కొండా సురేఖపై వేటు.. ముగ్గురు మహిళా నేతలకు కీలక పదవులు!
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడను ప్రదర్శించారు. పార్టీలో అసమ్మతి, వివాదాలకు తావివ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే, రాజకీయంగా ఎదురయ్యే విమర్శలకు ముందే చెక్ పెట్టేలా ఆయన అడుగులు వేశారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తక్షణమే తప్పిస్తూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను మంత్రి మండలి నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు అధికారికంగా సిఫారసు లేఖను కూడా పంపించారు. అదే సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సీనియర్ నేత డాక్టర్ జి.చిన్నారెడ్డి నియామకాన్ని కూడా తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా బీసీ వర్గానికి చెందిన ఒక సీనియర్ మహిళా మంత్రిపై వేటు వేసినప్పుడు ప్రతిపక్షాల నుంచి రాజకీయ విమర్శలు, సామాజిక సమీకరణాల దాడి ఎదురవడం సహజం. కొండా సురేఖను తప్పించడం ద్వారా బీసీ మహిళా కార్డును ప్రత్యర్థులు అస్త్రంగా మలుచుకునే ప్రమాదం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత చాకచక్యంగా డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్‌ను అమలు చేశారు. ఒక బీసీ మహిళను కేబినెట్ నుంచి తప్పించిన వెంటనే, ఏకంగా ముగ్గురు మహిళా నేతలకు అత్యంత కీలకమైన పదవులను కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తాము బీసీలకు, మహిళా ప్రాతినిధ్యానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, పైగా మహిళా నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పలు కీలక నియామకాలు చేపట్టారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. చిన్నారెడ్డి వంటి సీనియర్‌ను పక్కన పెట్టి, పాలనాపరంగా అత్యంత కీలకమైన ప్లానింగ్ బోర్డు బాధ్యతలను గద్వాల విజయలక్ష్మికి అప్పగించడం ద్వారా ప్రభుత్వ విధాన రూపకల్పనలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు.
ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మహిళల హక్కులు, భద్రత, సాధికారతకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన ఈ ప్రధాన కమిషన్‌కు శారదను ఎంపిక చేయడం మహిళా వర్గాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమించారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో సురేఖ వర్గానికి ప్రత్యామ్నాయంగా, ఉమ్మడి వరంగల్ పరిధిలోని కీలకమైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సుధారాణిని అధిపతిగా నియమించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. తద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ తొలగింపు వల్ల ఏర్పడే సామాజిక శూన్యతను కూడా సమర్థవంతంగా భర్తీ చేసే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో చెబుతూనే, సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా బ్యాలెన్స్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన చాతుర్యాన్ని కనబరిచారు. ఒక వైపు సీనియర్ నాయకులను పక్కన పెడుతూనే, మరోవైపు ముగ్గురు మహిళా నాయకురాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా విమర్శల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ తాజా నియామకాలు, నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి.








