బాగా తగ్గిపోయింది.
అంటే మీరు మార్స్‌లో ఉన్నారని ఆనందపడేలోపే… ఒత్తిడి మొత్తం మూడ్‌ను పాడు చేసే అవకాశం ఉంది! పరిశోధకులు దీనికి ఒక పేరు కూడా పెట్టారు. Mission-Imposed Abstinence సింపుల్‌గా చెప్పాలంటే…అక్కడుండే పరిస్థితుల వల్లే మనుషులు శృంగారం గురించి ఆలోచించడం మానేయడం.
సరే… ఆ ఇంట్రస్ట్ పుట్టింది అనుకుందాం. తర్వాత?
ఇక్కడే అసలు జీరో గ్రావిటీ కథ మొదలవుతుంది! భూమిపై ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉంటే గురుత్వాకర్షణ మనల్ని నేల మీద ఉంచుతుంది. కానీ అంతరిక్షంలో? మీరు తేలిపోతారు. నేను తేలిపోతాను. ఒకరినొకరు పట్టుకోవాలి. అంతే కాదు…న్యూటన్ మూడో నియమం కూడా అక్కడ తన పని చేస్తుంది! మీరు ఒకరిని నెడితే… ఇద్దరూ వ్యతిరేక దిశల్లో వెళ్లిపోవచ్చు!
అంటే భూమిపై చాలా సహజంగా జరిగే పని…అంతరిక్షంలో ఫిజిక్స్ ప్రయోగంలా మారిపోతుంది. అయినా మనుషుల గురించి ఒక విషయం మర్చిపోకూడదు. త కష్టమైన పరిస్థితి వచ్చినా… దానికి ఒక జుగాడ్ కనిపెడతారు!
కొంతమంది ఇప్పటికే ప్రత్యేకమైన దుస్తులు, ఇద్దరినీ ఒకచోట ఉంచే ఏర్పాట్లు వంటి ఆలోచనలు కూడా చేశారు. మనిషి సృజనాత్మకతకు హద్దులు లేవు కదా! అయితే అసలు సమస్య శృంగారం కాదు!
ఇక్కడివరకు చదివితే ఇదంతా కాస్త సరదాగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు అసలు సీరియస్ విషయం వస్తుంది. ఎందుకంటే శృంగారం జరిగితేనే పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఇప్పుడు ఊహించండి.
ఒక మహిళ అంతరిక్షంలో గర్భం దాల్చింది. తర్వాత ఏం జరుగుతుంది? పిండం సాధారణంగా ఎదుగుతుందా? గర్భం తొమ్మిది నెలలు సురక్షితంగా ఉంటుందా? ప్రసవం ఎలా జరుగుతుంది? పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా? ఇవన్నీ ఆలోచించటానికి ఇక్కడే శాస్త్రవేత్తలు చేతులెత్తేస్తున్నారు.
ఎందుకంటే…
ఈ ప్రశ్నలకు ఇంకా పూర్తి సమాధానాలు లేవు. 370 కోట్ల ఏళ్లుగా మనం ఒకే విషయానికి అలవాటు పడ్డాం! అది… గురుత్వాకర్షణ. భూమిపై జీవం అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాలుగా జీవులు గురుత్వాకర్షణ మధ్యే ఎదిగాయి. మన శరీరం మొత్తం దానికి అలవాటు పడిపోయింది. మన ఎముకలు. మన కండరాలు. మన గుండె. మన రక్త ప్రసరణ. గర్భంలో బిడ్డ ఎదిగే విధానం కూడా. అన్నీ భూమి గురుత్వాకర్షణను దృష్టిలో పెట్టుకుని పరిణామం చెందాయి.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ఆ గురుత్వాకర్షణను ఒక్కసారిగా తీసేస్తే?
ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియదు. జీరో గ్రావిటీలో గర్భ పరీక్ష ఎలా చేస్తారు? ఇది కూడా ఇప్పుడు పరిశోధనలో ఉన్న విషయం. భూమిపై డాక్టర్ అల్ట్రాసౌండ్ చేస్తే చాలా సింపుల్. రోగి బెడ్‌పై పడుకుంటారు. డాక్టర్ పరీక్ష చేస్తారు. అంతే. కానీ స్పేస్‌లో? రోగి తేలిపోతున్నారు. డాక్టర్ కూడా తేలిపోతున్నారు. అల్ట్రాసౌండ్ యంత్రం కూడా కదులుతోంది! ఇలాంటి పరిస్థితిలో పరీక్ష ఎలా చేయాలి?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక విమానాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ విమానం కొంతసేపు ఫ్రీ ఫాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని సెకన్ల పాటు జీరో గ్రావిటీ ఏర్పడుతుంది. ఆ సమయంలో మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు.
వినడానికి చిన్న ప్రయోగంలా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఒక మహిళా వ్యోమగామి అంతరిక్షంలో అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కొంటే? ఇలాంటి ప్రయోగాలే ఆమెకు ఉపయోగపడతాయి.
పిల్లలను సహజంగా పుడతారా?
జరగక లేకపోవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు మరో మార్గం గురించి ఆలోచిస్తున్నారు. IVF. అంటే ప్రయోగశాల సాంకేతికత ద్వారా పిండాన్ని అభివృద్ధి చేయడం. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక సంస్థ ఇప్పుడు జీరో గ్రావిటీలో పనిచేసే చిన్న IVF యంత్రాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది.
వాళ్లు ఇప్పటికే ఒక చిన్న “స్పేస్ ఇంక్యుబేటర్”ను అంతరిక్షంలో పరీక్షించారు. మొదట ఈస్ట్ కణాలను పంపారు. అవి బాగానే బతికాయి. ఇప్పుడు తదుపరి ప్రయోగం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎలుకల పిండాలను అంతరిక్షంలోకి పంపడం. ఇది విజయవంతమైతే… ఒకరోజు మానవ పిండాలపై పరిశోధన చేసే దశ కూడా రావచ్చు.
స్పేస్‌లో పుట్టిన బిడ్డ… మనలాంటి బిడ్డేనా?
ఇదే అసలు పెద్ద ప్రశ్న.
అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని మనకు ఇప్పటికే తెలుసు. ఎముకలు బలహీనపడతాయి. కండరాలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మారుతుంది. రోగనిరోధక వ్యవస్థలో మార్పులు రావచ్చు. కళ్లపై ప్రభావం పడొచ్చు. ఒక పెద్ద మనిషి శరీరానికే ఇన్ని మార్పులు వస్తే… ఇంకా పూర్తిగా ఎదగని ఒక చిన్న పిండం పరిస్థితి ఏంటి? అన్నీ నార్మల్‌గా ఉంటాయా? లేక… మార్స్ లో పుట్టే మనిషి క్రమంగా భూమి మనిషికి భిన్నంగా మారుతాడా?ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా ఎవరికీ తెలియదు.
మార్స్‌లో పుట్టిన పిల్లలు భూమికి రాగలడా?
ఇది వింటే కాస్త భయంగా ఉంటుంది. కానీ ఆలోచించండి. మార్స్‌లో పుట్టిన ఒక బిడ్డ తన జీవితమంతా అక్కడే పెరిగాడు. అతడి శరీరం అక్కడి పరిస్థితులకు అలవాటు పడింది. తక్కువ గురుత్వాకర్షణ. పరిమిత సూక్ష్మజీవులు. వేరే వాతావరణం. అంటే భూమి వాతావరణాన్ని అతడి శరీరం తట్టుకోగలదా? అనేది ప్రశ్న. అంటే ఒకరోజు…మార్స్‌లో పుట్టిన మనిషి భూమికి రావడం కూడా ప్రమాదకరంగా మారవచ్చు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








