వేటలో అమెరికాదే పైచేయి.. భారత్‌కు మిగులుతుందా? —ఇది వెనిజులా ఆయిల్ హంట్ కథ
—-సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు మనిషి అడవిలోకి వెళ్లేవాడు.
చేతిలో ఆయుధం ఉండేది. కళ్ల ముందు ఒకే లక్ష్యం ఉండేది. ఆకలి. ఎవరు ముందు వేటాడితే వారికి ఆహారం. ఎవరు బలంగా పోరాడితే వారికే పెద్ద ముక్క. వేట దొరికితే కుటుంబం బతికేది. దొరకకపోతే…మళ్లీ అడవిలోకి వెళ్లాల్సిందే.
వేల సంవత్సరాలు గడిచాయి.
మనిషి మారాడు. అడవులు మారాయి. ఆయుధాలు మారాయి.కానీ… వేట మాత్రం మారలేదు. ఇప్పటికీ ప్రపంచంలోని అతి శక్తిమంతమైన దేశాలు వేటాడుతున్నాయి. ఒక్కటే తేడా. అప్పుడు వేటాడింది జంతువులను. ఇప్పుడు వేటాడుతున్నది ఆయిల్‌ను.
ఒక మాటలో చెప్పాలంటే… ఇది ఆయిల్ హంట్!
ఈసారి వేట భూమి వెనిజువెలా!
భారత్‌కు ఒక సమస్య ఉంది… అమెరికాకు ఒక ప్లాన్ ఉంది. మధ్యలో ఉంది… ప్రపంచాన్ని నడిపించే అత్యంత విలువైన సంపదల్లో ఒకటి. అదే ఆయిల్.
కానీ అసలు మెలిక ఇక్కడే ఉంది. భారత్‌కు కూడా ఆ ఆయిల్ కావాలి. అమెరికాకు కూడా కావాలి. అయితే భారత్ కన్నా ముందే అమెరికా దూకుడుగా పరుగెత్తింది. ముందుగా అక్కడికి చేరింది. ముందుగా తన పంజా విసిరింది. ఒప్పందం చేసుకుంది.
వెనక నుంచి వస్తున్న భారత్ కు ఇప్పుడు సమస్య మొదలైంది. ఎందుకంటే ఆ ఆయిల్
ఎందుకంటే…అమెరికా కంటే తనకే మరింత అత్యవసరం.
అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది కదా? “మనకు కూడా వాటా దొరుకుతుందా?”
ఇదే ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న అసలు కథ.
అమెరికా అక్కడ ఏం కొట్టేసింది?
వెనిజువెలాలో చిన్నపాటి ఆయిల్ బావి ఏమీ లేదు. అక్కడ భూమి కింద ఉన్నది భారీ చమురు సంపద. 17 ఆయిల్ ఫీల్డ్స్. సుమారు 65 బిలియన్ బ్యారెళ్ల నిరూపిత చమురు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో అమెరికా కీలకంగా సీన్ లోకి వచ్చింది. ఒక కొత్త ఏర్పాటులో అమెరికాకు 35 శాతం వాటా లభిస్తోంది. సరే… వాటా తీసుకుంది. అంటే ఉత్పత్తి అయ్యే ఆయిల్లో కొంత ఎక్కువ భాగాన్ని అమెరికా ప్రత్యేక నిబంధనలతో సొంతం చేయగలదు.అంతేకాదు మిగిలిన ఆయిల్ విషయంలో కూడా… ముందుగా అమెరికాకే ఛాన్స్!
అంటే మనం సినిమా టికెట్ కోసం క్యూ లైన్లో నిలబడి చూస్తూంటే..అమెరికా మాత్రం కౌంటర్ దగ్గరికి నేరుగా వెళ్లి… “నాకు ముందు ఇవ్వండి” అన్నట్టే. ఇక్కడే ఇప్పుడు భారత్‌కు టెన్షన్ మొదలవుతోంది.
భారత్‌కు వెనిజువెలా ఆయిల్ ఎందుకు అంత ముఖ్యం?
ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. “మనకు సౌదీ ఉంది కదా… రష్యా ఉంది కదా… వెనిజువెలా కోసం ఇంత హడావుడి ఎందుకు?” . అలాగే ఒకే షాపులో ఎప్పుడూ సరుకులు కొనడం రిస్క్. రేపు ఎప్పుడైనా ఆ షాపు మూసేస్తే? సరుకు అయిపోతే? షాప్ ఓనర్ తో తగువు వస్తే..ధర పెంచితే? అప్పుడు ఇంకో షాపు కావాలి కదా!మరీ ముఖ్యంగా వెనిజులాలో కావాల్సినంత ఆయిల్ ఉంది. అక్కడ మన ఖాతా ఉంటే రేపు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. భారత్ విషయంలో కూడా ఇదే.
మనకు ఆయిల్ కావాలి. బాగా ఎక్కువ కావాలి. అది కూడా రోజూ కావాలి.ప్లో ఆగకూడదు. అందుకే భారత్ ఒక్క దేశంపైనే ఆధారపడదు. రష్యా నుంచి కొంటుంది. మధ్యప్రాచ్యం నుంచి కొంటుంది. అమెరికా నుంచి కూడా కొంటుంది. వీటిన్నటి కన్నా వెనిజువెలా అయితే మరీ బెస్ట్ అనుకుంటోంది.
ఇప్పటికే అక్కడి హెవీ క్రూడ్ మన దేశంలోని కొన్ని రిఫైనరీలకు బాగా ఉపయోగపడుతుంది. అంటే వెనిజువెలా మనకు ఏదో ఎక్స్ట్రా ఆప్షన్ కాదు. అవసరం వచ్చినప్పుడు తెరిచే బ్యాకప్ డోర్ కూడా కాదు.ప్రధాన వనరుగా మారబోతోంది.
కానీ ఇప్పుడు…
ఆ డోర్ ముందు అమెరికా నిలబడుతోంది? రేపు అమెరికా టర్మ్స్ అండ్ కండీషన్స్ చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయిల్ ని అమెరికా తీసుకున్న తర్వాతే మనకు మిగులుతుంది.అప్పుడు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుందా?
ఇక్కడే ఒక విషయం క్లియర్‌గా చెప్పుకోవాలి. అమెరికా భారత్‌కు వెనిజువెలా చమురు దొరకకుండా పూర్తిగా అడ్డుకుంటోందని ఇప్పటివరకు చెప్పలేం. కానీ ఓ రకంగా కాలు అడ్డుపెట్టింది.అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ ఆయిల్ హంట్‌లో చివరి వేటను భారత్ కొట్టేసే అవకాసం ఉంది. ఏం జరుగుతోందో వేచి చూడాల్సిన విషయం.
ఎందుకంటే ఇది అంతర్జాతీయ విషయం. చరిత్ర ఊహించని అతి పెద్ద ఆయిల్ హంట్ సమయం.








