చంద్రబాబు “అబద్ధాల పురుషోత్తముడు”..!
దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ కష్టాన్ని కాజేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఉత్తమరత్న అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) ఆరోపించారు. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి అని మండిపడ్డారు. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జీవం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లిందని ఆమె ఆరోపించారు. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉందని ఎద్దేవా చేసారు.
బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ వైఎస్ఆర్ అని షర్మిల స్పష్టం చేసారు. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి కృషి అనీర్వచనీయం అని.. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ వైఎస్ హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. అది మహానేత కష్టమని కొనియాడుతారని షర్మిల పేర్కొన్నారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ ది అని షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య అని విమర్శించారు. ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలమని తెలిపారు. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు వైఎస్ సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం అని గుర్తు చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు.








